చదువు ‘కొనే’దెలా..!
ABN , Publish Date - Jun 12 , 2025 | 02:40 AM
జూన్ నెల వచ్చిందంటే పేద, మధ్య తరగతి ప్రజల గుండె గుబేల్‌మంటుంది.
జగిత్యాల అగ్రికల్చర్, జూన్ 11(ఆంధ్రజ్యోతి): జూన్ నెల వచ్చిందంటే పేద, మధ్య తరగతి ప్రజల గుండె గుబేల్‌మంటుంది. పిల్లల ఫీజులు, పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్స్, బూట్లు, టై, బెల్ట్, బ్యాగుల కొనుగోలు కోసం వేలల్లో ఖర్చు చేయాల్సి రావడంతో తల్లితండ్రులపై ఆర్థికంగా భారం పడుతోంది. ఫీజులపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో పలు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి సంవత్సరం ఫీజులు పెంచుకుంటూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం గాని, విద్యాశాఖ అధికారులు గాని చర్యలు తీసుకోవడం లేదని పలువురు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. జిల్లాలోని కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు సూళ్లలోనే ప్రత్యేక కౌంటర్ తెరచి పుస్తకాలు, నోట్‌బుక్కులు విక్రయిస్తున్నాయి. యూనిఫాంలు సైతం కేవలం వారు సూచించిన షాపుల్లోనే అందుబాటులో ఉంటున్నాయని పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు, నోట్ బుక్‌లు విక్రయిస్తే తక్షణమే పాఠశాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.
ఫనామమాత్రంగా బడిబాట
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన, నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశ్యంతో సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే చాలా చోట్ల నామమాత్రంగానే కార్యక్రమాల నిర్వహణ జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తేనే బడి బాట ఆశించిన ఫలితాన్ని ఇస్తుందని పలువురు విద్యావేత్తలు అంటున్నారు.
ఫస్కావెంజర్లు లేక అవస్థలు
ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపర్చాలనే లక్ష్యంతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మన ఊరు మన బడి పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 274 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసింది. ఇందులో కొన్ని పూర్తవగా, మరికొన్ని పనులు పూర్తికాక విద్యార్థులకు ఇబ్బందికరంగా మారింది. దీనికి తోడు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలలను తెరపైకి తెచ్చి మన ఊరు మన బడిపై ఎలాంటి శ్రద్ధ వహించకపోవడంతో కొన్ని పాఠశాలల్లో పునాదులకే పనులు పరిమితమై విద్యార్థులకు తరగతి గదులు సైతం లేక ఇబ్బందికరంగా మారింది. దీంతో పాటు కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా మూత్రశాలలు, మరుగుదొడ్లు లేవు. మధ్యాహ్న భోజనంపై సరియైున పర్యవేక్షణ లేకపోవడంతో నిర్వాహకులు మెనూ పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రత, పాఠశాల నిర్వహణ నిమిత్తం స్కావెంజర్‌లను నియమించాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో పాఠశాలల్లో పరిశుభ్రత పరిస్థితి ప్రహసనంగా మారింది. పంచాయితీ, మున్సిపల్‌లకు పారిశుధ్య బాధ్యతలు అప్పగించినా ఆశించిన స్థాయిలో ఫలితం లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థులు, పోషకులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.
ధర్నాలు చేస్తే తప్ప స్పందించడం లేదు
-అక్రమాలిక్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి
ప్రైవేట్ పాఠశాలలపై విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. పాఠశాలల్లో పుస్తకాల విక్రయాలు, గుర్తింపు లేని పాఠశాలలపై సమాచారం ఉన్నా విద్యాశాఖ అధికారులు స్పందించడం లేదు. విద్యార్థి సంఘాలుగా తాము వెళ్లి ధర్నా చేస్తే తప్ప స్పందించడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలి.
స్కావెంజర్లను నియమించాలి
-బోయినిపెల్లి ఆనందరావు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు
ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రత ప్రధాన సమస్యగా మారింది. స్కావెంజర్లు లేకపోవడంతో పాఠశాలల్లో ఇబ్బందులు పడుతున్నాం. స్కావెంజర్ల నియామకం చేపట్టి పాఠశాలకు ఒక స్కావెంజర్ ఉండేలా, విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నచోట ఇద్దరు స్కావెంజర్‌లను నియమించాలి. కావున ప్రభుత్వం స్కావెంజర్‌ల నియామకానికి చొరవచూపాలి.
నిబంధనలు పాటించకుంటే చర్యలు
-రాము, డీఈవో
జిల్లాలోని పాఠశాలల నిర్వహణ తీరును నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. నిబంధనలు పాటించని పాఠశాలలపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. బడిబాట కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా నడుస్తోంది. ఎక్కడైనా అలసత్వం ప్రదర్శించినట్లు మా దృష్టికి వస్తే విచారించి చర్యలు తీసుకుంటాం. ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు.
జిల్లాలో పాఠశాలలు, విద్యార్థుల వివరాలు:
జిల్లాలో మొత్తం ప్రాథమిక పాఠశాలలు..
ప్రభుత్వం 518, ప్రైవేట్ 13 ...మొత్తం - 531
ప్రాథమికోన్నత పాఠశాలలు
ప్రభుత్వం- 90, ప్రైవేట్ 136 ...మొత్తం - 226
ఉన్నత పాఠశాలలు
ప్రభుత్వం- 236, ప్రైవేట్ 124 ...మొత్తం - 360
మొత్తం ప్రభుత్వ పాఠశాలలు-844
మొత్తం ప్రైవేట్ పాఠశాలలు-273
గత సంవత్సరం ప్రభుత్వ విద్యార్థులు- 39,958
ప్రైవేట్ విద్యార్థులు- 55,967
మొత్తం విద్యార్థులు- 95,925