‘మద్దతు’ దక్కేనా..?
ABN , Publish Date - Oct 08 , 2025 | 11:54 PM
వానాకాలంలో పండించిన పంటలకు మద్దతు ధర లభించేనా అని రైతులు ఎదురుచూస్తున్నారు. గత సంవత్సరం పత్తి, వరికి మద్దతు ధర లభించకపోవడంతో చాలా మంది రైతులు తక్కువ ధరలకు పంటలను అమ్ముకున్నారు. ఈ సారి కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలు రైతులకు అందుతాయో.. లేదో.. అని ఎదురు చూస్తున్నారు
హుజూరాబాద్, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): వానాకాలంలో పండించిన పంటలకు మద్దతు ధర లభించేనా అని రైతులు ఎదురుచూస్తున్నారు. గత సంవత్సరం పత్తి, వరికి మద్దతు ధర లభించకపోవడంతో చాలా మంది రైతులు తక్కువ ధరలకు పంటలను అమ్ముకున్నారు. ఈ సారి కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలు రైతులకు అందుతాయో.. లేదో.. అని ఎదురు చూస్తున్నారు. వరి కోతలు దీపావళికి ఊపందుకుంటాయి. ఇప్పటి వరకు కొనుగోళ్ల జాడ లేదు. ఇప్పుడిప్పుడే పత్తి ఏరడం ప్రారంభించారు. కొంత మంది రైతులు ముందుగా పత్తి విత్తనాలు విత్తడంతో పంట చేతికొచ్చింది. ఈ పత్తిని జమ్మికుంట, వరంగల్ మార్కెట్‌కు తీసుకెళితే తేమ పేరుతో వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. జమ్మికుంట మార్కెట్‌లో ఇప్పటి వరకు కొత్త పత్తికి క్వింటాల్‌కు 6,800 రూపాయలు మించి లభించలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట చేతికి వచ్చే దశలో భారీ వర్షాలు కురవడంతో పగితిన పత్తి దెబ్బతిన్నది. నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షాలకు అక్కడక్కడ కోతకు వచ్చిన పొలాలు నేల వాలాయి. డివిజన్‌లో హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక, సైదాపూర్, శంకరపట్నం మండలాలు ఉన్నాయి. అందులో 1.20 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం ఉంది. 80 వేల ఎకరాల్లో వరి, 25వేల ఎకరాల్లో పత్తి, మిగితా 15వేల ఎకరాల్లో మొక్కజొన్న, ఇతర పంటలను సాగు చేశారు. ఈ ఏడాదైనా రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందా అని ఎదురు చూస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా కృషి చేసి మద్దతు ధర కల్పించేలా చూడాలని రైతులు కోరుతున్నారు.
ఫ ప్రభుత్వ మద్దతు ధరలు...
------------------------------------------------------------
పంట ధర (క్వింటాల్‌కు)
-----------------------------------------------------------
వరి (గ్రేడ్ ఎ) 2,389
వరి (సాధారణ రకం) 2,369
పత్తి (పొడవు పింజ రకం) 8,110
పత్తి (మధ్య రకం) 7,710
మొక్కజొన్న 2,400
కందులు 8,000
మినుములు 7,800
పెసలు 8,768
వేరుశనగ (పల్లి) 7,263
పొద్దుతిరుగడు (సన్‌ఫ్లవర్) 7,721
సజ్జలు 2,775
జొన్నలు (హైబ్రిడ్) 3,699
జొన్నలు (మలదండి) 3,749
నువ్వులు 9,846