నిబంధనలకు నీళ్లు
ABN , Publish Date - Nov 25 , 2025 | 01:08 AM
నగరంలోని వాణిజ్యసముదాయాలు, కమర్షియల్ బిల్డింగ్స్‌లో నిబంధనలకు తిలోదకాలిస్తున్నారు. ఆయా వాణిజ్య సముదాయాలు, బిల్డింగ్స్‌కు సంబంధించిన వాహనాలను పార్కింగ్ చేసేందుకు వదిలిపెట్టాల్సిన సెల్లార్లను దర్జాగా ఇతర వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారు.
కరీంనగర్ టౌన్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): నగరంలోని వాణిజ్యసముదాయాలు, కమర్షియల్ బిల్డింగ్స్‌లో నిబంధనలకు తిలోదకాలిస్తున్నారు. ఆయా వాణిజ్య సముదాయాలు, బిల్డింగ్స్‌కు సంబంధించిన వాహనాలను పార్కింగ్ చేసేందుకు వదిలిపెట్టాల్సిన సెల్లార్లను దర్జాగా ఇతర వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారు. దీంతో వాహనాలను భవనాల ఎదుట రోడ్లపైనే పార్కింగ్ చేస్తున్నారు. చాలా చోట్ల ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. నిబంధనల మేరకు వాణిజ్య సముదాయాలు, కమర్షియల్ బిల్డింగ్స్, అపార్టుమెంట్లలో ఎప్పడైనా అగ్ని ప్రమాదం లాంటివి సంభవిస్తే కనీసం ఫైర్ ఇంజన్ తిరిగే విధంగా నాలుగువైపులా ఖాళీ స్థలం ఉండాలి. అలాంటి నిబంధనలు చాలా భవనాల్లో పాటించడం లేదు.
ఫ రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ ఇబ్బందులు
నగరంలో జనాభాతోపాటు వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మరోవైపు దర్జాగా రోడ్లను, ఫుట్‌పాత్‌లను అక్రమించి వాహనాలను దుకాణాలు, హాస్పిటల్, షాపింగ్ మాల్స్, ఫంక్షన్ హాల్స్, ప్రైవేట్ విద్యాసంస్థలు, పెద్దపెద్ద వ్యాపార, వాణిజ్య సంస్థలకు వచ్చే వారు రోడ్లపై వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. దీంతో నగరంలో విపరీతమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు పలు కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే రోడ్లపై, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలను తొలగించడంతోపాటు తిరిగి వాటి ఆక్రమణలు జరుగకుండా ఉండేందుకు వెండింగ్ జోన్లను ఏర్పాటు చేశారు. ‘బెటర్ స్పేసెస్... బెటర్ కేఎంసీ’ కోసం నగరంలో నిరంతరంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని టౌన్‌ప్లానింగ్ అధికారులను ఇటీవల ఆదేశించారు. ప్రతి రోజు టౌన్‌ప్లానింగ్ అధికారులు నగరంలో పర్యటించి రోడ్లు, ఫుట్‌పాత్ ఆక్రమణలు, స్ట్రీట్ వెండింగ్ జోన్ నిర్వహణతోపాటు కమర్షియల్ బిల్డింగ్స్, వాణిజ్య సముదాయాల్లో సెల్యూలర్లలో కమర్షియల్ వినియోగంపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. దీంతో రెండు రోజుల నుంచి టౌన్‌ప్లానింగ్ అధికారులు నగరంలో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. వాణిజ్య సముదాయాలను సందర్శించి సెల్లార్లలో వాహనాలను పార్కింగ్ చేస్తున్నారా... లేక కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తున్నారా గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.
ఫ నగరంలో 200 వాణిజ్య సముదాయాలు
నగరంలో 200 వరకు వాణిజ్య సముదాయాలు, వాణిజ్య, వ్యాపార సంస్థల భవనాలు ఉన్నాయి. చాలా మేరకు నిబంధనలను పాటించడం లేదని, హాస్పిటల్ సెల్యూలర్లు, షాపింగ్ మాల్స్‌కు సెల్లార్లలో గదులను నిర్మించుకొని వాణిజ్య, వ్యాపార అవసరాలకు వినియోగిస్తుండడంతో వాహనాలను రోడ్లపైనే నిలుపుతున్నట్లు గుర్తించారు. రెండు రోజుల క్రితం కమిషనర్ ప్రపుల్‌దేశాయ్, టౌన్‌ప్లానింగ్ అధికారులతో కలిసి వివిధ ప్రాంతాల్లోని 20 కమర్షియల్ బిల్డింగ్స్‌ను పరిశీలింంచారు. వాటిలో 17 సెల్లార్లను ఇతర అవసరాలకు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. సోమవారం టౌన్‌ప్లానింగ్ అధికారులు 44 వాణిజ్య భవనాలను పరిశీలించగా 24 భవనాల్లోని సెల్లార్లను ఇతర అవసరాల కోసం వాడుతున్నట్లు గమనించారు. దీంతో ఆయా భవనాల యజమానులు, నిర్వహకులకు సెల్లార్ నిబంధనలపై అవగాహన కల్పించారు. వారంరోజుల్లోగా ఇతర నిర్మాణాలను తొలగించి వాహనాల పార్కింగ్‌కు మాత్రమే వినియోగించుకోవాలని సూచిస్తూ నోటీసులు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాణిజ్య సముదాయాలు, భవనాల ఎదుట రోడ్లపై వాహనాలను నిలుపవద్దని, నిబంధనలను తప్పకుండా పాటించాలని, లేకపోతే మున్సిపల్ చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.