స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి
ABN , Publish Date - Oct 05 , 2025 | 12:37 AM
తెలంగాణలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థులను గెలిపించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూసం రమేష్ అన్నారు.
సిరిసిల్ల టౌన్, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థులను గెలిపించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూసం రమేష్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రం బీవైనగర్ అమృతలాల్ శుక్ల కార్మిక భవనంలో విలేకరుల సమావేశంలో రమేష్ మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఎం నుంచి జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల్లో వీలైనంత వరకు ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేస్తారన్నారు. జిల్లాలో సీపీఎం కార్మిక, కర్షకులు, బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలబడుతూ అనేక పోరాటాలు చేస్తోందన్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు తమ స్వార్థ రాజకీయాల ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తున్నాయని ప్రజల సమస్యలను పరిష్కరించడం లేవని ఆరోపించారు. ఎన్నికల ముందు అనేక హామీలనిస్తూ ఎన్నికలైన తరువాత హామీ లను తుంగలో తొక్కేయడం పెట్టుబడిదారి పార్టీలకు ఆనవాయితీగా మారిందన్నారు. చట్టసభలో కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం తగ్గడంతో విచ్చలవిడిగా అవినీతి రాజ్యమేలుతోందన్నారు. గతంలో జిల్లాలో భూఅక్రమాలు, ఇసుక మాఫియా, ప్రకృతి సంపద దోపిడీకి గురైనా యని ఆరోపించారు. ప్రశ్నించే గొంతులకు లేకపోవడంతో రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతుందని ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేద న్నారు. నీతికి నిజాయితీకి క్రమశిక్షణకు మారుపేరైన సీపీఎం పార్టీ అభ్యర్థులను స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు గెలిపించాలన్నారు. సమావేశంలో సీపీఎం కార్యదర్శి వర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి, కోడం రమణ, జిల్లా కమిటీ సభ్యులు సూరం పద్మ, శ్రీరాముల రమే ష్‌చంద్ర, సందుపట్ల పోచమ్మల్లు, గడ్డం రాజశేఖర్ పాల్గొన్నారు.