Share News

స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

ABN , Publish Date - Sep 04 , 2025 | 12:26 AM

రానున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌ రాంచందర్‌రావు పిలుపునిచ్చారు. బుధవారం కరీంనగర్‌లో నిర్వహించిన పోలింగ్‌ బూత్‌ అధ్యక్షులు, కార్యదర్శుల సమ్మేళనంలో పాల్గొన్నారు.

స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

కరీంనగర్‌, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రానున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌ రాంచందర్‌రావు పిలుపునిచ్చారు. బుధవారం కరీంనగర్‌లో నిర్వహించిన పోలింగ్‌ బూత్‌ అధ్యక్షులు, కార్యదర్శుల సమ్మేళనంలో పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టిన అనంతరం తొలిసారి కరీంనగర్‌కు వచ్చిన రాష్ట్ర అధ్యక్షుడికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌తో పాటు బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జిల్లాపరిషత్‌లు అన్నింటిలోనూ బీజేపీ విజయం సాధిస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు నిధులు అందిస్తుందన్నారు. 11 సంవత్సరాల్లో రాష్ట్రానికి 12 లక్షల కోట్లు నిధులు వెచ్చించిందన్నారు. కరీంనగర్‌-జగిత్యాల జాతీయ రహదారి నిర్మాణం కోసం రెండు వేల కోట్లు కేటాయించిందన్నారు. బండి సంజయ్‌ కేంద్ర న్యాయశాఖ మంత్రితో మాట్లాడి కరీంనగర్‌ శాతవాహన యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ క్లాసులు ప్రారంభమయ్యేలా చూశారన్నారు.

స్థానిక అభ్యర్థులను గెలిపించే బాధ్యత నాదే

- కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ మాట్లాడుతూ కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలో స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత తనదేనన్నారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలు, నాయకులు పని చేయాలని పిలుపునిచ్చారు. ఎంపీటీసీగా గెలుపొందిన వారికి ఐదు లక్షలు, జడ్పీటీసీగా గెలుపొందిన వారికి పది లక్షల రూపాయలు అందిస్తామన్నారు. ఇప్ప్టటి వరకు పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులు సైకిళ్లు అందించామని, బీజేపీని గెలిపిస్తే వచ్చే ఏడాది తొమ్మిదో తరగతి విద్యార్థులకు సైకిళ్లు అందిస్తామన్నారు. ఒకటి నుంచి ఆరో తరగతి చదివే విద్యార్థులకు మోదీ కిట్స్‌ అందిస్తామన్నారు. ప్రపంచంలోనే అత్యంత అతిపెద్ద కుంభకోణం కాళేశ్వరం స్కాం అన్నారు. స్థానిక ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకే టిక్కెట్లు ఇస్తామని, కష్టపడి పనిచేసే కార్యకర్తలకు పార్టీ పదవులు, నామినేటెడ్‌ పదవులు ఇచ్చి న్యాయం చేస్తామన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా రామచందర్‌రావు ఆధ్వర్యంలో గొల్కండ కోటపై కాషాయ జెండా ఎగురవేయయడం ఖాయమన్నారు. 2028లో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. స్థానిక ఎన్నికల్లో అఽత్యధిక సీట్లను గెలిపించి రామచందర్‌రావుకు బహుమతి అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, చిన్నమైల్‌ అంజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడికృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగెశోభ, మాజీ మేయర్‌లు డి శంకర్‌, సునీల్‌రావు తదితరులు పాల్గొన్నారు.

ఫ అవినీతి పార్టీలను తరిమికొట్టండి

- ఎమ్మెల్సీ చిన్నమైల్‌ అంజిరెడ్డి

భగత్‌నగర్‌: అవినీతి పార్టీలైన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లను తరిమికొట్టాలని శాసనమండలి సభ్యుడు చిన్నమైల్‌ అంజిరెడ్డి అన్నారు. బుధవారం నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన పోలింగ్‌ బూత్‌ అధ్యక్షులు, ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ 20 నెలల పాలనలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజల్లో నమ్మకం కోల్పోయిందన్నారు. పది సంవత్సరాలు పాలించిన బీఆర్‌ఎస్‌ అవినీతిలో కూరుకుపోయిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్యకర్తల కృషి మరిచిపోలేనని, రానున్న స్థానిక ఎన్నికల్లో తనకు ఏ బాధ్యతలు అప్పగించినా శక్తి వంచన లేకుండా పని చేస్తానన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు.

ఫ రేణికుంట టోల్‌గేట్‌ వద్ద భారీ స్వాగతం

తిమ్మాపూర్‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికై మొదటిసారి కరీంనగర్‌ జిల్లాకు వచ్చిన రాంచందర్‌రావుకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. రేణికుంట వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఇనుకొండ నాగేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుకు గజా మాల వేశారు. అనంతరం రేణికుంట నుంచి భారీ కన్వాయ్‌తో ర్యాలీగా బయలు దేరి కరీంనగర్‌ పరిధిలోని అలుగునూర్‌ కూడలి వరకు తరలివెళ్లారు. అలుగునూర్‌ వద్ద కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుకు ఘన స్వాగతం పలికారు. ఇద్దరు కలిసి అలుగునూర్‌లోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు సుగుర్తి జగదీశ్వరాచారి, తిప్పర్తి నికేష్‌, జిల్లా నాయకులు సొల్లు అజయ్‌వర్మ, దండు కొమురయ్య, గుర్రల వెంకట్‌రెడ్డి, కొమటి రెడ్డి రాంగోపాల్‌ రెడ్డి, చింతం శ్రీనివాస్‌, దుర్శెట్టి సంపత్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 04 , 2025 | 12:26 AM