ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమం
ABN , Publish Date - Sep 18 , 2025 | 12:22 AM
కరీంనగర్, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మన్‌కుమార్ అన్నారు. బుధవారం కరీంనగర్ పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికివ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
- ప్రతిష్టాత్మకంగా ‘భూ భారతి’
- మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసాతో పలువురికి లబ్ధి
- అర్హులందరికీ రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు
- ప్రజాపాలన దినోత్సవంలో మంత్రి అడ్లూరి లక్ష్మన్‌కుమార్
కరీంనగర్, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మన్‌కుమార్ అన్నారు. బుధవారం కరీంనగర్ పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికివ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన జిల్లా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ అనేది ఒక భౌగోళిక స్వరూపం మాత్రమే కాదని, అస్తిత్వ పోరాటానికి చిహ్నమన్నారు.
ఫ ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు లబ్ధి
రాష్ట్రంలో అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని పొందుతున్నారన్నారు. జిల్లాలో 1,57,120 మంది లబ్ధిదారులకు ఇప్పటి వరకు 6,33,737 గ్యాస్ సిలిండర్లను 500 రూపాయలకు సరఫరా చేస్తున్నామన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం 19.59 కోట్ల రూపాయల సబ్సిడీని భరించిందని మంత్రి తెలిపారు. గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్లలోపు విద్యుత్ వాడే వినియోగదారులందరికి జీరో బిల్లులు జారీ చేస్తున్నామన్నారు. ఈ పథకం ద్వారా 1,58,875 సర్వీసులకు 6.94 కోట్ల రూపాయలను ప్రభుత్వం చెల్లించిందని చెప్పారు.
ఫ అన్నదాతలకు రుణమాఫీ, రైతు భరోసా
1,90,186 మంది రైతులకు 206.62 కోట్ల రూపాయలను రైతు భరోసా పథకం ద్వారా రైతుల ఖాతాల్లో జమ చేశామని మంత్రి తెలిపారు. 79,541 మంది రైతులకు 622.06 కోట్ల రూపాయల రుణమాఫీ చేశామన్నారు. రైతు బీమా పథకం ద్వారా వివిధ కారణాలతో మృతి చెందిన రైతుకుటుంబాలకు 25.5 కోట్ల బీమా సొమ్మును అందజేశామని చెప్పారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా 12,483 వ్యవసాయ కూలీల కుటుంబాల ఖాతాల్లో 7.48 కోట్ల రూపాయలు జమ చేశామన్నారు. ఈ సంవత్సర జిల్లాలో 15,436 మందికి 44.23 కోట్ల విలువ చేసే శస్త్ర చికిత్సలను రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో ఉచితంగా చేయించామని తెలిపారు.
ఫ 11,575 మందికి ఇందిరమ్మ ఇళ్లు
జిల్లాలోని 11,575 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, ఇప్పటికే 5,844 ఇళ్ల నిర్మాణం ప్రారంభమై వేగంగా పనులు జరుగుతున్నాయన్నారు. గృహనిర్మాణాన్ని బట్టి దశలవారీగా లబ్ధిదారులకు 45.91 కోట్ల రూపాయలను చెల్లించామని మంత్రి తెలిపారు. జిల్లాలోని ప్రతి మండల కేంద్రం, రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహించి భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించామన్నారు. ఇప్పటి వరకు 29,426 మంది నుంచి దరఖాస్తులు తీసుకొని భూ భారతి పోర్టల్ ద్వారా శరవేగంగా పరిష్కరిస్తున్నామని వివరించారు. భూభారతి చట్టాన్ని తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా తీసుకుందని, జిల్లాలో 233 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లకు శిక్షణ ఇచ్చామన్నారు. యాసంగి సీజన్‌లో 328 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 3,10,742 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు.
ఫ అర్హులందరికీ రేషన్ కార్డులు
అర్హులందరికీ రేషన్‌కార్డులను ప్రభుత్వం మంజూరు చేస్తోందని, ఇప్పటి వరకు జిల్లాలో 39,645 కొత్త రేషన్‌కార్డులను ఇచ్చామని మంత్రి చెప్పారు. 75,597 మంది కుటుంబాల్లోని సభ్యుల పేర్లను కొత్తగా నమోదు చేశామన్నారు. అన్ని సంక్షేమ వసతిగృహాల్లో, గురుకులాల్లో కామన్ డైట్ మెనూను అమలు చేస్తున్నామన్నారు. సంక్షేమ, గురుకుల హాస్టళ్లలో స్టీలు పాత్రలను వినియోగిందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో 1,23,960 జాబ్‌కార్డులను జారీ చేశామని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15.4 లక్షల పనిదినాల ద్వారా 11.36 లక్షల ఉపాధి కూలీలకు పనులను కల్పించామని అన్నారు.
ఫ 1.36 లక్షల మందికి చేయూత పింఛన్
చేయూత ఫించన్ పథకం ద్వారా 1,36,237 మంది లబ్ధి పొందుతున్నారని, ప్రతినెలా వారికి క్రమం తప్పకుండా 32 కోట్ల రూపాయలను ప్రభుత్వం అందిస్తుందని మంత్రి లక్ష్మణ్‌కుమార్ చెప్పారు. ఇందిరా మహిళా శక్తి ద్వారా 517 వ్యక్తిగత యూనిట్లకు 10.16 కోట్ల రూపాయలను మంజూరు చేశామనిని, 78 గ్రూపు యూనిట్లను ఏర్పాటు చేసి 7.36 కోట్ల కేటాయించామన్నారు. 338 స్వయం సహాయక సంఘాలకు ఈఏడాది 54.49 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను మంజూరు చేశామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 2,058 స్వయం సహాయక సంఘాలకు 208.77 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను ఇప్పించామని చెప్పారు. 813 స్వయం సహాయక సంఘాల్లోని 1,946 మంది మహిళలకు 18.13 కోట్ల స్త్రీ నిధి రుణాలను మంజూరు చేశామన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి నిర్మాణాత్మక సహకారం, సూచనలిస్తున్న ప్రతి ఒక్కరికి మంత్రి లక్ష్మన్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, ఎమ్మెల్యేలు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తుమల్లేశం, అదనపు కలెక్టర్లు లక్ష్మికిరణ్, అశ్వినీ తానాజీ వాఖడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్‌దేశాయ్, పోలీసు కమిషన్ గౌస్ ఆలం, ఆర్టీఏ సభ్యుడు పడాల రాహుల్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, కాంగ్రెస్ నాయకుడు వి నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఫ అమరులకు నివాళి
కరీంనగర్ టౌన్: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తెలంగాణ అమరవీరుల స్తూపం వద అమరులకు నివాళులర్పించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ ప్రత్యేక అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి జాతీయ పథకాన్ని ఎగురవేశారు. కలెక్టరేట్ ఆవరణలో జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ జాతీయ జెండాను ఆవిష్కరించగా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాల యంలో కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ జాతీయ జెండాను ఆవిష్కరించగా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం పాల్గొన్నారు.