Share News

వెంట నడిచేదెవరో..!

ABN , Publish Date - Sep 04 , 2025 | 01:35 AM

బీఆర్‌ఎస్‌లో నెలకొన్న తాజా పరిస్థితులు రాజన్న సిరిసిల్ల జిల్లాలో విభిన్నమైన చర్చలకు దారితీశాయి. బీఆర్‌ఎస్‌ నుంచి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను బీఆర్‌ఎస్‌ నుంచి తొలగించడం.. బుధవారం ఆమె పార్టీకి రాజీనామా చేయడమే కాకుండా పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవిని కూడా వదులుకుంటున్నట్లు ప్రకటించారు. గులాబీలో ఏర్పడిన పరిణామాల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌లో కలిసి పనిచేస్తున్న జాగృతి శ్రేణులు అయోమయంలో పడ్డారు.

వెంట నడిచేదెవరో..!

- బీఆర్‌ఎస్‌లో కలిసిపోయిన ‘జాగృతి’ శ్రేణుల్లో సందిగ్ధం

- జిల్లాలో ఇప్పటికీ కవితతో సత్సంబంధాలు

- 2008లోనే సిరిసిల్ల నుంచి జాగృతి పయనం

- తాజా పరిణామాలతో సిరిసిల్ల నియోజకవర్గంలో ఉత్కంఠ

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

బీఆర్‌ఎస్‌లో నెలకొన్న తాజా పరిస్థితులు రాజన్న సిరిసిల్ల జిల్లాలో విభిన్నమైన చర్చలకు దారితీశాయి. బీఆర్‌ఎస్‌ నుంచి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను బీఆర్‌ఎస్‌ నుంచి తొలగించడం.. బుధవారం ఆమె పార్టీకి రాజీనామా చేయడమే కాకుండా పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవిని కూడా వదులుకుంటున్నట్లు ప్రకటించారు. గులాబీలో ఏర్పడిన పరిణామాల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌లో కలిసి పనిచేస్తున్న జాగృతి శ్రేణులు అయోమయంలో పడ్డారు.

జాగృతి తొలి అడుగు సిరిసిల్ల నుంచి..

తెలంగాణ జాగృతి సంస్థ తొలి అడుగులు సిరిసిల్ల నియోజకవర్గం నుంచి మొదలైనట్లు చెప్పుకుంటున్నారు. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి 2009లో అప్పుడు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కే తారకరామారావు బరిలోకి రాకముందే 2008 సంవత్సరంలోనే జాగృతి పేరుతో కవిత పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పలు మండలాల్లో విద్యార్థులకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణతో పాటు కంప్యూటర్‌ శిక్షణ కేంద్రాలను స్థాపించారు. పలు కంపెనీల ప్రతినిధులను తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రయత్నాలు చేశారు. ప్రజా ఉద్యమాలకు మద్దతునిచ్చారు. సిరిసిల్లలో నేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న క్రమంలో వారి కుటుంబాల్లోని మహిళకు కుట్టు శిక్షణ అందించడానికి పరిశీలన చేశారు. ప్రస్తుతం ఇల్లంతకుంట మండలం అన్నపూర్ణ ప్రాజెక్టు వద్ద అనంతగిరి గుట్టలపైన పశ్చిమ చాళుక్యుల నాటి కోట చరిత్రను ప్రజల ముందుకు తీసుకురావడం విశేషం. కవిత కార్యక్రమాలకు వారి బంధువులు మద్దతునిచ్చారు. జాగృతి లోగో సిరిసిల్లలో రూపుదిద్దుకొంది. జాగృతి వైపు యువత ప్రధానంగా ఆకర్షితులవుతూ వస్తున్న క్రమంలోనే 2009లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కేటీఆర్‌ గెలుపొందిన తర్వాత కవిత తన కార్యక్రమాలను తగ్గించారు. జాగృతితో కలిసి పనిచేసిన వారు బీఆర్‌ఎస్‌ పార్టీలోకి మారిపోయారు. కొంతమంది జాగృతి ప్రతినిధులుగా గులాబీ పార్టీలో పనిచేశారు. ప్రస్తుతం గులాబీ పార్టీలో ఉన్న జాగృతి అభిమానులు సందిగ్ధంలో పడిపోయారు.

ఫ కవిత వైపు బీఆర్‌ఎస్‌ అసంతృప్తి నేతల చూపు..

సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ జెండా మోస్తూ సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న వారిలో అసంతృప్తి వీడడం లేదు. కాంగ్రెస్‌, బీజేపీల నుంచి వలస వచ్చిన వారు తిరిగి కొందరు సొంతగూటికి వెళ్లిపోయారు. పార్టీలో ఉన్న వలసదారులకు ప్రాధాన్యం ఉండడంతో తొలినాళ్ల నుంచి పనిచేస్తున్న ఆదరణకు నోచుకోని వారు కవిత వైపు చూస్తున్నారని భావిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికీ కొందరు బీఆర్‌ఎస్‌ నాయకులు కవితతో సత్సంబంధాలు ఉండడంతో ఆమెతో ఎవరు నడుస్తారనే అనే చర్చ జరుగుతోంది.

ఫ కేటీఆర్‌ రావడంలో కవిత కీలకమే

సిరిసిల్ల నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలతో సంబంధాలు పెంచుకుంటున్న క్రమంలో 2009లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కేటీఆర్‌ రావడంలో కవిత కీలకంగానే వ్యవహరించిందని పలువురు చెప్పుకుంటున్నారు. 2009ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ నుంచి ప్రస్తుతం ఇన్‌చార్జిగా ఉన్న కేకే మహేందర్‌రెడ్డికి టికెట్‌ వస్తుందని భావించారు. కానీ అనూహ్యంగా కేటీఆర్‌ అభ్యర్థిగా రావడంలో తన తండ్రి కేసీఆర్‌పై ఒత్తిడి పెంచడానికి సిరిసిల్ల నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్‌ నాయకులను, కేసీఆర్‌ సన్నిహితులు, బంధువులను ఉపయోగించిన విషయాలను చర్చించుకుంటున్నారు. సిరిసిల్ల నియోజక వర్గంలో కవితకు సంబంధాలు ఉండడంతో రాబోయే రోజుల్లో కవిత పార్టీ పెడితే సిరిసిల్ల నియోజకవర్గంలోనూ గులాబీల్లో కదలిక ఏర్పడే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.

Updated Date - Sep 04 , 2025 | 01:35 AM