Share News

డీసీసీ పీఠం దక్కేదెవరికో!

ABN , Publish Date - Oct 22 , 2025 | 12:57 AM

జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష (డీసీసీ) పదవి ఎవరికి వరించనున్నదో అనే అంశం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏఐసీసీ పరిశీలకుడి అభిప్రాయ సేకరణలో పలువురు నాయకులు ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌ సింగ్‌ పేరును సూచించినప్పటికీ, ఏఐసీసీ నిబంధనలు అడ్డు వస్తున్నాయి.

 డీసీసీ పీఠం దక్కేదెవరికో!

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష (డీసీసీ) పదవి ఎవరికి వరించనున్నదో అనే అంశం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏఐసీసీ పరిశీలకుడి అభిప్రాయ సేకరణలో పలువురు నాయకులు ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌ సింగ్‌ పేరును సూచించినప్పటికీ, ఏఐసీసీ నిబంధనలు అడ్డు వస్తున్నాయి. కొత్త వారిని ప్రోత్సహించాలనే ఉద్ధేశ్యంతో ఏఐసీసీ ప్రస్తుత డీసీసీ అధ్యక్షులకు మరోసారి అవకాశం ఇవ్వవద్దని, పార్టీలో ఐదేళ్ల పాటు క్రమశిక్షణతో పని చేసిన వారికి అవకాశం కల్పించాలని, ప్రజాప్రతినిధుల బంధువులకు అవకాశం ఇవ్వవద్దనే నిబంధనలు విధించింది. రాష్ట్ర వ్యాప్తంగా డీసీసీ అఽధ్యక్షుల నియామకానికి ఏఐసీసీ పరిశీలకులను నియమించింది. తమిళ నాడు మాజీ ఎంపీ డాక్టర్‌ జయకుమార్‌ జిల్లాకు పరిశీలకుడిగా వచ్చారు. ఆయన ఈనెల 14న మంథనిలో పార్టీ సమావేశం నిర్వహించి డీసీసీ అధ్యక్ష పదవి కోసం దరఖాస్తులు స్వీకరించారు. మంథని నియోజకవర్గం నుంచి బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్‌, మాజీ జడ్పీటీసీ చొప్పరి సదానందం, కిసాన్‌ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శశిభూషణ్‌ కాచె, మాజీ జడ్పీటీసీలు గంటల వెంకటరమణారెడ్డి, నాగినేని జగన్మోహన్‌ రావు, మంథని మార్కెట్‌ కమిటీ మాజీ అధ్యక్షుడు అజీంఖాన్‌, రామగుండం నుంచి ఎమ్మెల్యే మక్కాన్‌ సింగ్‌, ఆసంపెల్లి శ్రీనివాస్‌ దరఖాస్తు చేశారు. పెద్దపల్లి నియోజకవర్గం నుంచి రాష్ట్ర బీసీ సెల్‌ నాయకుడు భూషణవేన రమేష్‌, ఉస్మానియా జేఏసీ నాయకులు కోట శ్రీనివాస్‌యాదవ్‌, సీనియర్‌ నాయకులు ఊట్ల వరప్రసాద్‌, చేతి ధర్మయ్య, కల్వల శ్రీనివాస్‌, గోపగాని సారయ్య గౌడ్‌, తదితరులు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. కొందరు నేరుగా దరఖాస్తు చేసుకోగా, మరికొందరు నాయకులు మెయిల్‌ ద్వారా ఏఐసీసీ పరిశీలకుడికి దరఖాస్తులను పంపించారు.

ఫ 19 వరకు అభిప్రాయ సేకరణ..

కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం జిల్లాకు వచ్చిన పరిశీలకులు ఈ నెల 19వ తేదీ వరకు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మన్‌ కుమార్‌, ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్‌ రావు, పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు, మక్కాన్‌ సింగ్‌, ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాద రావుతో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అన్నయ్య గౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్లు, పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, అనుబంధ సంఘాల నాయకుల నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే విజయరమణారావు సూచనల మేరకు జిల్లా అధ్యక్షుడిగా మక్కాన్‌సింగ్‌ పేరునే ప్రతిపాదించినట్లుగా ప్రచారం జరుగుతున్నది. ఆయన మరోసారి డీసీసీ పదవిని చేపట్టేందుకు ఆసక్తిని కనబరుస్తున్నందున, ఆ నియోజకవర్గం నుంచి ఎవరిని కూడా దరఖాస్తు చేయకుండా నిలువరించినట్లు సమాచారం. ఆయన డీసీసీ అధ్యక్షుడు కావడానికి ఏఐసీసీ నిబంధనలు అడ్డువస్తున్నాయి. ప్రస్తుత డీసీసీ అధ్యక్షులకు డీసీసీ పదవి ఇవ్వరాదని ఏఐసీసీ స్పష్టం చేసిందని, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ మీడియా సమావేశంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మక్కాన్‌సింగ్‌కు డీసీసీ పదవి దక్కక పోవచ్చని తెలుస్తున్నది. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఈ జిల్లాకు ప్రస్తుత డీసీసీ అధ్యక్షుల నిబంధన తొలగిస్తే మరోసారి మక్కాన్‌ సింగ్‌ జిల్లా అధ్యక్షుడు అవుతారని అంటున్నారు.

ఫ ఏఐసీసీ పరిశీలనకు ఐదుగురి పేర్లు..

డీసీసీ అధ్యక్ష స్థానానికి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకుల అభిప్రాయ సేకరణ అనంతరం ఏఐసీసీ నిబంధనలను అనుసరించి జిల్లాకు వచ్చిన పరిశీలకులు డాక్టర్‌ జయకుమార్‌ ఐదుగురి పేర్లను అధిష్టానానికి పంపించారని తెలుస్తున్నది. అలాగే ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా మక్కాన్‌ సింగ్‌ పేరును మరో కవర్‌లో పంపించారని సమాచారం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని, పార్టీలో ఐదేళ్ల పాటు క్రమశిక్షణతో పని చేసిన వారిని ఏఐసీసీ చేసిన సూచనల మేరకు షార్ట్‌ లిస్టు చేశారని తెలుస్తున్నది. ఇందులో ప్రధానంగా తొట్ల తిరుపతి యాదవ్‌, శశిభూషన్‌ కాచె, ఊట్ల వరప్రసాద్‌, భూషణవేన రమేష్‌, గోపగాని సారయ్య గౌడ్‌, కోట శ్రీనివాస్‌, గంటల వెంకట రమణారెడ్డి, ఆసంపెల్లి శ్రీనివాస్‌ పేర్లలో ఐదుగురి పేర్లను ఏఐసీసీ పరిశీలనకు పంపించారని ప్రచారం జరుగుతున్నది. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా సమర్థత గల నాయకుడికే డీసీసీ పీఠం కట్టబెట్టే అవకాశాలున్నాయి. పార్టీలో ఉన్న అందరు నాయకులను సమన్వయం చేసుకోవడంతో పాటు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే ప్రతిపక్షాలకు ఎప్పటికప్పుడు కౌంటర్లు వేసే వారికే పార్టీ పగ్గాలు దక్కే అవకాశాలున్నాయి. జిల్లా ఏర్పాటైన తర్వాత మొదట పెద్దపల్లి, ఆ తర్వాత రామగుండం నియోజకవర్గాలకు చెందిన వారికి డీసీసీ పదవులు దక్కగా, ఈసారి మంథని లేదా పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన వారికి దక్కవచ్చనే చర్చ జరుగుతున్నది.

Updated Date - Oct 22 , 2025 | 12:57 AM