Share News

డీసీసీ అధ్యక్షుడెవరు?

ABN , Publish Date - Jul 31 , 2025 | 01:11 AM

కాంగ్రెస్‌లో పదవుల పండగకు రంగం సిద్ధమైంది. దీంతో కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్ష పదవి ఎవరికి దక్కనుందనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. వారం రోజుల్లోగా రాష్ట్రంలోని కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్‌ పోస్టుల భర్తీతోపాటు ఇతర నామినేటెడ్‌ పోస్టుల భర్తీ చేయాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయించింది.

డీసీసీ అధ్యక్షుడెవరు?

- కాంగ్రెస్‌లో పదవుల పండగ

- ఒకటి రెండు రోజుల్లో నామినేటెడ్‌ పదవులు

- డీసీసీ అధ్యక్షుడిని మార్చే విషయంలో తర్జనభర్జన

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

కాంగ్రెస్‌లో పదవుల పండగకు రంగం సిద్ధమైంది. దీంతో కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్ష పదవి ఎవరికి దక్కనుందనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. వారం రోజుల్లోగా రాష్ట్రంలోని కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్‌ పోస్టుల భర్తీతోపాటు ఇతర నామినేటెడ్‌ పోస్టుల భర్తీ చేయాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయించింది. దీనికోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు పేర్ల చొప్పున పార్టీ నాయకత్వం సేకరించి వారిని ఆయా పదవుల్లో భర్తీ చేయాలని నిర్ణయించారు. వారం రోజుల్లో పార్టీ గ్రామ, మండల, జిల్లాస్థాయి కమిటీలను ప్రకటించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో జిల్లా అధ్యక్షుడెవరవుతారన్నది చర్చనీయాంశంగా మారింది.

ఫ స్థానిక ఎన్నికల ముందా.. తర్వాతా

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డీసీసీ అధ్యక్షులను ప్రస్తుతం మార్చాలా లేక స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తర్వాత మార్చాలా అన్న విషయంలో నాయకత్వం ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని తెలుస్తున్నది. ప్రస్తుతం ఉన్న డీసీసీ అధ్యక్షుల్లో పలువురు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వారు నియోజకవర్గాల్లో ఎక్కువ పర్యటిస్తూ ఎమ్మెల్యేగా తమ విధులు నిర్వహించే క్రమంలో పార్టీ పని ముందుకు సాగడం లేదనే అభిప్రాయంతో అధ్యక్షులను మార్చాలని నిర్ణయించుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ తర్వాత మూడేళ్లలోగానే అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు రానున్న నేపథ్యంలో పటిష్టమైన కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని అధిష్ఠానం భావిస్తోంది. క్షేత్రస్థాయిలో కొత్త రక్తాన్ని నింపి పలు కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లాలని అనుకుంటోంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపించిన దశలో వారిని మార్చాలా వద్దా అని ఆలోచిస్తున్నట్లు సమాచారం.

ఫ జిల్లాలకు కమిటీలు

జిల్లా అధ్యక్షులను అలాగే ఉంచి జిల్లా కమిటీలను మాత్రం కొత్తగా వేస్తారని తెలిసింది. వారం రోజుల్లో ఈ కమిటీల్లో ఒక్కో నియోజకవర్గం నుంచి ఇద్దరు చొప్పున ఉపాధ్యక్షులను, ఇద్దరు ప్రధాన కార్యదర్శులను, ముగ్గురు కార్యదర్శులను, ఒక అధికార ప్రతినిధిని నియమిస్తారని సమాచారం. జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల నుంచి ఇంతే సంఖ్యలో సభ్యులు ఆ కమిటీలో ఉంటారని తెలిసింది. ఈ పదవుల్లో నియమించేందుకు ఎవరు అర్హులో, మొదటి నుంచి పార్టీలో ఎవరు పనిచేస్తున్నారో, ఎవరు చురుకుగా వ్యవహరిస్తున్నారో పరిశీలించి పేర్లను తీసుకున్నట్లు సమాచారం. కొత్త కమిటీలను వేసి పాత అధ్యక్షులను కొనసాగించే కంటే అధ్యక్షులను నియమిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది.

