పత్తికి మద్దతు ధర దక్కేనా..?
ABN , Publish Date - Oct 04 , 2025 | 11:38 PM
పత్తి పంట సీజన్ ప్రారంభమైంది. మార్కెట్‌కు పత్తి రావడం ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పత్తికి మద్ధతు ధర 8110 రూపాయలుగా నిర్ణయించింది. అకాల వర్షాలతో చేతికి వచ్చే పత్తి పంట తడిసి ముద్దవుతుంది. తేమ శాతం అధికంగా ఉండడం, పత్తి మసక బారి పోతుండడంతో వ్యాపారులు క్వింటాల్‌కు గరిష్టంగా 6,200, కనిష్టంగా 4,500 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు.
జమ్మికుంట, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): పత్తి పంట సీజన్ ప్రారంభమైంది. మార్కెట్‌కు పత్తి రావడం ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పత్తికి మద్ధతు ధర 8110 రూపాయలుగా నిర్ణయించింది. అకాల వర్షాలతో చేతికి వచ్చే పత్తి పంట తడిసి ముద్దవుతుంది. తేమ శాతం అధికంగా ఉండడం, పత్తి మసక బారి పోతుండడంతో వ్యాపారులు క్వింటాల్‌కు గరిష్టంగా 6,200, కనిష్టంగా 4,500 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో పత్తి రైతులు తీవ్రంగా నష్ట పోయే అవకాశం ఉంది.
ఫ కానరాని సీసీఐ కొనుగోలు కేంద్రాలు
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొనుగోలు కేంద్రాల జాడ కానరావడం లేదు. ప్రతి ఏటా అక్టోబరు మొదటి వారంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అవుతాయి. ఇప్పటి వరకు వాటి ఊసే లేకపోవడంతో ప్రభుత్వ మద్ధతు ధర దక్కుతుందో లేదో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఏటా అక్టోబరు మొదటి వారంలో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అవుతాయి. రైతులకు మద్ధతు ధర దక్కని సమయంలో సీసీఐ రంగ ప్రవేశం చేస్తుంది. ప్రారంభంలో వచ్చే పత్తిలో తేమ శాతం అధికంగా ఉండడంతో సీసీఐ కొనుగోళ్లకు దూరంగా ఉంటుంది. అక్టోబరు చివరి వారం వరకు మద్ధతు ధర లభించకపోతే నవంబరు మొదటి వారం నుంచి సీసీఐ పత్తి కొనుగోళ్లు చేపడుతుంది. ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై అధికారులు స్పష్టత ఇవ్వలేదు.
ఫ నిబంధనలు కఠినం
సీసీఐ కొనుగోలు చేసిన పత్తిని జిన్నింగ్, ప్రెస్సింగ్ చేసేందుకు ప్రతి ఏటా మిల్లర్లను టెండర్లకు ఆహ్వానిస్తుంది. ఆగస్టు 12న మిల్లుల ఎంపిక కోసం ప్రకటన జారీ చేసి సెప్టెంబరు 1వరకు గడువు విధించింది. జిన్నింగ్ మిల్లర్లు టెండర్లకు దూరంగా ఉన్నారు. సీసీఐ నిబంధనలు కఠినంగా ఉండటంతో తమ మిల్లులను అద్దెకు ఇవ్వొద్దనే ఆలోచనలో వ్యాపారులు ఉన్నట్లు తెలుస్తుంది. క్వింటాల్ పత్తికి ఏ నెల ఎంత దూది ఇవ్వాలనే నిబంధనలు పెట్టారు. గతంలో ఇది నెలవారీగా ఉండేది. ఈ సీజన్‌లో నెలలో రెండు సార్లు ఇవ్వాలని నిబంధన పెట్టారు. బేళ్ల తయారు చేసే సమయంలో గతంలో తరుగుదల 3.15 నుంచి 1.9 శాతం వరకు అనుమతించేవారు. దీనిని 1.25 నుంచి 0.75శాతానికి తగ్గించారు. దీంతో వ్యాపారులు జిన్నింగ్ చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. సీసీఐ నిబంధనలు సడలిస్తే తప్ప టెండర్ల ప్రక్రీయ ముందుకు వెళ్లేలా కనిపించడం లేదు.