Share News

సన్న వరి బోనస్‌ అందేదెన్నడో..?

ABN , Publish Date - Oct 15 , 2025 | 01:09 AM

రాష్ట్ర ప్రభుత్వం సన్న రకాల సాగును ప్రోత్సహించేందుకు క్వింటాల్‌కు 500 రూపాయల బోనస్‌ ప్రకటించింది. సాధారణంగా వానాకాలంలో మాత్రమే సన్న రకం వరి రైతులు సాగు చేస్తారు. యాసంగిలో వరి గింజ తయారయ్యే దశలో ఎండలు ముదిరి నీరందక తాలు పోయే అవకాశమున్నందున ఆ సీజన్‌లో సన్న రకాలను సాగు చేసేందుకు ఆసక్తి చూపించరు.

సన్న వరి బోనస్‌ అందేదెన్నడో..?

కరీంనగర్‌, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం సన్న రకాల సాగును ప్రోత్సహించేందుకు క్వింటాల్‌కు 500 రూపాయల బోనస్‌ ప్రకటించింది. సాధారణంగా వానాకాలంలో మాత్రమే సన్న రకం వరి రైతులు సాగు చేస్తారు. యాసంగిలో వరి గింజ తయారయ్యే దశలో ఎండలు ముదిరి నీరందక తాలు పోయే అవకాశమున్నందున ఆ సీజన్‌లో సన్న రకాలను సాగు చేసేందుకు ఆసక్తి చూపించరు.

ఫ ఉమ్మడి జిల్లాలో 1,25,224 మెట్రిక్‌ టన్నుల దిగుబడి

ప్రభుత్వం క్వింటాల్‌కు 500 రూపాయల బోనస్‌ ప్రకటించడంతో ఉమ్మడి జిల్లాలో రైతులు ధైర్యం చేసి సన్నరకాల సాగును పెంచి 1,25,224 మెట్రిక్‌ టన్నుల దిగుబడి సాధించి కొనుగోలు కేంద్రాలకు విక్రయించారు. కరీంనగర్‌ జిల్లాలో 32,694, పెద్దపల్లి జిల్లాలో 79,345, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 8,786, జగిత్యాల జిల్లాలో 4,399 మెట్రిక్‌ టన్నులల సన్న రకం వరి ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వానికి విక్రయించారు. ఈ ధాన్యానికి సంబంధించిన డబ్బును ప్రభుత్వం ఆయా రైతుల ఖాతాల్లో 15 రోజుల్లోగానే జమ చేసింది. ప్రోత్సాహకంగా ఇస్తామన్న క్వింటాల్‌కు 500 రూపాయల బోనస్‌ను మాత్రం ఇప్పటికీ చెల్లించలేదు. కరీంనగర్‌ జిల్లా రైతులకు 16.35 కోట్లు, పెద్దపల్లి జిల్లా రైతులకు 39.67 కోట్లు, రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులకు 4.62 కోట్లు, జగిత్యాల జిల్లా రైతులకు 2.21 కోట్ల రూపాయల బోనస్‌ డబ్బులు చెల్లించాల్సి ఉన్నది. జూన్‌ మొదటి వారంలోగానే యాసంగి ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేసి కొనుగోలు కేంద్రాలను మూసివేశారు. నాలుగు నెలలుగా రైతులు బోనస్‌ డబ్బులు జమ కాక ఇబ్బంది పడుతున్నారు. వాన కాలం సాగు అవసరాలకు ఈ డబ్బు ఉపయోగపడుతుందని రైతులు ఆశించినా ఇప్పటి వరకు ఆ డబ్బును ప్రభుత్వం విడుదల చేయడం లేదు. ఎప్పుడు విడుదల చేస్తుందనే విషయం కూడా అధికారులు తెలపడం లేదు. నాలుగు నెలలు గడిచినా బోనస్‌ అందక పోవడంతో అసలు ఆ డబ్బు ఇస్తారా లేదా అనే అనుమానాలను రైతులు వ్యక్తం చేస్తున్నారు.

ఫ ఆందోళనలో అన్నదాతలు

వానాకాలంలో సీజన్‌లో రైతులు తాము ఇంటి అవసరాలకు వినియోగించుకోవడానికే కాకుండా మార్కెట్‌లో విక్రయించేందుకు తమ సాగు విస్తీర్ణంలో సుమారు 25 శాతం సన్న వరి రకాలను సాగు చేస్తారు. ప్రభుత్వం బోనస్‌ ప్రకటించడంతో ఈసారి 40 శాతం మేరకు సన్న రకాలను సాగు చేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలో వానాకాలంలో రైతులు 4.2 లక్షల ఎకరాల్లో సన్న రకాలను సాగు చేశారు. ఎకరాకు కనీసం 20 క్వింటాళ్ల చొప్పున దిగుబడి వస్తుంది. ఈ మేరకు సుమారు 8.4 లక్షల మెట్రిక్‌ టన్నుల సన్నరకాలను ఈసారి రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తారని వ్యవసాయశాఖ అంచనా వేస్తున్నది. వర్షాకాలంలో సాగు చేసిన వరి ధాన్యం మిల్లింగ్‌ సమయంలో నూకగా మారదు. దీంతో మిల్లర్లు ఎక్కువ ధర చెల్లించి ఈ ధాన్యాన్ని కొనుగోలు చేస్తారు. ప్రభుత్వం అందించే బోనస్‌ ప్రోత్సాహకరంగా ఉన్న నేపథ్యంలో ఒక్కో క్వింటాల్‌పై 500 రూపాయలు అధికంగా వస్తున్నందున రైతులు పెద్ద ఎత్తున సన్న రకాలను సాగుచేశారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లు పూర్తయి నాలుగు నెలలు గడిచినా బోనస్‌ డబ్బును ప్రభుత్వం విడుదల చేయక పోవడంతో వానాకాలంలో బోనస్‌ ఇస్తుందా లేదా అని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం బోనస్‌ ఇస్తేనే ప్రైవేట్‌ మార్కెట్‌లో మిల్లర్లు అంతకంటే ఎక్కువ రేటు చెల్లించేందుకు ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వం బోనస్‌ ఇవ్వకపోతే మిల్లర్లు ఆ బోనస్‌ డబ్బుల కంటే తక్కువగా చెల్లించి కొనుగోలు చేస్తారు. దీంతో రైతులు ఆశించిన విధంగా సన్న వరి రకాలకు ధర పలకదని రైతులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం యాసంగి వరి ధాన్యం బోనస్‌ బకాయిలను చెల్లించడంతోపాటు వానా కాలం బోనస్‌పై స్పష్టత ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Oct 15 , 2025 | 01:09 AM