ఖాళీల భర్తీ ఎన్నడో..?
ABN , Publish Date - Oct 17 , 2025 | 01:23 AM
జగిత్యాల, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): జిల్లా గిరిజన సంక్షేమ శాఖలో ఒకవైపు ఉన్న పోస్టులు భర్తీ కాకపోవడం, మరోవైపు కొత్త పోస్టులు మంజూరు కాకపోవడంతో సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. గిరిజన ప్రజలు, విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఈ శాఖలో ఒకే ఒక్క అధికారి మాత్రమే ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
-గిరిజన సంక్షేమశాఖలో సిబ్బంది కొరత
-ఇద్దరు ఉద్యోగులు ఇతర ప్రాంతాలకు డిప్యూటేషన్లు
-ఇన్‌చార్జి బాధ్యతలతో జిల్లా అధికారి
జగిత్యాల, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): జిల్లా గిరిజన సంక్షేమ శాఖలో ఒకవైపు ఉన్న పోస్టులు భర్తీ కాకపోవడం, మరోవైపు కొత్త పోస్టులు మంజూరు కాకపోవడంతో సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. గిరిజన ప్రజలు, విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఈ శాఖలో ఒకే ఒక్క అధికారి మాత్రమే ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మిగిలిన పోస్టులన్నీ ఖాళీగానే ఉంటున్నాయి. జిల్లా ఏర్పడిన తర్వాత జిల్లా గిరిజన సంక్షేమ అధికారి(డీటీడబ్ల్యూవో)గా నీలిమ కొద్దికాలం పనిచేశారు. యేడాది క్రితం ఆమె బదిలీపై వెళ్లడంతో ఆ పోస్టు ఖాళీగా ఉంటోంది. ఆ స్థానంలో ఫుల్ అడిషనల్ చార్జీ (ఎఫ్‌ఏసీ)గా జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి రాజ్‌కుమార్‌ను నియామకం చేయడంతో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఫపోస్టులన్నీ ఖాళీగానే..
జిల్లా గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో నిబంధనల ప్రకారం ఒక సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు ఆఫీసు సబార్డినేట్లు, ఒక అటెండర్ పోస్టులు ఉండాలి. కానీ ప్రస్తుతం గిరిజన సంక్షేమ శాఖలో పోస్టులు లేకపోవడం, ఉన్న పోస్టులు ఖాళీగా ఉండడంతో ప్రస్తుతం జిల్లా అధికారి మినహా మిగిలిన వారు ఒక్కరు సైతం పనిచేయడం లేదు.
ఫజిల్లాలో ఆరు గిరిజన విద్యాసంస్థలు..
జిల్లా గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఆరు విద్యాసంస్థలు పనిచేస్తున్నాయి. ఇందులో బీర్‌పూర్ మండలం మంగేళలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో 80 మంది విద్యార్థులు, చిత్రవేణి గూడెంలోని బాలుర ఆశ్రమ పాఠశాలలో 70 మంది విద్యార్థులు ఉన్నారు. రాయికల్ మండలం జగన్నాథపూర్ ఆశ్రమ పాఠశాలలో 42 మంది విద్యార్థులు, ధర్మపురి బాలుర వసతి గృహంలో 30 మంది విద్యార్థులు, జగిత్యాలలోని బాలుర వసతి గృహంలో 80 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. గిరిజన విద్యార్థులకు అవసరమైన వసతులు, ఇతరత్రా సదుపాయాలు కల్పించేందుకు సంక్షేమ శాఖ కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే గిరిజన సంక్షేమ శాఖలో పోస్టులు ఖాళీగా ఉండడంతో విద్యార్థులకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు.
ఫడిప్యూటేషన్లతో సమస్యలు..
జిల్లా గిరిజన సంక్షేమ శాఖలో డిప్యూటేషన్ సమస్యలు వేధిస్తున్నాయి. జిల్లా గిరిజన సంక్షేమ అధికారిగా జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రాజ్‌కుమార్ ఎఫ్‌ఏసీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మిగిలిన పోస్టుల్లో పలువురు ఉద్యోగులు ఉన్నప్పటికీ ఇతర ప్రాంతాల్లో డిప్యూటేషన్‌లో పనిచేస్తున్నారు. జగిత్యాల బాలుర వసతి గృహంలో పనిచేస్తున్న వార్డెన్ కరీంనగర్‌కు డిప్యూటేషన్‌లో పనిచేస్తుండగా, మరో మహిళా ఉపాధ్యాయురాలు హైదరాబాద్‌లోని కమిషనరేట్‌లో డిప్యూటేషన్‌లో పనిచేస్తున్నారు. వసతిగృహాల్లో సైతం పలు ఖాళీలున్నాయి. పోస్టులు భర్తీ కాకపోవడం, ఉన్న పోస్టులు ఖాళీగా ఉన్న వ్యవహారాన్ని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో పాటు పలువురు ఉన్నతాధికారుల దృష్టికి పలు పర్యాయాలు తీసుకవెళ్లినప్పటికీ సమస్య పరిష్కారం కావడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అధికారులు స్పందించి ఖాళీలు భర్తీ చేయాలని, కొత్త పోస్టులు మంజూరు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లా
-రాజ్‌కుమార్, జిల్లా ఇన్‌చార్జి గిరిజన సంక్షేమ అధికారి
జిల్లా గిరిజన సంక్షేమ శాఖలో పలు పోస్టులు ఖాళీగా ఉండడం, పలువురు ఇతర ప్రాంతాల్లో డిప్యూటేషన్‌లో పనిచేస్తుండడం, కొత్త పోస్టులు మంజూరు కాకపోవడం వంటి పరిస్థితులను ఉన్నతాధికారులకు నివేదించాం. పోస్టులు ఖాళీగా ఉండడం వల్ల పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అయినప్పటికీ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నయ చర్యలు తీసుకుంటున్నాం.