ప్రాజెక్టులకు జలకళ
ABN , Publish Date - Aug 18 , 2025 | 01:09 AM
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంటున్నది.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంటున్నది. సోమవారం సాయంత్రానికి ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో 80 టీఎంసీల నీరు వచ్చి చేరే అవకాశం ఉన్నది. ప్రాజెక్టుకు ఎగువన మహారాష్ట్రలో విస్తారంగా కురిసిన వర్షాల కారణంగా 1,51,806 క్యూసెక్కుల వరద వస్తుండడంతో రెండు రోజుల్లోనే ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరింది. ఈ నెల 16న ప్రాజెక్టులో 48.518 టీఎంసీల నీరు మాత్రమే ఉండగా 17న సాయంత్రం 7 గంటల వరకు 18 టీఎంసీల నీరు వచ్చి చేరడంతో నీటినిల్వ 66.23 టీఎంసీలకు పెరిగింది. ఈ వరద ఇలాగే కొనసాగే అవకాశాలు కనిపిస్తుండడంతో సోమవారం సాయంత్రానికి ప్రాజెక్టు పూర్తిగా నిండే అవకాశం ఉన్నది. ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తుండడంతో శ్రీరాంసాగర్ నుంచి కాకతీయ కాలువకు 5 వేల క్యూసెక్కుల నీరు, వరద కాలువకు 10 వేల క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. కాకతీయ కాలువ ద్వారా వస్తున్న నీరు నిజామాబాద్, జగిత్యాల జిల్లాల రైతులు, ఎల్‌ఎండీకి ఎగువన ఉన్న కరీంనగర్ జిల్లా రైతులు వినియోగించుకోగా మిగిలిన 682 క్యూసెక్కుల నీరు ఎల్‌ఎండీలోకి వస్తున్నాయి.
ఫ మిడ్ మానేరుకు వరద కాలువ, ఎల్లంపల్లి నీరు
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువన ఉన్న కడెం ప్రాజెక్టుకు ఆదిలాబాద్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా భారీగా నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తివేశారు. దీంతో ప్రాజెక్టులోకి 18.34 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 20.17 టీఎంసీలు. మరో రెండు టీఎంసీల నీరు వస్తే ప్రాజెక్టు పూర్తిగా నిండు తుంది. ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్న కారణంగా శనివారం ఎల్లంపల్లి గేట్లు ఎత్తి దిగువకు 2 లక్షల క్యూసెక్కుల నీటిని వదిలేశారు. ఇప్పుడు ఎగువన వరద ప్రవాహం తగ్గడంతో ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి గేట్లు మూసివేసి నీటి విడుదలను ఆపేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ప్రస్తుతం 13,016 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుం డగా 12,600 క్యూసెక్కుల నీటిని నంది పంపుహౌజ్ ద్వారా మిడ్ మానేరుకు తరలిస్తున్నారు. మిడ్ మానేరులో 27.55 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి 10.98 టీఎంసీల నీరు వచ్చి చేరింది. నంది పంపుహౌజ్ నుంచి ఈ ప్రాజెక్టుకు 9,500 క్యూసెక్కుల నీరు వస్తున్నది. ఆదివారం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా వరద కాలువకు 10 వేల క్యూసెక్కుల నీరు వదిలారు. వరద కాలువ ద్వారా ఈ నీరు సోమవారానికి మిడ్ మానేరు చేరే అవకాశం ఉన్నది. శ్రీరాంసాగర్ ఎగువన వరద ప్రవాహం ప్రస్తుతం మాదిరిగానే కొనసాగితే వరద కాలువ ద్వారా వదిలే నీరు అలాగే ఎల్లంపల్లి ద్వారా వచ్చే నీటితో మధ్య మానేరు త్వరలోనే నిండే అవకాశం కలుగుతుంది.
ఫ ఎల్‌ఎండీలో 7.29 టీఎంసీల నీరు
జిల్లా కేంద్రాన్ని ఆనుకుని ఉన్న ఎల్‌ఎండీలో నీటి నిల్వ సామర్థ్యం 24.03 టీఎంసీలు కాగా ప్రస్తుతం కేవలం 7.29 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నది. మరో 17 టీఎంసీల నీరు వస్తే ఎల్‌ఎండీ గేట్లు ఎత్తే అవకాశం ఉన్నది. కాకతీయ కాలువ ద్వారా కేవలం 682 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో మాత్రమే ప్రాజెక్టులోకి వస్తున్నది. క్యాచ్‌మెంట్ ఏరియాలో భారీ వర్షాలు లేక మోయతుమ్మెద వాగు నుంచి పెద్దగా నీరు రాకపోవడంతో ఎల్‌ఎండీలోకి నీరు రావడం లేదు. ఎల్లంపల్లి, వరద కాలువల ద్వారా వచ్చే వరదతో మిడ్ మానేరు నిండితే, మిడ్‌మానేరుకు ఎగువన క్యాచ్‌మెంట్ ఏరియాలో భారీ వర్షాలు కురిసి మానేరు పొంగితే అది నిండి గేట్లు ఎత్తడం ద్వారా ఎల్‌ఎండీకి జలకళ రానున్నది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు, గత నెలలో కురిసిన వర్షాల కారణంగా ప్రాజెక్టుల్లోకి నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టుల ఆయకట్టు రైతులకు వానాకాలం సాగుపై ఆశలు పెరిగాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రేపటికి నిండే అవకాశం ఉండడంతో ప్రాజెక్టు ఆయ కట్టుకు ఖరీఫ్, రబీ సీజన్లలో పంటలకు ఢోకా లేని పరిస్థితి ఏర్పడి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరో వారం రోజులపాటు భారీ వర్షాలు కొనసాగితే ప్రాజెక్టులే కాకుండా చెరువులు, కుంటలు అన్నీ నిండి భూగర్భజలాలు పెరిగి జిల్లాలో ఉన్న ప్రతి ఎకరా సాగయ్యే అవకాశాలు ఉన్నాయి.