Share News

వైద్య సేవలు మెరుగయ్యేదెన్నడు?

ABN , Publish Date - Aug 05 , 2025 | 01:40 AM

జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పడి రెండేళ్లు పూర్తయ్యాయి. టీచింగ్‌ హాస్పిటల్‌గా ప్రకటించిన జిల్లా జనరల్‌ ఆసుపత్రిలో ఆ స్థాయికి తగిన ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం అంతగా శ్రద్ధ చూపించడం లేదు. జిల్లా జనరల్‌ ఆసుపత్రులను బోధనాసుపత్రుల స్థాయికి తీర్చిదిద్దే విషయంలో అడుగులు వేగంగా పడడం లేదు. జిల్లా కేంద్రంలో ఉన్న ప్రధాన ఆసుపత్రిని రెండేళ్ల క్రితం ఏర్పడిన ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు టీచింగ్‌ హాస్పిటల్‌గా ప్రకటించారు.

 వైద్య సేవలు మెరుగయ్యేదెన్నడు?

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పడి రెండేళ్లు పూర్తయ్యాయి. టీచింగ్‌ హాస్పిటల్‌గా ప్రకటించిన జిల్లా జనరల్‌ ఆసుపత్రిలో ఆ స్థాయికి తగిన ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం అంతగా శ్రద్ధ చూపించడం లేదు. జిల్లా జనరల్‌ ఆసుపత్రులను బోధనాసుపత్రుల స్థాయికి తీర్చిదిద్దే విషయంలో అడుగులు వేగంగా పడడం లేదు. జిల్లా కేంద్రంలో ఉన్న ప్రధాన ఆసుపత్రిని రెండేళ్ల క్రితం ఏర్పడిన ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు టీచింగ్‌ హాస్పిటల్‌గా ప్రకటించారు. 750 పడకలు ఉన్న ఈ ఆసుపత్రిలో 500 నుంచి వెయ్యి మంది వరకు రోగులు ప్రతిరోజు వివిధ పరీక్షలు, చికిత్సల కోసం వస్తుంటారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా, కరీంనగర్‌ జిల్లాలలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలన్నింటి నుంచి ఇక్కడికి అత్యవసర పరిస్థితుల్లో రోగులను పంపిస్తుంటారు. అయినా ఈ ఆసుపత్రిలో ఇంకా మెరుగైన సేవలు అందించడానికి ఏర్పాట్లు మాత్రం లేకుండా పోయాయి.

ఫ అందుబాటులోకి రాని క్రిటికల్‌ కేర్‌ సేవలు

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో 2023 మార్చిన అప్పటి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి టి హరీశ్‌రావు క్రిటికల్‌ కేర్‌ విభాగ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రెండేళ్లకు పూర్తయిన క్రిటికల్‌ కేర్‌ విభాగాన్ని జూలై 28న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ ప్రారంభించారు. కేంద్రం 23.75 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ భవనాన్ని నిర్మించిందని, ఈ భవనాన్ని వినియోగంలోకి తీసుకురావడానికి అవసరమైన సౌకర్యాలు కల్పించడంతోపాటు సూపర్‌ స్పెషాలిటీ వైద్యులను నియమించి రోగులకు సేవలందించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. క్రిటికల్‌ కేర్‌ విభాగానికి నామమాత్రంగా భవనం నిర్మించారుగాని అవసరమైన సూపర్‌ స్పెషాలిటీ డాక్టర్ల నియామకాలు చేపట్టలేదు. ఒక మినీ థియేటర్‌ను నిర్మించి కొన్ని బెడ్స్‌ను ఏర్పాటు చేశారు. మల్టీ పారా మానిటర్స్‌, అడ్వాన్స్డ్‌ టేబుల్స్‌ వచ్చాయి. ఈ విభాగంలో ఉండాల్సిన మూడు పెద్ద ఆపరేషన్‌ థియేటర్ల ఏర్పాటు ఇంకా ప్రారంభం కాలేదు. న్యూరో సర్జరీకి సంబంధించిన పరికరాలు, న్యూరో సీఆర్మ్‌ కార్డియాలజీకి సంబంధించిన పరికరాలు, న్యూరాలజీకి సంబంధించిన పరికరాలు సమకూర్చాల్సిన అవసరం ఉన్నది. క్రిటికల్‌ సేవలు అందించడానికి అవసరమైన సూపర్‌ స్పెషలిస్టు డాక్టర్లు, ఇతర వైద్యులు, సాంకేతిక సిబ్బందిని నియమించాల్సి ఉన్నది.

