Share News

ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం

ABN , Publish Date - Aug 04 , 2025 | 01:18 AM

కేవలం 38వేల కోట్ల రూపాయలతోనే తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును నిర్మాణం చేస్తామని, ఆ నీటితో శ్రీపాద ప్రాజెక్టును నింపుతామని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. రామగుండం నియోజకవర్గంలోని రామగుండం ఎత్తిపోతల పథకాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు.

ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం
రామగుండం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తున్న మంత్రులు

- మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

గోదావరిఖని, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): కేవలం 38వేల కోట్ల రూపాయలతోనే తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును నిర్మాణం చేస్తామని, ఆ నీటితో శ్రీపాద ప్రాజెక్టును నింపుతామని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. రామగుండం నియోజకవర్గంలోని రామగుండం ఎత్తిపోతల పథకాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. కాళేశ్వర నిర్మాణంలో లక్ష కోట్ల రూపాయల అవి నీతితో జేబులు నింపుకున్న బీఆర్‌ఎస్‌ నాయకులు నిస్సిగ్గుగా ఇంకా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. బీఆర్‌ఎస్‌ హయాంలోనే కాళేశ్వరం నిర్మాణం జరిగిందని, వాళ్ల ప్రభుత్వకాలంలోనే కూలిపోయిందని చెప్పారు. కాళేశ్వరంపై వేసిన కమిషన్‌ నివేదిక ప్రభుత్వం చేతిలో ఉందని, త్వరలోనే జరిగే మంత్రివర్గంలో నివేదికపై నిర్ణయం తీసుకుంటామన్నారు. చాలాసార్లు వాయిదా పడిన ఇచ్చంపల్లి దగ్గర ప్రాజెక్టును కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్మాణం చేసి తీరుతుందని మంత్రి చెప్పారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ ద్వారా 168టీఎంసీల నీటిని శ్రీపాదకు తీసుకువస్తామని ఉత్తమకు మార్‌రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్‌ గోదావరి జలాలను రాయలసీమకు తరలిస్తామనడంతోనే బనకచర్ల తెరమీదికి వచ్చిందని ఉత్తమ్‌ పేర్కొన్నారు. మంథని, పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాల్లో నిర్మాణం చేసిన కాళేశ్వరం ద్వారా ఈ ప్రాంతంలో ఒక ఎకరాకు బీఆర్‌ఎస్‌ నీళ్లు ఇవ్వలేకపోయిందని ఉత్తమ్‌ అన్నారు. మేడిగడ్డ కూలిపోయిందని, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా నీటిని నింపితే కూలిపోయే ప్రమాదం ఉందని నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ లిఖిత పూర్వకంగా ఇచ్చిందని ఉత్తమ్‌ చెప్పారు. ఈ బ్యారేజీల్లో నీళ్లు నింపితే బ్యారేజీలు కూలిపోయి భద్రాచలం రామాలయం, సమ్మక్క-సారలమ్మ మేడారం వరకు మునిగిపోయే ప్రమాదం ఉందని ఉత్తమ్‌ అన్నారు. పెద్దపల్లి జిల్లాలో పత్తిపాక ప్రాజెక్టును కూడా చేపడుతామని, ఈ ప్రాజెక్టులో 3 నుంచి 5టీఎంసీల నీటి నిల్వ ఉంటుందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ధర్మపురి, పెద్దపల్లి, చొప్పదండి, రామగుండం, మంథని నియోజకవర్గాల్లోని 2.5లక్షల ఎకరాలకు సాగునీటి స్థిరీకరణ ఏర్పడుతుందన్నారు. కాళేశ్వరం కూలినా, మేడిగడ్డం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ ఎండిపోయినా శ్రీపాద ప్రాజెక్టు ద్వారానే భారతదేశంలో ఏ రాష్ట్రంలో రాని విధంగా తెలంగాణ వరిసాగులో అగ్రస్థానంలో నిలిచిందని ఆయన చెప్పుకొచ్చారు. సంక్షేమ పథకాల్లో కూడా తమ ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ కంటే ప్రజలకు మేలు చేస్తున్నదని ఆయన చెప్పుకొచ్చారు. రూ.10వేల కోట్లు ఖర్చు పెట్టి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2.81కోట్ల మందికి దొడ్డు బియ్యం ఇస్తే తమ ప్రభుత్వం 3.17కోట్ల మందికి సన్నబియ్యం 6కిలో చొప్పున ఇస్తున్నదని ఆయన అన్నారు. రామగుండం శాసన సభ్యులు రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సభలో రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, తుమ్మల నాగేశ్వర్‌రావు, పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్‌రావు, ఎమ్మెల్యేలు విజయ రమణరావు, సత్యం, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు జనక్‌ ప్రసాద్‌, డీ అన్నయ్య, జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, సివిల్‌ సప్లై కమిషనర్‌ ఎల్‌హెచ్‌ చౌహాన్‌, ఇరిగేషన్‌ అధికారి అంజద్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 04 , 2025 | 01:18 AM