Share News

డీసీసీ చీఫ్‌ ఎవరో..?

ABN , Publish Date - Oct 12 , 2025 | 01:09 AM

సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్‌ అధిష్టానం దృష్టి పెట్టింది.

డీసీసీ చీఫ్‌ ఎవరో..?

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్‌ అధిష్టానం దృష్టి పెట్టింది. డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ పూర్తిచేసే దిశగా సంఘటన్‌ సృజన్‌ అభియాన్‌ పేరిట ఏఐసీసీ 22 మంది సీనియర్‌ నేతలను పరిశీలకులుగా తెలంగాణకు పంపించింది. వీరు జిల్లాల పర్యటన మొదలుపెట్టారు. ప్రతి జిల్లా నుంచి ఐదు నుంచి ఆరుగురు పేర్లు అక్టోబరు 15 తేదీలోగా హై కమాండ్‌కు పరిశీలకుల బృందం పంపిస్తుంది. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీలో సందడి ఏర్పడింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాల కాలం దగ్గర పడుతున్నా మార్కెట్‌ కమిటీల పదవులు మినహా నామినేటెడ్‌ నజరానాలు, పార్టీ పదవులు లేకపోగా స్థానిక సంస్థల పదవులు కూడా లేక కాంగ్రెస్‌ శ్రేణులు డీలా పడుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నాయకుల్లో ఉత్సాహం నింపే విధంగా పార్టీ సంస్థాగతంగా కమిటీల నియామకం అధిష్ఠానం కసరత్తు ప్రారంభించింది. అయితే జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు డీసీసీ నియామకాలు సమన్వయం చేయడం సవాల్‌గానే ఉంటుందని చర్చ జరుగుతోంది. జూలై మాసంలో గ్రామ, పట్టణ కమిటీలను ఏర్పాటు చేసే దిశగా కసరత్తు ప్రారంభించిన స్థానిక సంస్థ ఎన్నికల నేపథ్యంలో నిలిచిపోయింది తాజాగా జిల్లా కార్యవర్గాల భర్తీకి అధిష్ఠానం కసరత్తు ప్రారంభించడంతో పార్టీలోని సీనియర్‌ నాయకులు పదవులు వరిస్తాయనే ఆశలు పెంచుకున్నారు.

డీసీసీ రేసులో ఆశావహుల పోటాపోటీ...

స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడడంతో త్వరగా జిల్లా కార్యవర్గం పూర్తిచేయాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం భావిస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి దరఖాస్తులు స్వీకరించి అధిష్ఠానానికి నివేదిక పంపించే ప్రక్రియ ముందుకు వచ్చింది. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ పదవులు కూడా గౌరవంగా ఉంటుందని అనేకమంది ఆశావహులు ముందుకు వస్తున్నారు. సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులకు అధ్యక్ష పదవి కట్టబెట్టేందుకు అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ప్రస్తుతం ఉన్న డీసీసీ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ను మరో టర్మ్‌ కొనసాగిస్తారనే చర్చ కూడా జిల్లాలో మొదలైంది. జిల్లాలో ప్రతి మండలం నుంచి సీనియర్లు అధ్యక్ష పదవి రేసులోకి రావడం కమిటీపై ఊహాగానాలు పెరిగాయి. జిల్లాలో అధ్యక్ష పదవి ఆశిస్తున్న వారిలో మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్లు సంగీతం శ్రీనివాస్‌. గడ్డం నర్సయ్య, మాజీ మండలాధ్యక్షుడు వైద్య శివప్రసాద్‌, కాంగ్రెస్‌ బీసీ సెల్‌ అధ్యక్షుడు కుస రవీందర్‌, మాజీ ఎంపీపీ ఉట్నూరు వెంకటరమణారెడ్డి, పార్లమెంట్‌ కో కన్వీనర్‌ కానమేని చక్రధర్‌రెడ్డి, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎల్ల బాల్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి భీమరాజు కనకరాజు, జిల్లా కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య జిల్లా ఉపాధ్యక్షుడు షేక్‌ గౌస్‌, మాజీ జట్పీటీసీ నాగం కుమార్‌, మాజీ కాంగ్రెస్‌ బీసీ సెల్‌ అఽధ్యక్షుడు చంద్రశేఖర్‌ డీసీసీ పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు.

ఆది, కేకేలే కీలకం...

రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్ష, కార్యవర్గ నియామకాల్లో ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డిల సూచనలే కీలకం కానుట్లు చెప్పుకుంటున్నారు. దీంతో ఆశావహులు వారి చుట్టూ చెక్కర్లు కొడుతున్నట్లు తెలుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పడిన తర్వాత తొలి అధ్యక్షుడిగా నాగుల సత్యనారాయణగౌడ్‌ పనిచేశారు. ప్రస్తుతం ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ పార్టీపరంగా జిల్లాలో స్తబ్దత నెలకొందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి గతంలో బీఆర్‌ఎస్‌ పార్టీలోకి వెళ్లినవారు తిరిగి సొంతగూటికి చేరుకున్న వారు ఉన్నారు. ప్రస్తుతం వారు కూడా పార్టీ పదవులకు ముందుకు వస్తుండడంతో పార్టీని నమ్ముకున్న వారి నుంచి వ్యతిరేకతలు మొదలు కావడంతో డీసీసీ నియామకాలపై పార్టీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది.

Updated Date - Oct 12 , 2025 | 01:09 AM