పర్యావరణ పరిరక్షణకు మేము సైతం
ABN , Publish Date - Jul 22 , 2025 | 12:08 AM
వాతావరణం కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతోంది. ఇష్టానుసారంగా చెట్లను నరికివేయటం, భూగర్భాన్ని తొలచి సహజవనరులను వెలికితీసి విచ్చలవిడిగా వినియోగిస్తూ పర్యావరణాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నాం. పర్యావరన పరిరక్షణకు కరీంనగర్ జైలులోని ఖైదీలు మేము సైతం అంటూ ముందుకు వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న వన మహోత్సవాన్ని విజయవంతం చేయడానికి కరీంనగర్ జిల్లా జైలులోని ఖైదీలు తమవంతు పాత్ర పోషిస్తున్నారు.
కరీంనగర్ క్రైం, జూలై 21 (ఆంధ్రజ్యోతి): వాతావరణం కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతోంది. ఇష్టానుసారంగా చెట్లను నరికివేయటం, భూగర్భాన్ని తొలచి సహజవనరులను వెలికితీసి విచ్చలవిడిగా వినియోగిస్తూ పర్యావరణాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నాం. పర్యావరన పరిరక్షణకు కరీంనగర్ జైలులోని ఖైదీలు మేము సైతం అంటూ ముందుకు వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న వన మహోత్సవాన్ని విజయవంతం చేయడానికి కరీంనగర్ జిల్లా జైలులోని ఖైదీలు తమవంతు పాత్ర పోషిస్తున్నారు. విత్తనబంతులు తయారు చేస్తున్నారు. ఖైదీలు తయారు చేసిన విత్తన బంతులతో గుట్టలు, కొండల ప్రాంతాలకు పచ్చదనం తేవాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు గ్రామాలు, నగరాలు, రహదారుల వెంట మొక్కలు నాటేవారు. వాటికి పశువుల నుంచి రక్షణ లేకపోవడం, నీటిని అందించలేక చాలా మొక్కలు చనిపోయేవి. మరోవైపు గుట్టలు, కొండల ప్రాంతంలో మొక్కల పెంపకం కష్టంతో కూడుకున్నది. ఈసారి ఎలాగైనా ప్రభుత్వ భూములు, గుట్టలు, కొండల ప్రాంతాల్లో మొక్కలు నాటాలని అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. అందులోభాగంగానే ఖైదీల ఆధ్వర్యంలో విత్తనబంతుల తయారీని చేపట్టారు.
ఫ విత్తన బంతుల ఉపయోగం ఇలా..
విత్తన బంతుల వల్ల మొక్కను ప్రత్యేకంగా నాటే అవసరం ఉండదు. సీడ్ బాల్స్‌ను గుట్టలు, కొండల ప్రాంతాల్లో చల్లుతారు. వర్షం కురిసినప్పుడు విత్తనబంతి తడిసి అందులోని విత్తనం బయటకు వస్తుంది. అది మొక్కగా నాటుకుంటుంది. వీటికోసం ట్రీగార్డ్స్, నీటి సరఫరా లాంటి ప్రత్యేక చర్యలు అవసరం లేదు. ఖర్చు తక్కువ, లాభం ఎక్కువ ఉండడంతో వీలైనంత ఎక్కువగా విత్తన బంతులను తయారు చేయించాలని జైళ్ల శాఖ భావిస్తున్నది. ఇటీవల జైళ్లశాఖ డీజీ డాక్టర్ సౌమ్యమిశ్రా ఆదేశాలతో కరీంనగర్ జిల్లా జైలు అధికారులుఖైదీలతో జైలు ఆవరణలో లభించిన వేప, చింత, కానుగ, అల్లనేరడి తదితర రకాల విత్తనాలతో విత్తన బంతులు తయారు చేయించారు. కరీంనగర్ జైలులోని 50 మంది ఖైదీలు ప్రతిరోజు విత్తన బంతులు తయారు చేస్తున్నారు. నెల రోజుల్లో 15 వేల సీడ్‌బాల్స్‌ను తయారు చేశారు. ఇందులో మూడు వేల సీడ్ బాల్స్‌ను హుజురాబాద్ సబ్ జైలుకు పంపించారు. హుజూరాబాద్ ప్రాంతంలోని ప్రభుత్వ భూములు, గుట్టలు, కొండ ప్రాంతాల్లో అక్కడ ఇసబ్ జైలు అధికారులు ఈ విత్తన బంతులను చల్లనున్నారు. కరీంనగర్ జైలు అధికారులు కమాన్‌పూర్, చింతకుంట, రేకుర్తి తదితర ప్రాంతాల్లో ఆదివారం విత్తన బంతులను చల్లారు.
ఫ చొప్పదండి నుంచి ఎర్రమట్టి.....
కరీంనగర్ జైలులో తయారు చేస్తున్న విత్తన బంతుల కోసం చొప్పదండి ప్రాంతం నుంచి నాణ్యమైన ఎర్రమట్టిని జైలు సూపరింటెండెంట్ జి విజయ్‌డేని తెప్పించారు. మొదట కరీంనగర్ ఓపెన్ జైలులో ఉన్న చింత, అల్లనేరడి, వేప, కానుగ విత్తనాలను సేకరించి జైలు ఆవరణలో ఆరబెట్టారు. తరువాత ఎర్రమట్టికి జీవామృతం, వర్మీకంపోస్టును కలిపి సపోటా పండు పరిమాణంలో బంతులుగా తయారు చేసి మధ్యలో విత్తనాన్ని పెట్టారు. గతంలో ప్రత్యేక శిక్షణ పొందినవారిలో కొందరు ఖైదీలుండగా మరికొందరు కలిసి బంతులను తయారు చేశారు. ఖైదీలు తయారు చేసిన ఈ విత్తన బంతులను ఆరబెట్టిన తర్వాత ఎప్పటికప్పుడు జైలులోని గోదాంలో భద్రపరుస్తున్నారు. ఐదేళ్ల క్రితం కరీంనగర్ జైలులో ఖైదీలు 3.5 లక్షల వరకు విత్తన బంతులు తయారు చేశారు.
ఫ కొండ, గుట్ట ప్రాంతాల్లో ఉపయోగం....
- జీ విజయ్‌డేని, కరీంనగర్ జైలు సూపరిటెండెంట్
వన మహోత్సవంలో భాగంగా జైళ్ల శాఖ డీసీ డాక్టర్ సౌమ్యమిశ్ర ఆదేశాలతో ఖైదీలచేత 15 వేల విత్తన బంతులను తయారు చేశాం. ఈ బంతులను అటవీశాఖ అధికారుల సూచనల మేరకు ప్రభుత్వ భూములు, గుట్టలు, కొండ ప్రాంతాల్లో చల్లుతున్నాం. వీటికి ఎటువంటి రక్షణ లేకుండానే సహజసిద్దంగా మొలకెత్తుతాయి. కరీంనగర్ జైలులో ఉన్న ఖైదీలు తమ వంతు సేవలు అందించారు. జైలు ఆవరణలోని చెట్ల నుంచి సేకరించిన విత్తనాలు, జీవామృతం, వర్మికంపోస్టును ఉపయోగించి విత్తన బంతులు తయారు చేశాం.