‘అంగారిక’లో ఏవీ వసతులు?
ABN , Publish Date - Sep 14 , 2025 | 01:06 AM
తిమ్మాపూర్ మండలం రామకృష్ణాపూర్‌కాలనీ గ్రామపంచాయతీ పరిధిలో రాజీవ్ స్వగృహకు చెందిన స్థలాన్ని 819 ప్లాట్లుగా విభజించి బహిరంగ వేలం ద్వారా ప్రభుత్వం విక్రయించింది.
కరీంనగర్ టౌన్, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): తిమ్మాపూర్ మండలం రామకృష్ణాపూర్‌కాలనీ గ్రామపంచాయతీ పరిధిలో రాజీవ్ స్వగృహకు చెందిన స్థలాన్ని 819 ప్లాట్లుగా విభజించి బహిరంగ వేలం ద్వారా ప్రభుత్వం విక్రయించింది. ఈ ప్లాట్లకు అంగారికా టౌన్‌షిప్ అని పేరు పెట్టింది. ఈ టౌన్‌షిప్‌లో మూడేళ్లు అవుతున్నా కనీస సౌకర్యాలు కల్పించలేదు. దీంతో టౌన్‌షిప్‌లో ప్లాట్లు కొనుగోలు చేసిన ఓనర్లు ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. ఈనెల 19న కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా చేపట్టి కలెక్టర్‌కు, మంత్రులు, ఎమ్మెల్యేలకు వినతిపత్రాల ద్వారా తమ గోడును వినిపించేందుకు సిద్ధమవుతున్నారు.
ఫ ప్రీబిడ్ సమావేశంలో హామీలు
ప్లాట్ల వేలానికి ముందు అధికారులు ప్రీబిడ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగారిక టౌన్‌షిప్‌ను అద్భుతంగా తీర్చిదిద్దుతామని, విశాలమైన రోడ్లు, డ్రైనేజీలు, నీటి వసతి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే 47 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. గజం కనీస ధర ఆరు వేలు, కమర్షియల్ ధర ఎనిమిది వేలు రూపాయలుగా నిర్ణయించారు. ప్రభుత్వం నిర్మించే టౌన్‌షిప్ కావడంతో తొందర్లోనే అభివృద్ధి చెందుతుందని, ఎలాంటి మోసాలు ఉండవని, నిర్భయంగా ప్లాట్లు కొనుగోలు చేసుకొని ఇళ్లు కట్టుకోవచ్చని ప్రజలు భావించారు. గజం ఎనిమిది వేల నుంచి 28 వేల రూపాయల వరకు చెల్లించి ప్లాట్లు కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీంతో ప్రభుత్వానికి 147 కోట్ల ఆదాయం సమకూరింది. 2022 జూన్‌లో ప్లాట్ల వేలం పాటను ప్రారంభించి 2023 నవంబరు వరకు 787 ప్లాట్లను విక్రయించారు. ఎందరో రిటైర్డు ఉద్యోగులు, మధ్యతరగతి జీవులు, ఎగువ మధ్యతరగతి వర్గాల ప్రభుత్వం నిర్ణయించిన ధరకంటే నాలుగు రెట్లు ఎక్కువే చెల్లించి వేలంలో ప్లాట్లను కైవసం చేసుకున్నారు.
