ఇందిరమ్మ ఇళ్లు ఇంకెప్పుడు?
ABN , Publish Date - May 31 , 2025 | 01:04 AM
కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పథకాలలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ఒకటి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున నిర్మించి పేదలకు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
- ఎదురుచూపుల్లో కరీంనగర్ నియోజకవర్గ ప్రజలు
- నేతల విభేదాలతో ఏర్పడని ఇందిరమ్మ కమిటీ
- కమిటీ ఆమోదంతోనే ప్రతిపాదనలకు మోక్షం
- సమీక్షలోనూ పెదవి విప్పని నేతలు, ఇన్‌చార్జి మంత్రి
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పథకాలలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ఒకటి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున నిర్మించి పేదలకు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందించి పనులు చేపడుతున్నా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం ప్రజలకు ఆ యోగం పట్టడం లేదు. గ్రామ, జిల్లా స్థాయిల్లో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేసి ఆ కమిటీల పర్యవేక్షణలో లబ్ధిదారులను గ్రామ సభల్లో గుర్తించి జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తారు. ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆమోదంతో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ పూర్తవుతుంది. జిల్లాలోని చొప్పదండి, హుజూరాబాద్, మానకొండూర్ నియోజకవర్గాల్లో ఈ ప్రక్రియను పూర్తిచేసి ఇళ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందించడంతో పాటు ఇళ్ల నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి.
ఫ పెండింగ్‌లోనే ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ మధ్య ఆధిపత్య పోరు జరుగుతున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఏ నిర్ణయం తీసుకోలేక కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇందిరమ్మ ఇళ్ల ప్రతిపాదనలను పెండింగ్‌లో పెట్టారని అంటున్నారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటికీ ఇందిరమ్మ కమిటీలనే ఏర్పాటు చేయలేదు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా బీఆర్‌ఎస్‌కు చెందిన గంగుల కమలాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు సూచించినవారినే ఇందిరమ్మ కమిటీలలో నియమిస్తున్నారు. అయితే ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయి నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న పురుమల్ల శ్రీనివాస్ ఇందిరమ్మ కమిటీలకు సభ్యుల పేర్లతో పాటు మరికొన్ని పదవుల కోసం ప్రతిపాదనలు చేస్తూ ఇన్‌చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి జాబితా పంపించారు. అలాగే సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి కూడా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పట్టణంలోని 60 డివిజన్లలో ఇందిరమ్మ కమిటీలలో చేర్చాల్సిన వారి పేర్లను ఇచ్చారు. వీరిద్దరూ జిల్లాకే చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్‌తో సఖ్యత లేకుండా ఉండడం, వారిద్దరినీ ఆయన మరో మంత్రి శ్రీధర్‌బాబు వర్గీయులుగా గుర్తించి దూరం పెడుతున్న కారణంగా వారి ప్రతిపాదనలు అమలుకు నోచుకోలేదు. అలాగని మంత్రి పొన్నం ప్రభాకర్ ఇందిరమ్మ కమిటీలను వేయించారా అంటే అదీ లేదు.
ఫ జిల్లాలో 11,575 ఇళ్ల మంజూరు
రెండు రోజుల క్రితం కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు పథకం ప్రగతిని పేర్కొన్నారు. జిల్లాలో 11,575 ఇళ్లను మంజూరు కేటాయించారని, ఫేజ్-1లో 2027, ఫేజ్-2లో 5,785 ఇండ్లకు మంజూరు ఇవ్వగా, మరో 3,763 ఇళ్ల మంజూరు ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో జిల్లా రాష్ట్రంలో 8వ స్థానంలో ఉందని, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇందిరమ్మ కమిటీ ఏర్పాటు కాకపోవడంతో అక్కడ 3,270 ఇళ్ల మంజూరు ఇవ్వలేకపోయామని వాటి మంజూరు ఇస్తే జిల్లా రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో జిల్లా ఇంచార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉమ్మడి జిల్లా పరిధిలోని ఇద్దరు మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. సమీక్షా సమావేశంలో జిల్లా కేంద్రంలోనే కమిటీ ఎందుకు ఏర్పాటు కాలేదు, ఇళ్ల మంజూరి ఎందుకు కాలేదు అనే విషయాన్ని చర్చకే తీసుకోకుండా దాటవేశారు.
ఫ కరీంనగర్ నియోజకవర్గంలో పూర్తికాని లబ్ధిదారుల ఎంపిక
జిల్లాలో మొదటి ఫేజ్‌లో ఒక్కో మండలానికి ఒక్కో గ్రామానికి పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుని కరీంనగర్ నియోజకవర్గంలో 230, చొప్పదండి నియోజకవర్గంలో 572, మానకొండూర్ నియోజకవర్గంలో 465, హుస్నాబాద్ నియోజకవర్గంలో 297, హుజూరాబాద్ నియోజకవర్గంలో 463 ఇళ్లను మంజూరు చేశారు. మొత్తం 2,027 ఇళ్లు మంజూరు కాగా 975 ఇళ్లకు మార్క్ అవుట్ ఇచ్చారు. ఇప్పటి వరకు 380 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమై 307 బేస్‌మెంట్ లెవల్‌కు, 65 ఇళ్ల పనులు లెంటల్ లెవల్‌కు, 8 ఇళ్ల పనులు రూఫ్ వేసే లెవల్‌కు చేరుకున్నాయి. 346 ఇళ్లకు బేస్‌మెంట్ లెవల్ వరకు డబ్బు చెల్లించారు.
రెండవ దశలో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం మినహా చొప్పదండిలో 1,537, మానకొండూర్‌లో 1,570, హుస్నాబాద్‌లో 638, హుజూరాబాద్ నియోజకవర్గంలో 2,040, మొత్తం 5,785 ఇళ్లకు మంజూరు ఇచ్చారు. వీటిలో హుస్నాబాద్ నియోజకవర్గంలో 97 ఇళ్లకు, హుజూరాబాద్ నియోజకవర్గంలో 29 ఇళ్లకు, చొప్పదండి నియోజకవర్గంలో ఏడు ఇళ్లకు, మానకొండూర్ నియోజకవర్గంలో మూడు ఇళ్లకు మార్క్ అవుట్ ఇచ్చారు.
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఫేజ్-1లో 230 ఇళ్లకు మంజూరు ఇచ్చారు. కొత్తపల్లి మండలంలోని బద్దిపల్లిలో 194, కరీంనగర్ మండలంలోని బహదూర్‌ఖాన్ పేటలో 106 ఇళ్లకు మంజూరు ఇవ్వగా, 154 ఇళ్లకు మార్క్ అవుట్ పూర్తయింది. 60 ఇళ్ల పనులు ప్రగతిలో ఉన్నాయి. ఇందిరమ్మ కమిటీలు లేని కారణంగా 3,270 ఇళ్లకు ఇంకా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తికాలేదు.