వినాయక చవితికి ఏర్పాట్లు ఏవి?
ABN , Publish Date - Aug 21 , 2025 | 11:50 PM
వినాయక చవితి వచ్చేసింది. గణనాథుడికి సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. అసంపూర్తిగా వదిలిపెట్టిన రోడ్లు, వర్షపు నీటి గుంతలతో వినాయకుడు వీధుల్లోకి ఎలా వెళ్తారని నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. వెలగని వీధి దీపాలతో నగరంలో ఎక్కడ చూసినా అంధకారమే దర్శనమిస్తుంది.
కరీంనగర్ టౌన్, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): వినాయక చవితి వచ్చేసింది. గణనాథుడికి సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. అసంపూర్తిగా వదిలిపెట్టిన రోడ్లు, వర్షపు నీటి గుంతలతో వినాయకుడు వీధుల్లోకి ఎలా వెళ్తారని నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. వెలగని వీధి దీపాలతో నగరంలో ఎక్కడ చూసినా అంధకారమే దర్శనమిస్తుంది. ఈనెల 27న వినాయక చవితి. ఆలోగా ఏర్పాట్లు పూర్తి చేయాల్సిన అధికారులు ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలను ప్రారంభించలేదు. నగర పాలక సంస్థ నెల రోజుల ముందునుంచే ఏర్పాట్లను ప్రారంభించడం ఆనవాయితి.
ఫ మూడు వేలకుపైగా వినాయక మండపాలు
నగరంలోని 66 డివిజన్లలో మూడు వేలకు పైగా వినాయక మండపాలను ఏర్పాటు చేస్తారు. ప్రతియేట వర్షాకాలంలో రోడ్లు దెబ్బతింటాయి. వాటికి పండగలోగా మరమ్మతులు చేస్తారు. నెల రోజుల ముందే నగరపాలక సంస్థ టెండర్లను నిర్వహించి కాంట్రాక్టర్లకు పనులను అప్పగిస్తారు. ఈసారి ఇప్పటి వరకు టెండర్ పిలవలేదు. ఆరు నెలలుగా నగరంలోని చాలా చోట్ల వీధి దీపాలు, జంక్షన్లలోని హైమాస్ట్ లైట్లు వెలగడం లేదు. కాలనీల్లోనే కాకుండా ప్రధాన రహదారుల్లో కూడా రాత్రి వేల చీకట్లు అలుముకుంటున్నాయి. వినాయక చవితి వరకు నగరంలోని వీధి దీపాలు, హైమాస్ట్ లైట్లకు మరమ్మతులు చేయాలని, రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చాలని నగరవాసులు కోరుతున్నారు.
ఫ ఏర్పాట్లను ప్రారంభించాలి..
యాదగిరి సునీల్‌రావు, మాజీ మేయర్, బీజేపీ నాయకుడు
ఈనెల 27న వినాయక చవితి పర్వదినం ఉన్నందున వెంటనే వినాయక చవితి ఏర్పాట్లను ప్రారంభించాలి. వర్షాలకు నగరంలోని అనేక చోట్ల రోడ్లు దెబ్బతినడమే కాకుండా గతంలో ప్రారంబించి పూర్తి చేయని అసంపూర్తి రోడ్లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆయా కాలనీలకు విగ్రమాలను తరలించడం, నిమజ్జనం చేయడం కష్టం. అధికారులు స్పందించి రోడ్లు మరమ్మతులు చేసేందుకు చర్యలు చేపట్టాలి. వీధి దీపాలు మార్చి వెలిగేలా చూడాలి.