ఫ కనీస సౌకర్యాలు కరువు
ప్లాట్లను కొనుగోలు చేసిన యజమానులు ఏడాదికాలంపాటు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు టౌన్‌షిప్‌లో మౌలిక సదుపాయాలను కల్పిస్తుందని ఆశించారు. ప్లాట్ల విక్రయం తర్వాత టౌన్‌షిప్ వైపు కన్నెత్తి చూసే అధికారులే లేకుండా పోయారు. దీంతో టౌన్‌షిప్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్‌గా ఏర్పడి ప్లాట్ల విక్రయాల సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ కలెక్టర్, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర అధికారులందరిని కలిసి వినతిపత్రాలు సమర్పించారు. ఒక ప్లాట్ యజమాని అనేక ఇబ్బందులుపడి ఇల్లు నిర్మించుకున్నాడు. మూడేళ్లుగా టౌన్‌షిప్‌లో ప్రభుత్వం రోడ్లు, డ్రైనేజీలు, విద్యుద్దీపాలు, మంచినీటి వసతి లాంటి కనీస సౌకర్యాలకల్పనకు కూడా పూనుకోకపోవడంతో ప్లాట్ల యజమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్లాట్ల అమ్మకాలు పూర్తయిన తర్వాత అధికారులు మొ్కుబడిగా 5.18 కోట్లు కేటాయించారు. దీంతో విద్యుత్ పోల్స్‌ను, ట్రాన్సఫార్మర్లను వేసి విద్యుత్ సౌకర్యం కల్పించారు. ఆ పనులను కూడా పూర్తిచేయలేదు. వీధి దీపాలను బిగించలేదు. అక్కడ ఇళ్లు నిర్మించుకున్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతూ రాత్రి వేళల్లో భయాందోళనకు గురవుతున్నా విద్యుత్‌శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. రోడ్లుగానీ, డ్రైనేజీల పనులుగానీ చేపట్టక పోవడంతో ప్లాట్ల యజమానులు తమతమ ప్లాట్లలోకి వెళ్లి పనులు చేపట్టుకునే అవకాశం లేకుండా పోతున్నది. సుడా పరిధిలో వచ్చే ఈ టౌన్‌షిప్ అభివృద్ధి బాధ్యతను ఆ సంస్థనే చేపట్టాల్సి ఉన్నది. గత ఏడాది సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి అంగారిక టౌన్‌షిప్ అభివృద్ధికి 20 కోట్లరూపాయల అవసరమవుతాయని ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించారు. అవి ఆచరణకు నోచుకోలేదు. 147 కోట్ల రూపాయల ఆదాయం పొందిన ప్రభుత్వం మరో 10 కోట్ల విలువ చేసే ప్లాట్లు అమ్ముకునే వీలున్నది. తొలుత చేసిన ప్రతిపాదనల మేరకు 47 కోట్లను వెంటనే కేటాయించి కనీస సౌకర్యాలను కల్పించాలని ప్లాట్ల యజమానులు డిమాండ్ చేస్తున్నారు. టౌన్‌షిప్‌లో మిగిలిన 47 ప్లాట్లను విక్రయించేందుకు అనుమతి ఇవ్వాలంటూ కలెక్టర్ ప్రతిపాదనలు పంపించడంతో ప్లాట్ల యజమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
ఫ మూడేళ్లయినా అమలుకు నోచుకోని హామీలు
- ఎం రఘుశంకర్‌రెడ్డి, అంగారిక టౌన్‌షిప్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
రాజీవ్ స్వగృహ స్థలాన్ని ప్లాట్లుగా అమ్ముకున్న ప్రభుత్వం 147 కోట్ల రూపాయలు ఖజానాకు జమచేసుకొని రెండేళ్లు గడుస్తున్నా అంగారిక టౌన్‌షిప్‌లో కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. ప్రీబిడ్ సమావేశాల్లో అధికారులు ఇచ్చిన హామీ మేరకు రోడ్లు, డ్రైనేజీలు, నీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం, పార్కులు కల్పించాల్సిన అవసరమున్నది. ప్రధానంగా సీసీ రోడ్లు వేస్తామని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తామని, అందరికీ రక్షిత మంచినీటి వసతి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీలను విశ్వసించే వేలంలో ఎక్కువ ధర చెల్లించి ప్లాట్లు కొన్నాం. ప్రభుత్వం ఇచ్చిన హామీలను మరిచిపోయి సౌకర్యాల కల్పనను విస్మరించింది. వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 19న కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి కలెక్టర్‌కు, మంత్రులు, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు సమర్పిస్తాం. అప్పటికి స్పందించకుంటే దశలవారీగా ఆందోళనలు చేపట్టడంతోపాటు సీఎం వరకు ఈ సమస్యను తీసుకెళ్ళి న్యాయం జరిగే వరకు పోరాడతాం.