Share News

తడిసిన ధాన్యాన్ని వెంటనే ఆరబోయాలి

ABN , Publish Date - May 24 , 2025 | 12:32 AM

తడిసిన ధాన్యం కుప్పలను వెంటనే ఆరబోయాలని, తేమ వచ్చిన వెంటనే కొనుగోలు చేయాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ సూచించారు. ధర్మపురి మండలంలోని నేరెళ్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

తడిసిన ధాన్యాన్ని వెంటనే ఆరబోయాలి
ధర్మపురి మండలంలోని నేరెళ్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ సత్యప్రసాద్‌

కలెక్టర్‌ సత్యప్రసాద్‌

ధర్మపురి, మే 23 ( ఆంధ్రజ్యోతి ): తడిసిన ధాన్యం కుప్పలను వెంటనే ఆరబోయాలని, తేమ వచ్చిన వెంటనే కొనుగోలు చేయాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ సూచించారు. ధర్మపురి మండలంలోని నేరెళ్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని తేమ వచ్చిన వెంటనే కొనుగోలుచేసి రైస్‌మిల్లుకు తరలించాలని సూచించారు. ధాన్యం సంచులు నానితే వెంటనే రైస్‌మిల్లులకు పంపించాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ రోజు రైస్‌మిల్లులకు పంపించాలని, రవాణా నిమిత్తం లారీల కొరత ఎక్కడ లేకుండా చూడాలని ఆయన అన్నారు. రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్‌ ఎంట్రీ పూర్తి చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రవాణా అంశంలో వాహనాల కొరత, హమాలీల సమస్య రాకుండ చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. సెంటర్‌ ఇన్‌చార్జి అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో డీసీవో మనోజ్‌కుమార్‌, డీఎస్‌వో జితేందర్‌రెడ్డి, డీఎం జితేంద్రప్రసాద్‌, ఇన్‌చార్జి తహసీల్దార్‌ సుమన్‌, పీఏసీఎస్‌ సీఈవో అయ్యోరు రాజేష్‌, ఆర్‌ఐ భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2025 | 12:32 AM