కాంగ్రెస్ ఇన్‌చార్జి ఎవరు?
ABN , Publish Date - May 13 , 2025 | 12:54 AM
జిల్లా రాజకీయాలకు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం కీలక కేంద్రం. అన్ని పార్టీల రాజకీయాలకు ఇదే కేంద్రబిందువై ముందుకు నడిపిస్తుంది.
- రేసులో వెలిచాల, అల్ఫోర్స్ నరేందర్‌రెడ్డి
- అసంతృప్తిలో పాత కాంగ్రెస్ నేతలు
- పారాచూట్ నేతలకు పదవులా.. అంటూ ఆగ్రహం
- గాంధీభవన్‌కు వెళ్లేందుకు ఏర్పాట్లు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
జిల్లా రాజకీయాలకు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం కీలక కేంద్రం. అన్ని పార్టీల రాజకీయాలకు ఇదే కేంద్రబిందువై ముందుకు నడిపిస్తుంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఇన్‌చార్జి లేకుండా పోయాడు. కాంగ్రెస్‌కు జిల్లా అధ్యక్షుడిని నియమించడంలో పార్టీ అధిష్ఠానం కొద్ది నెలలుగా తర్జనభర్జన పడుతున్నది. ఇప్పుడు నియోజకవర్గానికి కూడా ఇన్‌చార్జి లేకుండా పోయాడు.
ఫ ‘పురుమల్ల’ సస్పెన్షన్‌తో..
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఇక్కడ పోటీచేసి ఓడిపోయిన పురుమల్ల శ్రీనివాస్ వ్యవహరిస్తూ వస్తున్నారు. ఆయన ఆ పదవిలో ఉన్నా ఆయన మాట ఏది చెల్లుబాటుకాక ఆయన పంపిన ఏ ప్రతిపాదనకు ఆమోదముద్ర పడక ఉత్సవ విగ్రహంలా ఉండాల్సి వచ్చింది. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తికిలోనై అందుకు కారణం జిల్లాకు చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ అంటూ పలు సందర్భాలలో బాహాటంగా, సమావేశాల్లో పరోక్షంగా వ్యాఖ్యానిస్తూ వచ్చారు. సమావేశాల్లో ఆయన మాట్లాడిన మాటలు ఆన్‌ది రికార్డు కావడంతో ఈ నియోజకవర్గానికే చెందిన కొందరు నేతలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. దీంతో షోకాజ్ నోటీస్ ఇచ్చి ఆయన ఇచ్చిన జవాబుతో సంతృప్తి చెందక టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సస్పెన్షన్ వేటు వేసింది. ఆయన ఇంకా కాంగ్రెస్‌లో తన కథ ముగిసిపోలేదని, త్వరలోనే ముఖ్యమంత్రిని కలిసి కాంగ్రెస్‌లో తన రాజకీయ భవిష్యత్ ఏమిటో చర్చించిన తర్వాత అసలు కార్యాచరణ ప్రకటిస్తానని, ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నానని చెబుతున్నారు. ఆయన ప్రయత్నాలు అలా కొనసాగుతుండగా మరికొందరు నేతలు మాత్రం నియోజకవర్గ ఇన్‌చార్జి పదవిలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఫ ఎవరికి వారే ప్రయత్నాలు
కరీంనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జిగా ఎంపీ స్థానంలో పోటీ చేసి పరాజయంపాలైన వెలిచాల రాజేంందర్‌రావు, పట్టభద్రుల నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన అల్ఫోర్స్ నరేందర్‌రెడ్డి పేర్లు తెరపైకి వస్తున్నాయి. రాజేందర్‌రావు ఇంతకాలం డీసీసీ అధ్యక్ష పదవికోసం పోటీపడుతూ వచ్చారు. ఆ పదవి వ్యవహారం ఎటూ తేలకపోవడంతో దాంతోపాటు ప్రస్తుతం ఖాళీ అయిన నియోజకవర్గ ఇన్‌చార్జి పదవి కోసం కూడా ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిత్వం పొందేందుకు మొదటి స్థానంలో పోటీలో ఉండవచ్చని ఈ పదవి కోసం అందరూ ప్రయత్నిస్తున్నారు. రాజేందర్‌రావుకు మద్దతుగా మాజీ కార్పొరేటర్లతోపాటు మరికొందరు ఇప్పటికే డీసీసీ అధ్యక్ష పదవి అప్పగించాలని కోరడం కోసం గాంధీభవన్‌కు వెళ్లారు. ప్రస్తుతం ఆయన నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలతో ఫోన్‌లో మాట్లాడుతూ తాను ఇన్‌చార్జి పదవి కోసం ప్రయత్నిస్తున్నానని, మద్దతు ఇవ్వాలని కోరుతున్నారని ప్రచారం జరుగుతున్నది. మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్, మంత్రి శ్రీధర్‌బాబు, ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లుగా