‘సహకారం’ ఎప్పుడో..?
ABN , Publish Date - Nov 16 , 2025 | 01:06 AM
సహకార రంగంలో విస్తృతంగా సేవలందిస్తున్న వ్యవసాయ సహకార పరపతి సంఘాలు విస్తరణకు నిరీక్షించే పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాను విభజించడంతో కొత్తగా మూడు జిల్లాలు ఏర్పడ్డాయి. కొత్త జిల్లాల్లో ఇప్పటివరకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులను ఏర్పాటు చేయలేదు.
- ఐదేళ్లుగా సింగిల్‌విండో ప్రతిపాదనలు పెండింగ్
- కొత్తగా 6 సింగిల్‌విండోల ఏర్పాటుకు ప్రతిపాదనలు
- బిజినెస్ దిశగా ఆరు సహకార సంఘాల్లో మార్పులు
- జిల్లాలో 24 సహకార సంఘాలు
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
సహకార రంగంలో విస్తృతంగా సేవలందిస్తున్న వ్యవసాయ సహకార పరపతి సంఘాలు విస్తరణకు నిరీక్షించే పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాను విభజించడంతో కొత్తగా మూడు జిల్లాలు ఏర్పడ్డాయి. కొత్త జిల్లాల్లో ఇప్పటివరకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులను ఏర్పాటు చేయలేదు. దీనికి తోడుగా దాదాపు ఐదు సంవత్సరాల క్రితమే కొత్తగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఏర్పాటుకు గత ప్రభుత్వం ప్రతిపాదనలు కోరినా పెండింగ్‌లోనే ఉన్నాయి. 2019లో రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి 6 వ్యవసాయ ప్రాథమిక కేంద్రాలను ఏర్పాటు చేయడానికి పంపిన ప్రతిపాదనలు ఈ ప్రభుత్వంలోనైనా మోక్షం లభిస్తుందనే ఆశలు ఉన్నా వరుస ఎన్నికలతో పరపతి పెరిగే అవకాశాలు దూరంగానే కనిపిస్తున్నాయి. గత సంవత్సరం మేలో కేంద్ర మంత్రి మండలి దేశంలో వచ్చే ఐదేండ్లలో 2 లక్షల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. గ్రామానికో సంఘాన్ని ఏర్పాటు చేసి రైతులకు 25 రకాల సేవలు అందించాలని నిర్ణయించారు.
జిల్లాలో పెరుగనున్న పరపతి సంఘాలు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2023 సంవత్సరం మేలో కేంద్ర మంత్రి మండలి నిర్ణయం మేరకైనా అన్నదాతలకు పరపతి సంఘాలు పెరుగుతాయని భావించినా ప్రతిపాదనలో ఆగిపోయాయి. జిల్లాలో ప్రస్తుతం 24 సహకార సంఘాలు ఉండగా, 74728 మంది సభ్యులు ఉన్నారు. ఓటుహక్కు కలిగిన వారు 35776 మంది ఉన్నారు. గత ప్రభుత్వం మండలానికి రెండు సంఘాలు ఉండే విధంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం జిల్లాలో 13 మండలాలు ఉండగా 24 సహకార సంఘాలు ఉన్నాయి. సహకార సంఘాల బలోపేతం చేసే దిశగా వ్యవసాయ సహకార పరపతి సంఘాలను పునర్విభజన చేయాలని, ప్రతి మండలానికి రెండు ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా ఎన్నికల కోడ్ రావడంతో వాయిదా పడుతూ వచ్చింది. ఆ తరువాత వచ్చిన ఆదేశాల మేరకు కసరత్తు చేసినా పనులు నిలిచిపోయాయి. జిల్లాలో ప్రస్థుతం ఉన్న 24 సహకార సంఘాలకు తోడుగా కొత్తగా మరో 6 సంఘాలు పెరగనున్నాయి. మొదటగా పది సంఘాల పెరుగుదలకు ప్రతిపాదనలు పంపించారు. వాటిలో 6 సంఘాలు పెంచే దిశగా ప్రతిపాదనలు ఉన్నాయి. వీటిలో ఇల్లంతకుంట మండలంలో కందికట్కూర్, పెద్దలింగాపూర్, వేములవాడ మండలం చెక్కపల్లి, వీర్నపల్లి, రుద్రంగి, గంభీరావుపేట మండలంలో ఒకటి ఏర్పాటు కానున్నాయి. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు సహకార సంఘాల బలోపేతం నిర్ణయాలు జరుగుతున్నాయి.
