రైతుభరోసా అందేదెన్నడో..?
ABN , Publish Date - Nov 20 , 2025 | 01:14 AM
యాసంగి సీజన్ మొదలైనా ప్రభుత్వం రైతు భరోసాపై స్పష్టత ఇవ్వడం లేదు. ఈ యేడాది వానాకాలం సీజన్‌లో అధిక వర్షాల వల్ల పంటలు దెబ్బతినడంతో సాగు కోసం చేసిన అప్పులను రైతులు తిరిగి చెల్లించలేకపోయారు.
జగిత్యాల, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): యాసంగి సీజన్ మొదలైనా ప్రభుత్వం రైతు భరోసాపై స్పష్టత ఇవ్వడం లేదు. ఈ యేడాది వానాకాలం సీజన్‌లో అధిక వర్షాల వల్ల పంటలు దెబ్బతినడంతో సాగు కోసం చేసిన అప్పులను రైతులు తిరిగి చెల్లించలేకపోయారు. దీంతో కొత్తగా అప్పులు పుట్టని దుస్థితి ఏర్పడింది. యాసంగి సీజన్ ప్రారంభమైనా చేతిలో డబ్బులు లేక పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 2,48,550 మంది రైతులు ఉన్నారు. ఇందులో రెండున్నర ఎకరాల్లోపు రైతులు 1,79,86 మంది, రెండున్నర ఎకరాల నుంచి ఐదు ఎకరాల వరకు రైతులు 52,692 మంది, ఐదు ఎకరాల పైన రైతులు 16,032 మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ యేడాది వానాకాలం సీజన్‌లో 2,17,606 మంది రైతులకు రూ. 216 కోట్ల రైతు భరోసాను అందించారు.
ఫపెట్టుబడి ఖర్చుల కోసం..
పెట్టుబడి ఖర్చుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుండా రైతులకు అండగా ప్రభుత్వం రైతు భరోసా పథకం అమలు చేస్తోంది. ఎకరాకు రెండు పంటలకు కలిపి రూ.15 వేల చొప్పున ఇస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. బడ్జెట్ సమస్య కారణంగా ఎకరాకు రూ.12 వేలకు తగ్గించింది. ఈ వానాకాలం సీజన్‌లో తొలుత ఎకరం లోపు, తర్వాత ఎకరం, రెండెకరాలు, మూడు, నాలుగు, అయిదు, ఆపైనా పరిమితి లేకుండా అందరికీ రైతు భరోసా అందించింది. పెట్టుబడి సాయం అందండంతో రైతులు వానాకాలం పంటలను అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. అధిక వర్షాల కారణంగా పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈసారి యాసంగి సీజన్‌లో ఆదుకుంటుందని గంపెడాశతో ఉన్నారు.
ఫజిల్లాలో 3.95 లక్షల ఎకరాల సాగు అంచనా..
జిల్లాలో యాసంగి సీజన్‌లో సుమారు 3,95,555 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారన్న అంచనా ఉంది. ఇందులో ప్రధానంగా వరి పంటను సాగు చేయనున్నారు. జిల్లాలో వరి పంట 3,02,600 ఎకరాలు, మొక్కజొన్న 35,000 ఎకరాలు, నువ్వులు 11,000 ఎకరాలు, మామిడి 38,300 ఎకరాలు, పల్లి 320 ఎకరాలు, జొన్నలు 2,300 ఎకరాలు, మిరప 750 ఎకరాలు, చెరుకు 190 ఎకరాలు, ఆయిల్ ఫామ్ 4,200 ఎకరాలు, పెసర, మినుము, ఆలసంద, ఆవాలు, కందులు తదితర పంటలు 895 ఎకరాల్లో సాగు అవుతుందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో పది నుంచి ఇరవై శాతం హెచ్చు తగ్గులు ఉండవచ్చన్న అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు.
ఫవిత్తనాలు, ఎరువుల అవసరాలు ఇలా..
జిల్లాలో యాసంగి సీజన్‌లో యూరియా 39,100 టన్నులు, డీఏపీ 16,219 టన్నులు, పొటాష్ 8,148 టన్నులు, సూపర్ 5,231 టన్నులు, కాంప్లెక్స్ 36,000 టన్నులు అవసరముంటుందని అంచనా వేశారు. అదేవిదంగా వరి విత్తనాలు 75,750 క్వింటాళ్లు, మొక్కజొన్న 2,176 క్వింటాళ్లు, మినుము 515 క్వింటాళ్లు, పెసర 117 క్వింటాళ్లు, ఆవాలు 46 క్వింటాళ్లు, నువ్వులు 470 క్వింటాళ్లలో అవసరవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈమేరకు ఎరువులు, విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈనేపథ్యంలో ప్రభుత్వం ముందుకు వచ్చి రైతు భరోసా అందించాలని అన్నదాతలు కోరుతున్నారు.