చెబుతున్న అల్ఫోర్స్ నరేందర్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించవచ్చనే ప్రచారం జరుగుతున్నది. ఈ ఇద్దరు నేతల ప్రచారం చూసిన పాత కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. వీరికి మద్దతు ప్రకటిస్తున్న మాజీ కార్పొరేటర్లందరు ఇతర పార్టీలకు వెళ్లి ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో చేరిన పారాచూట్ నేతలని, వారిని విశ్వాసంలోకి తీసుకుని, పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీని పట్టుకుని ఉన్న తమలాంటి వారిని విస్మరిస్తున్నారని పాత సీనియర్ నేతలందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు జెండా మోసి, ఎన్నికల్లో ఓట్లేయించిన వాళ్లమైన విస్మరించడం ఏమిటని అసంతృప్తిగా ఉన్నారు. వీరంతా రెండు రోజుల క్రితం సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిని కలిసి తమ ఆవేదనను తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుని దృష్టికి, ఇతర ముఖ్యుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లి సీనియర్ కాంగ్రెస్ నేతలకు న్యాయం చేయాలని కోరితే ఆయన వారికి పార్టీ నాయకత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని నచ్చజెప్పినట్లు సవ ూచారం. వారు దాంతో సంతృప్తిచెందక గాంధీభవన్‌కు వెళ్లి తమ గోడు వెళ్లబోసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్, జిల్లా ఇంచార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌లను కలిసి ఈ వ్యవహారంలో తమకు న్యాయం చేయాలని కోరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఫ జిల్లా రాజకీయాల్లో కీలకం
గత నాలుగు ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ గెల్చుకోలేకపోయింది. ఈ నాలుగు ఎన్నికల్లో ఒకసారి పొన్నం ప్రభాకర్, రెండుసార్లు ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లో ఉన్న చల్మెడ లక్ష్మీనరసింహరావు, నాలుగోసారి పురుమల్ల శ్రీనివాస్ కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయారు. వరుసగా ఈ నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి ఒకసారి, బీఆర్‌ఎస్ నుంచి మూడుసార్లు ప్రస్తుత శాసనసభ్యుడు గంగుల కమలాకర్ గెలుస్తూ వచ్చారు. జిల్లా కేంద్రంలో రాజకీయాలకు కీలకమైన కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో స్థానం కోల్పోయిన కాంగ్రెస్ వరుసగా రెండు ఎంపీ ఎన్నికల్లో అభ్యర్థిని గెలిపించుకోలేకపోయింది. ఈ రెండు ఎన్నికల్లో బీజేపీకి చెందిన ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం ఎంపీగా బీజేపీకి చెందిన సంజయ్ కుమార్, ఎమ్మెల్యేగా బీఆర్‌ఎస్‌కు చెందిన గంగుల కమలాకర్ ప్రాతినిధ్యం వహిస్తుండగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో పదవికాలం ముగిసే వరకు బీఆర్‌ఎస్‌కు చెందిన సునీల్‌రావుమేయర్‌గా ఉన్నారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మెజార్టీ ఓట్లు కరీంనగర్‌లోనే ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా, మేయర్‌గా గెలవాలంటే ఆ పార్టీకి గట్టిపట్టు ఉండాల్సి ఉంటుంది. కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో ఈ రెండు స్థానాలు గెల్చుకోవాలంటే తీవ్రంగా చెమటోడ్చాల్సి ఉంటుంది. సమన్వయంతో అందరిని కలిసికట్టుగా నడిపించగలిగి కొత్తవారిని ఆకర్షించి ఆహ్వానించేవారు ఇక్కడ నియోజకవర్గ ఇన్‌చార్జిగా, డీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపడితేనే అది సాధ్యమవుతుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అధిష్ఠానం ఆ దిశగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు.