Share News

డీసీసీ అధ్యక్ష పీఠం ఎవరికి దక్కేనో?

ABN , Publish Date - Oct 12 , 2025 | 01:12 AM

కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుల నియామకాలపై దృష్టి సారించింది.

డీసీసీ అధ్యక్ష పీఠం ఎవరికి దక్కేనో?

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుల నియామకాలపై దృష్టి సారించింది. ఈ నెలాఖరులోగానే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్న అధిష్ఠానం ఇప్పటికే అందుకోసం పరిశీలకులను నియమించింది. ఏఐసీసీ కర్నాటకకు చెందిన ఎమ్మెల్యే మన్నె శ్రీనివాస్‌ను జిల్లా పరిశీలకుడిగా నియమించగా టీపీసీసీ కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిశీలకుడిగా ఎంపీ చలిమెల కిరణ్‌కుమార్‌రెడ్డిని జిల్లా పరిశీలకురాలిగా ఆత్రం సుగుణను నియమించింది. ఈ పరిశీలకులు ఆదివారం సాయంత్రానికి జిల్లాకు చేరుకొని నాలుగురోజులపాటు వివిధ ప్రాంతాల్లో పర్యటించడమే కాకుండా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడిగా, కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలో కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలను సేకరిస్తారు. కార్యకర్తలు, నేతల నుంచి మద్దతు వచ్చిన ఆరు పేర్లతో వారు అధిష్ఠానానికి ప్రతిపాదనలు పంపిస్తారని సమాచారం. కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడితోపాటు కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడిని నియమించనున్నారు. అన్ని మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని పట్టణాల కమిటీలను జిల్లా స్థాయి కమిటీలుగా పార్టీ భావిస్తున్నది. ఈ నేపథ్యంలో కరీంనగర్‌ డీసీసీతోపాటు కాంగ్రెస్‌ నగర కమిటీకి కూడా అధ్యక్షులను నియమించనున్నారు.

ఫ పోటాపోటీ

కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడిగా ప్రస్తుతం మానకొండూర్‌ శాసనసభ్యుడు డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడిగా కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి పోటాపోటీ వాతావరణం నెలకొన్నది. ప్రస్తుతం కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడిగా ఉన్న కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి సుడా చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. చైర్మన్‌ పదవులు పొందిన వారు అధ్యక్ష పదవిని ఆశించవద్దనే నిబంధనలు ఏమీ లేని నేపథ్యంలో ఆయన ప్రస్తుతం కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్ష పదవిని ఆశిస్తూ రేసులో ఉన్నారు. ఆయనతోపాటు కరీంనగర్‌ పార్లమెంట్‌ స్థానానికి పోటీచేసి పరాజయం పాలైన వెలిచాల రాజేందర్‌రావు, రాహుల్‌గాంధీ టీంలో సభ్యుడిగా ఉన్న రుద్ర సంతోష్‌కుమార్‌, టీపీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్‌కుమార్‌, హౌస్‌ఫెడ్‌ మాజీ చైర్మన్‌ బొమ్మ శ్రీరాంచక్రవర్తి, కాంగ్రెస్‌ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు ఆకారపు భాస్కర్‌రెడ్డి కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు.

ఫ ఎవరికి వారుగా ఆశావహుల ప్రయత్నాలు

ఆశావులు ఇప్పటికే మంత్రులు పొన్నం ప్రభాకర్‌, శ్రీదర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తోపాటు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కలిసి తమకు అనుకూలంగా సిఫారసు చేయాలని కోరారు. వారి మద్దతు కూడగట్టుకోవడానికి ప్రయత్నించడంతో సరిపెట్టుకోకుండా జిల్లా పరిధిలోని అన్ని ప్రాంతాల నేతలను కలిసి పరిశీలకులు వచ్చినపుడు కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్ష పదవికి తమ పేరును సూచించాలని కోరుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ నగర అధ్యక్ష పదవికి వీరిలో నుంచే ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ప్రధానంగా వైద్యుల అంజన్‌కుమార్‌ పేరు ఈ పదవికి పరిశీలనకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు భావిస్తున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆశీస్సులు పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి రాజేందర్‌రావుకు ఉన్నాయని, ఆయనను డీసీసీ అధ్యక్షుడిగానే కాకుండా కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఇన్‌చార్జిగా నియమిస్తారని పార్టీలో ప్రచారం జరుగుతున్నది. పొన్నం ప్రభాకర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్‌ నియోజకవర్గంలో గతంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసిన బొమ్మ శ్రీరాంచక్రవర్తి నియోజకవర్గంలో మద్దతుగా ఉంటూ వస్తున్నారు. ఆయన తన సీనియార్టీని గుర్తించి జిల్లా అధ్యక్ష పదవిని ఇవ్వాలని పొన్నం వద్ద ప్రతిపాదించినట్లు సమాచారం. ప్రస్తుత వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పద్మాకర్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సత్యప్రసన్న అధికారంలో లేనపుడు పార్టీ కోసం పనిచేసిన నేపథ్యం ఉన్న తనకు ప్రమోషన్‌ ఇచ్చి కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలిగా అవకాశం ఇవ్వాలని సమాచారం. రాహుల్‌ గాంధీ టీం సభ్యుడిగా వివిధ ఎన్నికల్లో, వివిధ అంశాల్లో తెరవెనక సభ్యుడిగా పనిచేస్తూ సేవలందిస్తున్న రుద్ర సంతోష్‌కుమార్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి తనకు అవకాశం కల్పించాలని పార్టీని కోరుతున్నట్లు సమాచారం. ఆయన జిల్లా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసిన అల్ఫోర్స్‌ విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ వి.నరేందర్‌రెడ్డి తనకు డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుతున్నారని తెలిసింది. అధ్యక్ష పదవి వీలుకాని పక్షంలో కరీంనగర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి పదవిని ఆయన ఆశిస్తున్నట్లు పార్టీవర్గాలు అంటున్నాయి. గతంలో కరీంనగర్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా, కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడిగా పని చేసిన ఆకారపు భాస్కర్‌రెడ్డి డీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నట్లు తెలిసింది.

Updated Date - Oct 12 , 2025 | 01:13 AM