Share News

‘చేయూత’ ఏదీ?

ABN , Publish Date - Nov 13 , 2025 | 12:56 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే రెండేళ్లు దగ్గర పడుతున్నా కూడా చేయూత పథకం కింద కొత్త పింఛన్‌లను మంజూరు చేయకపోవడమే కాకుండా, ఉన్నపింఛన్‌ల సొమ్మును పెంచి ఇస్తామన్న హామీ ఇప్పటివరకు నెరవేరలేదు.

 ‘చేయూత’ ఏదీ?

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే రెండేళ్లు దగ్గర పడుతున్నా కూడా చేయూత పథకం కింద కొత్త పింఛన్‌లను మంజూరు చేయకపోవడమే కాకుండా, ఉన్నపింఛన్‌ల సొమ్మును పెంచి ఇస్తామన్న హామీ ఇప్పటివరకు నెరవేరలేదు. దీంతో పింఛన్లు పెంచుతారని ఆశతో పింఛన్‌దారులు ఎదురు చూస్తుండగా, కొత్త పింఛన్లు ఎప్పుడు మంజూరు చేస్తారా అని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలో మొత్తం 96,641మందికి ప్రస్తుతం పింఛన్‌లు అందుతున్నాయి. ఇందులో వృద్ధాప్య పింఛన్లు 41,055మంది, వితంతు పింఛన్లు 32,955మంది, దివ్యాంగుల పింఛన్లు 13,123మంది, గీత కార్మికులు 2200, చేనేత కార్మికులు 807మంది, బీడీ కార్మికులు 700మంది, ఒంటరి మహిళలు 2215 మంది, బోదకాలు బాధితులు 341మంది, ఇతరులు 1,246మందికి నెలనెలా పింఛన్లు అందుతున్నాయి. దివ్యాంగులకు నెలకు 3,016 రూపాయలు, ఇతరులకు 2,016రూపాయల పింఛన్లు ఇస్తున్నారు. 2023నవంబర్‌ చివరలో జరిగిన రాష్ట్ర ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌పార్టీ తాము అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీ పథకాలతోపాటు ఇతర పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగా చేయూత పథకం కింద దివ్యాంగుల పింఛన్లను 3,016 నుంచి 6వేల రూపాయలు, ఇతర పింఛన్‌లను 2,016రూపాయల నుంచి 3 వేల రూపాయలకు పెంచుతామని ప్రకటించారు. కానీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా, ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ప్రభుత్వం పింఛన్ల ఊసెత్తడం లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబర్‌26నుంచి జనవరి 8వతేదీ వరకు గ్రామ, పట్టణ సభలు నిర్వహించి ఐదు గ్యారెంటీ పథకాలకు దరఖాస్తులను స్వీకరించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా చేయూత పథకం కింద దివ్యాంగుల కోసం 6,979దరఖాస్తులు రాగా, ఇతరులు 49,552 మంది, మొత్తం 56,531దరఖాస్తులు వచ్చాయి. కానీ రెండేళ్లు ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క కొత్తపింఛన్‌ కూడా మంజూరు చేయలేదు. కేవలం మరణించే పింఛన్‌ దారుల స్థానంలో ఆ కుటుంబానికి చెందిన అర్హులైన వారికి మాత్రమే కొత్తవి మంజూరు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఇప్పటివరకు కొత్తవారికి ఒకరికి కూడా పింఛను మంజూరు చేయలేదని తెలుస్తున్నది. అంతేకాకుండా ప్రభుత్వం ప్రస్తుతం కొనసాగిస్తున్న పింఛన్లను పెంచుతుందని లబ్ధిదారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఎక్కడ కూడా చేయూత పింఛన్ల గురించి ఊసెత్తక పోవడంతో అసలు కొత్తపింఛన్లు మంజూరు చేస్తుందా, లేదా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఉన్న పింఛన్లను కూడా పెంచే పరిస్థితి లేదని తెలుస్త్తున్నది. కనీసం భర్త చనిపోయి వితంతువులు అయిన వారిని ఆదుకునేందుకు కూడా ప్రభుత్వం కొత్త పింఛన్లను మంజూరు చేయక పోవడంతో వారు చేయూత లేక తీవ్రఇబ్బందులు పడుతున్నారు. ప్రజాపాలన గ్రామ పట్టణ సభల సందర్భంగా స్వీకరించిన దరఖాస్తులను ఇప్పటివరకు పరిశీలించిన దాఖలాలు అసలే కనబడడం లేదు. కేవలం ఆన్‌లైన్‌ మాత్రమే వాటిని నమోదు చేసి ఉంచారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి కొత్త పింఛన్లు మంజూరు చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.

Updated Date - Nov 13 , 2025 | 12:56 AM