Share News

‘బెస్ట్‌ అవైలబుల్‌’ ప్రవేశాలు ఉండేనా..?

ABN , Publish Date - Jun 17 , 2025 | 01:13 AM

‘బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌’ పథకం అమలుపై ఈ సంవత్సరం అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం భాగంగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను ప్రైవేట్‌ పాఠశాలల్లో చేర్పించి మెరుగైన విద్యనందించేది.

‘బెస్ట్‌ అవైలబుల్‌’ ప్రవేశాలు ఉండేనా..?

- జిల్లాలో 15 పాఠశాలలకు రూ. 10 కోట్ల బకాయిలు

- రెండేళ్లుగా డబ్బు విడుదల చేయడం లేదంటున్న యాజమాన్యాలు

- 20 వరకు చెల్లించాలని వినతి

- లేకపోతే పాఠశాలలు మూసివేయాల్సి వస్తుందని ఆవేదన

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

‘బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌’ పథకం అమలుపై ఈ సంవత్సరం అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం భాగంగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను ప్రైవేట్‌ పాఠశాలల్లో చేర్పించి మెరుగైన విద్యనందించేది. ఈనెల 16తో విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవడానికి గడువు ముగిసింది. వారం రోజుల్లోగా విద్యార్థులకు ప్రవేశాలు ఖరారు చేయాలి. ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు బకాయిల కోసం ఆందోళన చేపడుతున్నాయి. ఈ నెల 20 వరకు బకాయిలు చెల్లించకపోతే అడ్మిషన్లు తీసుకోబోమని యాజమాన్యాల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్ల పథకం కింద 25 వేల మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ప్రైవేట్‌ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 237 స్కూళ్లను బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్లుగా గుర్తించిన ప్రభుత్వం వాటిల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను చేర్చి విద్యను అందిస్తున్నది.

ఫ పేరుకుపోయిన బకాయిలు

జిల్లాలోని కరీంనగర్‌, హుజూరాబాద్‌, జమ్మికుంట, గంగాధర మండల కేంద్రాల్లో 15 పాఠశాలలు ఈ పథకాన్ని అమలు చేసున్నాయి. ఈ పాఠశాలల్లో 1200 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ పాఠశాలలకు 10 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా రెండు సంవత్సరాలుగా 200 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. ఆ నిధులను ప్రభుత్వం విడుదల చేయడం లేదని బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ అంటున్నది. ఈ బకాయిలను ఈ నెల 20 వరకు విడుదల చేయాలని, లేకపోతే తాము పాఠశాలలకు తాళం వేయడం మినహా గత్యంతరం లేదని ఆ సంఘం ప్రభుత్వానికి విన్నవించింది. తాము పాఠశాలలు మూసివేస్తే ప్రస్తుతం చదువుతున్న 25 వేల మంది విద్యార్థులు ఇబ్బంది పడతారని ఆ సంఘం ప్రభుత్వానికి విన్నవించింది. ప్రభుత్వం రాష్ట్రంలో ఈ పథకాన్ని సదుద్దేశంతో ప్రవేశపెట్టినప్పుడు కార్పొరేట్‌ పాఠశాలలేవి ముందుకు వచ్చి ప్రభుత్వానికి సహకరించకున్నా బడ్జెట్‌ పాఠశాలలుగా ఉన్న తాము అందుకు సిద్ధపడి అడ్మిషన్లు ఇచ్చామని తెలిపాయి. అయినా ప్రభుత్వం బకాయిలు విడుదల చేయడం లేదని సంఘం వాపోతున్నది.

ఫ పదో తరగతిలో 98 శాతం ఉత్తీర్ణత

గడిచిన విద్యాసంవత్సరం బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్లలో మూడు వేల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్ష రాయగా 98 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. 25 శాతం మంది 500 పై మార్కులు పొందారు. తాము కార్పొరేట్‌ సంస్థలకు ధీటుగా విద్యాబోధన చేస్తున్నా నిధులు విడుదల చేయకపోవడం సమంజసం కాదని బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. రెండు సంవత్సరాలుగా ఫీజు బకాయిల విడుదల చేయకపోవడంతో భవనాలకు అద్దె చెల్లించలేక, హాస్టల్‌ విద్యార్థుల కోసం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నామంటున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో తమకు పాఠశాలలు మూసివేయడం మినహా మరోమార్గం కనిపించడం లేదని బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలల యాజమాన్య అసోసియేషన్‌ అధ్యక్షుడు కేశ వీరన్న, ప్రధాన కార్యదర్శి యాదగిరి శేఖర్‌రావు అన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఈ పథకం అమలును సజావుగా కొనసాగించడానికి వెంటనే 200 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలని వారు కోరుతున్నారు.

Updated Date - Jun 17 , 2025 | 01:13 AM