వ్యాపార రంగాల్లోకి సహకార సంఘాలు
వ్యవసాయ సహకార పరపతి సంఘాల బలోపేతం వైపు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సహకార రంగంలో వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా రైతులకు విసృత సేవలు అందించే దిశగా చర్యలు తీసుకుంది. సహకార పరపతి సంఘాలను పునర్విభజన చేసే కార్యక్రమాలు జరుగుతుండగానే వ్యాపార రంగాల్లోకి తీసుకవచ్చే దిశగా రైతు ఉత్పత్తిదారుల సంస్థలుగా మార్చుతుంది. ప్రస్తుతం సహకార సంఘాల ద్వారా విత్తనాలు, ఎరువుల విక్రయాలతో పాటు ధాన్యం కొనుగోళ్లతో లాభాలు ఆర్జిస్తున్నాయి. వీటి స్థానంలోనే రైతు ఉత్పత్తిదారుల సంస్థలుగా ఏర్పాటు చేసి ఇతర వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే దిశగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో 311 వ్యవసాయ సహకార పరపతి సంఘాలను రైతు ఉత్పత్తిదారుల సంస్థలుగా మార్పులు చేసింది. దీని ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని వ్యవసాయ పనిముట్లు అందుబాటులోకి తేవడం, ఇతర రంగాల్లోనూ అడుగుపెట్టే దిశగా ముందుకు చర్యలు చేపట్టింది. జిల్లాలో 24 వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో తొలి విడతగా ఆరు సంఘాలను రైతు ఉత్పత్తిదారుల సంస్థలుగా మార్పులు చేసింది. జిల్లాలో వేములవాడ, సనుగుల, నాంపల్లి, అల్మాస్‌పూర్, గంభీరావుపేట, ఇల్లంతకుంట సహకార సంఘాలను రైతు ఉత్పత్తిదారుల సంస్థలుగా మార్పులు చేసి సేవలు అందించనున్నారు. ఈ సంస్థల్లో వాటాదారులుగా చేర్చుకుంటారు. సభ్యులు తమ వాటాకు అనుగుణంగా ఈక్విటీగా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. ఈ సొసైటీలకు ఈక్విటీ వాటాగా కేంద్ర ప్రభుత్వం రూ 15 లక్షల వరకు ఒక్కొ సొసైటీకి మ్యాచింగ్ గ్రాంట్ కింద అందిస్తుంది. మూడు సంవత్సరాల నిర్వహణకు ఏడాదికి రూ 6 లక్షల చొప్పున రూ 18 లక్షలు ఇస్తుంది. ప్రస్తుతం సహకార శాఖ అధికారులు ఉద్యోగులకే రైతు ఉత్పత్తి సంస్థల బాధ్యతలను అప్పగించనుంది. ఈ పథకానికి సంబంధించి ప్రత్యేక క్రెడిట్ గ్యారంటీ కింద నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. ఎన్‌సీడీసీ, నాబార్డ్ ద్వారా ఈ పథకాన్ని అమల్లోకి తీసుకరానున్నారు. రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, సహకార సంఘాలు వేర్వేరు లక్ష్యాలతో ఉన్న ఇవి రెండు ఒకే రకమైన సంస్థలుగా పనిచేస్తాయి. ఎఫ్‌ఫీవోలు ప్రధానంగా రైతుల అదాయం పెంచడానికి ఉత్పత్తులు పెంచడానికి, ప్రాసెసింగ్ చేయడంపై దృష్టి పెడతారు. రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపర్చే దిశగానే రైతు ఉత్పత్తి సంస్థలు పనిచేస్తాయి. ఇందుకు సంబంధించిన ప్రణాళికలు చేస్తున్నట్లు జిల్లా సహకార శాఖ ఆధికారి టి రామకృష్ణ తెలిపారు.
సొసైటీల్లో 74728 మంది సభ్యులు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రస్తుతం 24 సంఘాలు ఉన్నాయి. సంఘాల పరిధిలో 74728 మంది సభ్యులు ఉన్నారు. సిరిసిల్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో 12859 మంది సభ్యులు ఉండగా పెద్దూరు సొసైటీలో 1336 మంది, నేరెల్ల సొసైటీలో 1257 మంది, కోనరావుపేట సొసైటీలో 6196 మంది, కొలనూరు సొసైటీలో 3018 మంది, వేములవాడ సొసైటీలో 8180 మంది, నాంపెల్లి సొసైటీలో 1191 మంది, రుద్రవరం సొసైటీలో 998 మంది, చందుర్తి సొసైటీలో 3369 మంది, సనుగుల సొసైటీలో 1733 మంది, బోయినిపల్లి సొసైటీలో 910 మంది, కోరెం సొసైటీలో 1694 మంది, మాన్వాడ సొసైటీలో 1163 మంది, నర్సింగాపూర్ సొసైటీలో 1684 మంది, ఇల్లంతకుంట సొసైటీలో 3547 మంది, గాలిపెల్లి సొసైటీలో 1680 మంది, ముస్తాబాద్ సొసైటీలో 2082 మంది, పోత్గల్ సొసైటీలో 7169 మంది, గంభీరావుపేట సొసైటీలో 8183 మంది, కొత్తపెల్లి సొసైటీలో 3680 మంది, ఎల్లారెడ్డిపేట సొసైటీలో 3864 మంది, అల్మాస్‌పూర్ సొసైటీలో 2139 మంది, తిమ్మాపూర్ సొసైటీలో 1597 మంది, మానాల సొసైటీలో 199 మంది సభ్యులు ఉన్నారు. సొసైటీలను విస్తరించి వ్యవసాయ పరపతి సంఘాలను బలోపేతం చేయాలని రైతులు కోరుతున్నారు.