Share News

ఇందిరమ్మ ఇళ్లకు మోక్షం ఎప్పుడు ?

ABN , Publish Date - May 08 , 2025 | 12:25 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర గడిచినా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఇంకా మోక్షం లభించడం లేదు.

ఇందిరమ్మ ఇళ్లకు మోక్షం ఎప్పుడు ?

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర గడిచినా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఇంకా మోక్షం లభించడం లేదు. మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి పైలెట్‌ ప్రాజెక్టుగా ఇళ్ల నిర్మాణం చేపట్టిన ప్రభుత్వం రెండవ విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేయాలని భావించింది. జిల్లా కలెక్టర్‌ నుంచి పంపించిన ప్రతిపాదనలకు ఇన్‌చార్జి మంత్రి ఆమోద ముద్ర పడితేనే మంజూరు ప్రక్రియ పూర్తయినట్లుగా చెబుతున్నారు. కరీంనగర్‌ జిల్లాకు ఇన్‌చార్జీ మంత్రిగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జిల్లాకు రాడు, పంపిన ప్రతిపాదనలేవి చూడడు అన్నట్లుగా మారిందని కాంగ్రెస్‌ నేతలే వాపోతున్నారు. జిల్లాలోని కరీంనగర్‌, హుజూరాబాద్‌, మానకొండూర్‌, చొప్పదండి నియోజకవర్గాలకు ఒక్కో నియోజకవర్గానికి 3500 చొప్పున 14000 ఇళ్లు, హుస్నాబాద్‌ నియోజకవర్గంలో భాగమైన జిల్లాకు చెందిన చిగురుమామిడి, సైదాపూర్‌ మండలాలకు కనీసం 500 నుంచి వెయ్యి ఇళ్లు మంజూరవుతాయని భావిస్తున్నారు. అయితే అన్ని స్థాయిల్లో ప్రతిపాదనలు పూర్తిచేసినా ఇప్పటికీ ఇళ్లకు మంజూరు లభించడం లేదు. ఈ నెల 5వ తేదీన మంజూరు ఉత్తర్వులు వెలువడతాయని ఖరాకండిగా చెప్పారు. అయితే అలాంటి ఉత్తర్వులేవి రాకపోవడంతో మళ్లీ 10 తారీఖు వస్తాయేమోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోరుతూ 2,11,467 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటి పరిశీలనకే రెండు మాసాలు తీసుకున్న అధికారులు అర్హుల జాబితాను లిస్టు-1, లిస్టు-2, లిస్టు-3గా విభజించి ఖరారు చేసింది. ఇళ్ల స్థలాలు ఉండి ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులను లిస్టు-1లో, ఇళ్ల స్థలాలు లేకుండా దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను లిస్టు-2లో పేర్కొన్నారు. పక్కా ఇళ్లు ఉన్నవారిని మూడవ లిస్టులో నమోదు చేశారు. లిస్టు-3లో ఉన్నవారెవరికి ఇళ్ల మంజూరుకు అర్హత లేదని భావించవచ్చు. 2,11,467 దరఖాస్తులలో ఇళ్ల స్థలాలు ఉండి ఇళ్లు పొందడానికి అర్హత ఉన్నవారు 76,984 మంది, ఇళ్ల స్థలాలు లేక ఇళ్లు పొందడానికి అర్హత ఉన్నవారు 48,989 మంది ఉన్నారని, 78,478 మంది దరఖాస్తుదారులు పక్కాఇళ్లు కలిగి ఉన్నారని అధికారులు గుర్తించారు.

పైలెట్‌ గ్రామాల్లో..

మొదటి విడతలో పైలెట్‌ ప్రాజెక్టు కింద జిల్లాలోని ఒక్కో మండలంలో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని చేపట్టారు. అర్బన్‌ మండలం మినహా 15 గ్రామీణ మండలాల్లోని ఒక్కో గ్రామంలో అర్హులను గుర్తించి 2027 ఇళ్లకు మంజూరు ఇచ్చారు. వీటిలో దాదాపు 1500 ఇళ్లకు ఇంజనీరింగ్‌ అధికారులు మార్క్‌ అవుట్‌ ఇవ్వగా, 300 ఇళ్లు బేస్‌మెంట్‌ పూర్తి చేసుకున్నట్లు చెబుతున్నారు. పైలెట్‌ ప్రాజెక్టులో మంజూరైన ఇళ్ల నిర్మాణ పనులు బేస్‌మెంట్‌లో ఉండగా రెండవ విడత ఇళ్ల మంజూరు ఎప్పుడు అన్నది తేలకుండా ఉన్నది. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం అర్హులను గుర్తించే విషయంలో ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల కారణంగా చాలామంది ఇళ్లు మంజూరు అయ్యే పరిస్థితులు లేవని అంటున్నారు. రెండున్నర ఎకరాలలోపు భూమి ఉండి కారు, ట్రాక్టర్‌ గాని కలిగి ఉండరాదని, గ్రామీణ ప్రాంతాల్లో లక్షా 20 వేలు, పట్టణ ప్రాంతాల్లో లక్షా 50 వేలకు మించి ఆదాయం ఉండరాదని నిబంధనలు విధించారు. స్వంత జాగా ఉన్నవారు రిజిస్ర్టేషన్‌ డాక్యుమెంట్‌ చూపిస్తేనే దాన్ని అంగీకరిస్తున్నారు. ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారందరు విధిగా పాన్‌కార్డును కూడా అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్‌, పాన్‌ కార్డులతో పరిశీలన జరిపి వారి ఆదాయం, ఇతర వాహనాలు ఉన్నవి, లేనివి, స్వంత ఇల్లు, భూమి ఉంటే వాటి వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతే మంజూరు ప్రతిపాదనలు పంపిస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో దరఖాస్తు చేసుకున్నవారిలో ఎక్కువ మందికి ఇళ్లు లభించకపోవచ్చని చెబుతున్నారు. 400 చదరపు అడుగుల నుంచి 600 చదరపు అడుగుల వరకు నిర్మించుకునే ఇళ్లకు మాత్రమే ప్రభుత్వం డబ్బు చెల్లిస్తుందని, అంతకంటే ఎక్కువ నిర్మించుకునేవారికి ఎలాంటి చెల్లింపులు చేయరని చెబుతున్నారు.

Updated Date - May 08 , 2025 | 12:25 AM