Share News

అదృష్టం వరించేదెవరినో..?

ABN , Publish Date - Aug 31 , 2025 | 01:04 AM

గణేష్‌ నిమజ్జనోత్సవం ముగిసేలోపు నామినేటెడ్‌ పదవులు భర్తీ చేయాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం యోచిస్తోంది.

అదృష్టం వరించేదెవరినో..?

జగిత్యాల, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): గణేష్‌ నిమజ్జనోత్సవం ముగిసేలోపు నామినేటెడ్‌ పదవులు భర్తీ చేయాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం యోచిస్తోంది. దీంతో జిల్లాలోని అధికార పార్టీ నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నేతలు నామినేటెడ్‌ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. పలువురు ఆశావహులు పదవి దక్కించుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా స్థానిక ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌ నియోజకవర్గ బాధ్యుల అభిప్రాయం మేరకు రూపొందించిన జాబితా అధిష్ఠానం వద్దకు చేరింది.

ఫసామాజిక వర్గాల వారీగా జాబితా..

పదవుల భర్తీలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సామాజికవ వర్గాల సమీకరణకు పెద్దపీట వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల వారీగా ఆశావహుల పేర్లను పీసీసీకి పంపించారు. స్థానిక ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌ నియోజకవర్గ బాధ్యుల నుంచి జాబితాను స్వీకరించారు. అయితే డీసీసీ అధ్యక్షుల ద్వారా పీసీసీకి చేరిన జాబితాపై పార్టీ అధిష్ఠానం క్రాస్‌ చెక్‌ చేసింది. పార్టీ కేడర్‌ అభిప్రాయలను సైతం స్వీకరించారు. అర్హులకు ఇచ్చారా, పార్టీ విధేయులుగానే ఉంటారా తదితర అంశాలపై విచారణ చేశారు.

ఫముందుగా డైరెక్టర్ల పదవుల భర్తీ..

నామినేటెడ్‌ పదవుల్లో ముందుగా కార్పొరేషన్‌ డైరెక్టర్ల పదవులను భర్తీ చేయనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొన్ని కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించి, డైరెక్టర్ల పదవులను పెండింగ్‌లో ఉంచింది. అయితే చైర్మన్లు ఉన్న ప్రతి కార్పొరేషన్‌లో ఖాళీగా ఉన్న డైరెక్టర్ల పదవులను ముందుగా భర్తీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. నామినేటెడ్‌ పదవుల కోసం ఎదురు చూస్తున్న కాంగ్రెస్‌ నాయకులు వారం, పది రోజుల్లో శుభవార్త వినేందుకు ఎదురు చూస్తున్నారు.

ఫనియోజకవర్గానికి రెండు పదవులు..

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రెండేసి పదవులు చొప్పున ఇవ్వనున్నారు. జిల్లాలోని జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కథలాపూర్‌, మేడిపల్లి, భీమారం మండలాలు, చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మల్యాల, కొడిమ్యాల మండలాలకు చెందిన కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తల పేర్లను అధిష్ఠానానికి పంపారు. పార్టీలో అంతర్గత విచారణ సైతం పూర్తయింది. దాదాపు ఆయా అభ్యర్థులకు డైరెక్టర్ల పదవులు వరించబోతున్నాయి.

ఫకార్పొరేషన్‌ చైర్మన్లు సైతం

పార్టీ అధిష్ఠానం ఆలోచన మేరకు నామినేటెడ్‌ పదవుల్లో ప్రధానమైన కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు భర్తీ చేయనున్నారు. డైరెక్టర్ల పదవులతో పాటు చైర్మన్‌ పదవుల భర్తీ ప్రక్రియ జరుగుతుందని సమాచారం. కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎంపికకు ఎమ్మెల్యేలు, జిల్లాకు చెందిన మంత్రి, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జీలు, సీనియర్‌ నేతలు, సీఎం స్థాయిలో ఇప్పటికే కసరత్తు జరుగుతోంది. పీసీసీ, సీఎం స్థాయిలో ఎంపిక చేసిన వారి పేర్లను ఏఐసీసీకి పంపిస్తారు. అక్కడ ఆమోదం తెలిపిన తర్వాత పదవుల పందేరం జరగనుంది. జిల్లా నుంచి రెండు, మూడు పేర్లు కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి రేసులో ఉన్నాయని కాంగ్రెస్‌ వర్గాలు అంటున్నాయి.

Updated Date - Aug 31 , 2025 | 01:04 AM