ఫ రేసులో పలువురు

డీసీసీ అధ్యక్షుడిగా పలువురు రేసులో ఉన్నారు. కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడిగా పనిచేస్తూ ప్రస్తుతం సుడా చైర్మన్‌గా ఉన్న కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, పార్లమెంట్‌ స్థానానికి పోటీచేసిన వెలిచాల రాజేందర్‌రావు, టీపీసీసీ కార్యదర్శి కాశిపాక రాజేశ్‌, ప్రస్తుత వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కోమటిరెడ్డి పద్మాకర్‌ రెడ్డి, కిసాన్‌ సెల్‌ నాయకుడు పత్తి కృష్ణారెడ్డి, పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్‌కుమార్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఆకారపు భాస్కర్‌ రెడ్డి, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న డీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నవారిలో ఉన్నారు. వీరిలో వెలిచాల రాజేందర్‌రావుకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆశీస్సులు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. రాజేందర్‌రావుకు డీసీసీ అధ్యక్ష పదవిని ఇప్పించి కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొనసాగించే ఆలోచనతో మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆయన అభ్యర్థిత్వంపై సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. వైద్యుల అంజన్‌కుమార్‌ కూడా మంత్రి పొన్నంనే నమ్ముకుని ఉన్నారు. అంజన్‌కుమార్‌కు ఏదైనా రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పదవి ఇచ్చే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. పత్తి కృష్ణారెడ్డికి డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వని పక్షంలో కిసాన్‌ సెల్‌లో రాష్ట్రస్థాయిలో కీలక పదవి దక్కవచ్చని తెలిసింది. కోమటిరెడ్డి నరేందర్‌ రెడ్డికి సుడా చైర్మన్‌ పదవి ఉందనే కారణంతో డీసీసీ రేసు నుంచి పక్కనపెడతారని సమాచారం. రాజేందర్‌రావు పేరు చర్చల్లో ఉన్నా పీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కాశిపాక రాజేశ్‌ రాష్ట్ర, జాతీయ స్థాయిలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఎన్‌ఎస్‌యూఐ నుంచి ఎదిగి టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న తనకు అవకాశం కల్పించాలని, అందరిని సమన్వయపర్చుకుని జిల్లాలో పార్టీని ముందుకు తీసుకువెళ్తామని ఆయన చెబుతున్నట్లు సమాచారం. రాహుల్‌గాంధీ కోర్‌ కమిటీలో, ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ టీంలో పని చేసిన వ్యక్తిగా రాజేశ్‌కు టీపీసీసీ, ఏఐసీసీ పెద్దలతో ఉన్న పరిచయాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి తాను మొదటి నుంచి పార్టీలో ఉండడమే కాకుండా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా సేవలందించానని, పూర్తికాలపు అధ్యక్షుడిగా తనను నియమించాలని కోరుతున్నారు.

ఫ మంత్రుల మద్దతు ఎవరికో..

జిల్లా విషయంలో ప్రధానంగా మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నది. జిల్లా రాజకీయాల్లో కీలక వ్యక్తులుగా ఉండాలంటే కరీంనగర్‌ జిల్లా అధ్యక్ష పదవిని, ఇతర ముఖ్య పదవులను తమ అనుచరులకు ఇప్పించుకోవాలని వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు ఏ నామినేటెడ్‌ పోస్టు భర్తీ కాలేదు. చివరికి ఇందిరమ్మ ఇళ్ల కమిటీని కూడా నియమించలేదు. డీసీసీ అధ్యక్ష పదవికి పోటీ పడుతన్నవారిలో ఏమంత్రి ఎవరికి మద్దతు ఇస్తారో, ఎవరు పైచేయిగా నిలిచి తమ వారికి పదవి ఇప్పించుకుంటారో తేలాల్సి ఉన్నది.

ఫ ఒకటి రెండు రోజుల్లో నామినేటెడ్‌ పదవులు...

ఉమ్మడి జిల్లాలో నామినేటెడ్‌ పదవులు ఎవరికి ఇవ్వాలి అన్న విషయంలో ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌గౌడ్‌కు ఇప్పటికే ఎమ్మెల్యేల నుంచి జాబితాలు అందాయని తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా జాబితా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈ విషయంలో ఇప్పటికే కాంగ్రెస్‌ జిల్లా ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌, ఇన్‌చార్జి వైస్‌ ప్రెసిడెంట్‌ రాజేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, టీపీసీసీ ఉపాధ్యక్షుడు బల్మూరి వెంకట్‌, డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, రాజ్‌ఠాకూర్‌ తదితరులు నామినేటెడ్‌ పదవుల విషయంలో చర్చించి జాబితాలను మీనాక్షి నాటరాజన్‌కు అందజేసినట్లు తెలిసింది. త్వరలోనే ఆమె ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడితో కలిసి నియామకాలను ఖరారు చేస్తారని సమాచారం.

Updated Date - Jul 31 , 2025 | 01:11 AM