ఫ గుండె సమస్యలకు అందని వైద్యం

క్యాథ్‌ల్యాబ్‌ లేకపోవడంతో రోగులను ఇక్కడ నుంచి నిమ్స్‌కు గాని, ఎంజీఎంకు గాని, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులకు పంపిస్తున్నారు. క్యాథ్‌ల్యాబ్‌ ఉంటే గుండెపోటుకు గురైన వారికి యాక్సిడెంట్లు, తదితర సందర్భాలలో కార్డియాక్‌ సమస్యలు ఉత్పన్నమైన వారు గాని, అత్యవసర చికిత్స పొందే అవకాశం ఉంటుంది. యాంజియోగ్రామ్‌ నిర్వహించడంతోపాటు అత్యవసర పరిస్థితుల్లో స్టంట్‌ వేసే సౌకర్యం కూడా ఈ క్యాథ్‌ల్యాబ్‌ వల్లనే సమకూరుతుంది. రోడ్డు ప్రమాదాలు జరిగిన సందర్భంలో న్యూరో, ఆర్థో, కార్డియాక్‌ సంబంధిత సేవలు అవసరమవుతాయి. కార్డియాలజీ, న్యూరో సర్జన్‌, న్యూరో ఫిజిషియన్‌, జనరల్‌ సర్జన్‌, జనరల్‌ మెడిసిన్‌, ఎమర్జెన్సీ జనరల్‌ మెడిసిన్‌, న్యూరో ఫిజిషియన్‌, పీడియాట్రిక్‌ విభాగాలకు చెందిన సుమారు 50 మంది ఎండీడీఎం, ఎంఎస్‌ ఎంసీహెచ్‌ సూపర్‌స్పెషలిస్టులను, ఇతర వైద్యులను నియమించాల్సి ఉన్నది. వీరు లేని కారణంగా అత్యవసర సమయాల్లో సత్వర వైద్య సేవలకోసం రోగులు ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తున్నది. ఆయా ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో క్యాథ్‌ల్యాబ్‌, ఇతర సౌకర్యాలు పొందడానికి లక్ష నుంచి మూడు లక్షల రూపాయల వరకు బిల్లులు చెల్లించాల్సి వచ్చి సామాన్యులు అప్పులపాలవుతున్నారు. అటు ప్రజలకు వైద్య సేవలు అందించడం, ఇటు వైద్య విద్యార్థులకు విద్యాభ్యాసం చేసుకునే వీలు కలిగించేందుకు అవసరమైన సూపర్‌ స్పెషాలిటీ విభాగాలను క్రిటికల్‌ కేర్‌ విభాగాన్ని వెంటనే ప్రారంభించాల్సిన అవసరం ఉన్నది.

ఫ మంత్రులు చొరవ తీసుకుంటేనే..

ఉమ్మడి కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల పరిధిలో ఉన్న మంత్రులు దృష్టి సారించి సూపర్‌ స్పెషాలిటీ వైద్యుల నియామకానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వం సూపర్‌ స్పెషాలిటీ నిపుణలకు ప్రభుత్వం ఇస్తున్న వేతనం తక్కువగా ఉన్నందన డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగం చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Aug 05 , 2025 | 01:40 AM