సమగ్ర సర్వే డబ్బులేవి?
ABN , Publish Date - May 08 , 2025 | 12:23 AM
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమ్రగ కుటుంబ ఇంటింటి సర్వే ముగిసి ఆరు నెలలు గడిచింది.
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమ్రగ కుటుంబ ఇంటింటి సర్వే ముగిసి ఆరు నెలలు గడిచింది. అయితే సర్వే చేసిన ఉద్యోగ, ఉపాధ్యాయులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు తమకు రావాల్సిన పారితోషికాల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. దశల వారీగా ఆందోళనకు సిద్ధమవుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను ఉపాధ్యాయులతో పాటు ఉద్యోగులు ఎంతో శ్రమకోర్చి నిర్వహించారు. వీరు చేసిన సర్వే ఫామ్స్‌ను డేటా ఎంట్రీ ఆపరేట్లు కంప్యూటరీకరణ చేశారు. ఈ సర్వే ఆధారంగా కుల గణనకు కేంద్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకొని దేశవ్యాప్తంగా సర్వే చేపట్టాలని ఆమోదం తెలిపింది. ఇంత సమర్థవంతంగా పూర్తిచేసిన సిబ్బందికి మాత్రం రెమ్యూనరేషన్ చెల్లింపులు మాత్రం జరగడం లేదు. రెమ్యూనరేషన్ కోసం ఎదురుచూసిన డేటా ఎంట్రీ ఆపరేటర్లు, విడతల వారీగా నిరసనలు తెలపడానికి సిద్ధమయ్యారు. గత మార్చి 18న, ఈనెల 5న వినతిపత్రాలు అందించారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో పోరాటాలు చేయాలని భావించారు.
జిల్లాలో 1.93 లక్షల కుటుంబాల వివరాల సేకరణ..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 మండలాలు, సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో 1,531 బ్లాక్‌లుగా విభజించి లక్షా 93 వేల 838 కుటుంబాలను ఉపాధ్యాయులు, ఉద్యోగులు, ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లుగా సర్వేలు చేశారు. సర్వే సమయంలో కొన్నిసార్లు కుటుంబ సభ్యులు లేకపోయినా తిరిగి మళ్లీ వెళ్లి వివరాలు నమోదు చేశారు. సామాజిక ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల గణనకు సంబంధించిన వివరాలను ఎన్యుమరేటర్లు నమోదు చేయడానికి కనీసం గంట సమయం వరకు పట్టింది. ఆ తరువాత మండలాలు, జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్లతో కంప్యూటరీకరణ చేశారు. మహిళా ఉద్యోగులు సైతం ఇంటింటికి ఎంతో ఉత్సాహంగా వెళ్లి సర్వే నిర్వహించినా రెమ్యూనరేషన్ కోసం మాత్రం నిరీక్షించక తప్పడం లేదు.
జిల్లాలో రెమ్యూనరేషన్ బకాయిలు రూ.2.10 కోట్లు
జిల్లాలో డేటా ఎంట్రీ ఆపరేట్లు, ఎన్యుమరేటర్లు, 2వేల మంది వరకు భాగస్వాములు అయ్యారు. వీరిలో ఎన్యుమరేటర్లకు రూ.10 వేలు, సూపర్‌వైజర్లకు రూ.12 వేల చొప్పున చెల్లిస్తామని ప్రభుత్వం నిర్ణయించింది. వీరితో పాటు ఒక ఫాం కంప్యూటరీకరణ ఆన్‌లైన్ చేస్తే ప్రభుత్వ ఉద్యోగులైతే రూ.15, ప్రైవేటు డేటా ఎంట్రీ ఆపరేటర్లకు రూ.30 చొప్పున చెల్లించాల్సి ఉంది. దీనికి అనుగుణంగా ఉత్తర్వులు కూడా జారీచేసింది. ప్రభుత్వం వారం రోజుల్లోనే రెమ్యూనరేషన్ చెల్లిస్తుందని భావించినా నిరాశే మిగిలింది. ఆపరేటర్ల బ్యాంక్ ఖాతా వివరాలు కూడా తీసుకున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లలో నిరుద్యోగ యువత, డిగ్రీ, బీటెక్, ఎంబీఏ విద్యార్థులు పోటీ పరీక్షలకు ఇతర, ఫీజులకు ఉపయోగపడుతాయని డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా మారి పనిచేశారు. సర్వే పూర్తయి ఆరునెలలు గడిచినా అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అధికారులు మాత్రం ప్రభుత్వానికి నివేదిక పంపించామని ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదని చెబుతున్నారు. మరో వారం రోజుల్లో రెమ్యూనరేషన్ రాని పక్షంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆందోళనకు సిద్ధమని ప్రకటించారు. వీరితో పాటు రెమ్యూనరేషన్ కాకుండా ఫాంలు ప్రింటింగ్ చేసిన వాళ్లు తమకు రావాల్సిన రూ.10 లక్షల బకాయిల కోసం తిరుగుతున్నారు.
జిల్లాలో జరిగిన సమగ్ర సర్వే వివరాలు...
మండలం బ్లాక్‌లు పూర్తయిన కుటుంభాలు
రుద్రంగి 39 5,097
చందుర్తి 76 11,343
వేములవాడ రూరల్ 57 8,173
బోయినపల్లి 104 12,414
వేములవాడ 48 6,836
కోనరావుపేట 117 15,060
వీర్నపల్లి 64 4,520
ఎల్లారెడ్డిపేట 122 17,243
గంభీరావుపేట 115 14,670
ముస్తాబాద్ 131 16,575
తంగళ్లపల్లి 127 17,071
ఇల్లంతకుంట 154 17,279
సిరిసిల్ల మున్సిపల్ 231 31,601
వేములవాడ మున్సిపల్ 146 15,956
----------------------------------------------------------------------------------------------------
మొత్తం 1,531 1,93,838
-----------------------------------------------------------------------------------------------------