Share News

చేపపిల్లల జాడేది?

ABN , Publish Date - Aug 13 , 2025 | 01:09 AM

చేపపిల్లలు ఒడ్డున పడి విలవిలలాడుతున్నట్లుగా ఉంది మత్స్యకారుల పరిస్థితి.. ఉచిత చేపపిల్లల పంపిణీపై నీలినీడలు కమ్ముకోవడంతో గంగ పుత్రులు, ముదిరాజులో నిరాశ వ్యక్తమవుతోంది.

చేపపిల్లల జాడేది?

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

చేపపిల్లలు ఒడ్డున పడి విలవిలలాడుతున్నట్లుగా ఉంది మత్స్యకారుల పరిస్థితి.. ఉచిత చేపపిల్లల పంపిణీపై నీలినీడలు కమ్ముకోవడంతో గంగ పుత్రులు, ముదిరాజులో నిరాశ వ్యక్తమవుతోంది. ప్రతి సంవత్సరం మే మాసంలో టెండర్ల ప్రక్రియ మొదలుపెట్టేవారు. ఈసారి ఆగస్టు మాసం మధ్యలోకి వస్తున్న టెండర్ల ఊసే లేదు. ప్రభుత్వం నుంచి కూడా ఉచిత చేపపిల్లల పంపిణీపై స్పష్టత ఇవ్వడం లేదు. ఈ ఏడాది చేపపిల్లల పంపిణీ ఉన్నట్లా.. లేనట్లా.. అనే సందిగ్ధంలో మత్స్యకారులు ఉన్నారు. గత సంవత్సరం ఆలస్యంగా చేప పిల్లలు వదలడం వల్ల నష్టం జరిగిందని, ఈసారి కూడా చేపపిల్లలు ఆలస్యంగా వదిలితే ఎదుగుదల లేక నష్టమే మిగులుతుందని మత్స్యకారులు అంటున్నారు.

ఫ మత్స్యకారుల ఉపాధికి కష్టమే..

మత్స్యకారుల ఉపాధికి దోహదపడుతున్న ఉచిత చేపపిల్లల పంపిణీపై ఎలాంటి కార్యాచరణ లేకపోవడంతో పథకంపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. చేపపిల్లల పంపిణీ ఉండదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ ఆలస్యంగా మొదలుపెట్టింది. కాంట్రాక్టర్లు కూడా అంతగా ఆసక్తి చూపలేదు. సమయం దాటిపోవడంతో 50 శాతానికి చేప పిల్లల పంపిణీ లక్ష్యంగా మార్చుకున్న దానిని కూడా పూర్తి చేయలేకపోయారనే విమర్శలు ఉన్నాయి. 2024-2025 సంవత్సరానికి రూ.1.59 కోట్ల విలువైన 1.41 కోట్ల చేప పిల్లల సరఫరాకు టెండర్లు పిలిచినా చివరకు 46.71 లక్షల చేపలను 324 చెరువులు, కుంటల్లో వదిలారు. ఈసారి ముందస్తుగానే రుతుపవనాలు పలకరించినా చేప పిల్లల టెండర్ల ఊసే లేకుండాపోయింది. మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతూ నీలి విప్లవాన్ని సాధించే దిశగా మొదలుపెట్టిన చేప పిల్లల పంపిణీ ఈసారి కూడా వర్షాలు సమృద్ధిగా కురిసే సమయంలోను పంపిణీ చేసే పరిస్థితి లేదని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి

ఫ జిల్లాలో మత్స్య సహకార పరిస్థితి ఇది..

జిల్లాలో మత్స్యకారులు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో నిత్యం నీటిపై పోరాటం చేస్తూ ఉపాధిని అందుకుంటున్నారు. మత్స్య శాఖ పరిధిలో 401 చెరువులు ఉన్నాయి. 168మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉండగా, 9220 మంది సభ్యులు ఉన్నారు. 48 మహిళ మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు, రెండు ప్రాథమిక సహకార సంఘాలు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం వరకు మిడ్‌ మానేరులో చేపలు పట్టడానికి 741 మంది మత్స్యకారులకు, ఎగువ మానేరు ప్రాజెక్ట్‌లో 251 మంది, అన్నపూర్ణ ప్రాజెక్ట్‌లో 52 మంది మత్స్యకారులకు లైసెన్స్‌లు జారీ చేశారు.

వెలవెలబోతున్న ప్రాజెక్టులు, చెరువులు..

వానాకాలం సీజన్‌లో వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లోకి ఆశించిన స్థాయిలో నీరు చేరలేదు. జిల్లాలో భారీ వర్షాలు కురవలేదు. మోస్తరు వర్షాలతో సగటు వర్షపాతం కూడా ఇప్పటివరకు దాటలేదు. జిల్లాలో 7 శాతం లోటు వర్షపాతమే ఉంది జిల్లాలో ఈ సీజన్లో 434.5 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 404.4 మిల్లీమీటర్లు కురిసింది. గత సంవత్సరం ఈ సమయానికి 509.6 మిల్లీమీటర్ల వర్షం నమోదయింది. ప్రస్తుతం జిల్లాలో రుద్రంగి మండలంలో 41శాతం లోటు వర్షపాతం ఉండగా, చందుర్తిలో 19శాతం, వేములవాడరూరల్‌ 15 శాతం, బోయిన్‌పల్లి 22 శాతం, వేములవాడలో 22 శాతం, సిరిసిల్లలో 19 శాతం, కోనరావుపేటలో 3 శాతం, వీర్నపల్లి 10శాతం ఎల్లారెడ్డిపేటలో 3శాతం లోటు వర్షపాతం ఉంది. గంభీరావుపేట, ముస్తాబాద్‌ తంగళ్ళపల్లి ఇల్లంతకుంట మండలాల్లో సగటు వర్షపాతం దాటింది. జిల్లాలో ప్రధాన ప్రాజెక్టుగా ఉన్న శ్రీరాజరాజేశ్వర మిడ్‌ మానేరు ప్రాజెక్టులో 27.55 టీఎంసీల సామర్థ్యానికి 7.528టీఎంసీలు నీటి నిల్వ ఉంది. అన్నపూర్ణ ప్రాజెక్టులో 3.50 టీఎంసీల సామర్ధ్యానికి 1.27టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ మానేరు ప్రాజెక్టులో రెండు టీఎంసీలకు 1.13 టీఎంసీల నీటి నిల్వ ఉంది. చాలా చెరువుల్లోకి పూర్తిస్థాయిలో వర్షం నీరు చేరకపోవడంతో వెలవెలబోతున్నాయి.

చేపపిల్లలు చెరువుల్లో వదిలిన తీరు

సంవత్సరం చెరువులు/కుంటలు/జలాశయాలు వదిలినవి

2016- 17 92 30.5 లక్షలు

2017- 18 66 20 లక్షలు

2018- 19 95 57.48 లక్షలు

2019- 20 313 100.91 లక్షలు

2020- 21 362 115.61 లక్షలు

2021- 22 392 119.25 లక్షలు

2022 -23 392 138.27 లక్షలు

2023 -24 440 141.00 లక్షలు

2024-25 324 46.71 లక్షలు

Updated Date - Aug 13 , 2025 | 01:09 AM