రాజ్యాంగ పరిరక్షణకు నడుం బిగించాలి
ABN , Publish Date - May 03 , 2025 | 12:05 AM
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని కాపాడుకోడానికి ప్రతీఒక్కరూ నడుం బిగించాల్సిన అవసరం ఉందని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
- విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
కథలాపూర్, మే 2 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని కాపాడుకోడానికి ప్రతీఒక్కరూ నడుం బిగించాల్సిన అవసరం ఉందని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన జైభీం, .జైబాపు, జైసంవిధాన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అహింసా విధానంతో స్వాతంత్ర్యాన్ని సాధించిన మహాత్మాగాంధీ, రాజ్యాంగరచన కోసం అహర్నిషలు కష్టపడ్డ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్‌ను అనుసరిస్తూ ముందుకు వెళ్లాలన్నారు. మహానీయుల త్యాగ ఫలాలను బడుగు, బలహీనవర్గాలు అనుభవించకుండా కేంద్రం మనువాద పద్ధతులను అవలంభిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలోని రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు దేశానికే రోల్ మోడల్‌గా ఉండే విధంగా కుల గణన చేపట్టిందని గుర్తుచేశారు. దీంతో సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా, ఉద్యోగాల్లో సమన్యాయం జరగడానికి అవకాశం చిక్కిందని చెప్పారు. రాష్ట్రం చేపట్టిన కులగణన వల్ల చేకూరే ప్రయోజనాలను కేంద్రం గుర్తించి కొద్దిరోజుల్లో జరగబోయే జన గణనతో పాటు కులగణన చేపట్టాలని నిర్ణయించిందని పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ, ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం, రణమాఫీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రు. 500లకే సిలిండర్ వంటి పథకాలను అమలు చేసి చూపించామన్నారు. ప్రధాన వీధుల వెంట అంబేద్కర్, మహాత్మాగాంఽధీ చిత్రపటాలను ప్రదర్శిస్తూ పాదయాత్ర కొనసాగించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పూండ్ర నారాయణరెడ్డి, వైస్ చైర్‌పర్సన్ పులి శిరీషహరిప్రసాద్, పీసీసీ కార్యవర్గ సభ్యుడు తొట్ల అంజయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కాయతి నాగరాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజీం, జిల్లా కార్యదర్శి గోపిడి ధనుంజయ్‌రెడ్డి, రాష్ట్ర ఫిషరీస్ విభాగం కార్యదర్శి కల్లెడ గంగాధర్, శేఖర్, రవి, పిడుగు తిరుపతిరెడ్డి, వాకిటి రాజరెడ్డి, గడ్డం స్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.