Share News

BRS: వర్షంతోనే వాయిదా పడిందా?

ABN , Publish Date - Aug 14 , 2025 | 01:17 AM

బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు బీఆర్‌ఎస్‌ తలపెట్టిన బీసీ సదస్సు వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు వాయిదా పడడంపై జిల్లావ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

BRS: వర్షంతోనే వాయిదా పడిందా?

  • బీసీ గర్జనపై బీఆర్‌ఎస్‌లో చర్చ

  • అధిష్ఠానం మనసు మార్చుకుందని ప్రచారం

  • నిర్వహిస్తారా.. లేదా అని అనుమానం

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌): బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు బీఆర్‌ఎస్‌ తలపెట్టిన బీసీ సదస్సు వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు వాయిదా పడడంపై జిల్లావ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వర్షం పడే అవకాశాలున్నాయంటూ రెండుసార్లు సభను వాయిదా వేశారు. ఇందుకు కారణం వర్షం కాదని, మరేదో ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని కేసీఆర్‌ తనయ కవిత డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను కొద్ది నెలలుగా దూరం పెడుతూ వస్తున్న పార్టీ అగ్రనేతలకు ఈ సదస్సులు నిర్వహించడం ఇష్టం లేదనే ప్రచారం జరుగుతోంది. అందుకే సభను వాయిదా వేస్తున్నారని చర్చించుకుంటున్నారు. భారీ సభలు నిర్వహించి బీఆర్‌ఎస్‌ రాజకీయంగా ప్రజల్లో పట్టు కోల్పోలేదని నిరూపించుకోవాలని అధిష్ఠానం భావిస్తోందనే ప్రచారం జరిగింది. లక్షకు మించి జనాన్ని సమీకరించిన సింహాగర్జన లాంటి భారీ సభలు నిర్వహించిన కరీంనగర్‌లో బీసీ సభ పేరిట ఐదు వేల మందికి మాత్రమే సరిపోయే గ్రౌండ్‌ను ఎంపిక చేయడం ఏమిటనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ సదస్సు అంటే ఇష్టం ఉండే చేస్తున్నారా అనే కోణంలో కూడా ఉమ్మడి జిల్లా పరిధి బీఆర్‌ఎస్‌ శ్రేణులు, రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి.

వాతావరణం పేరు చెప్పి రెండు సార్లు వాయిదా..

బీసీ రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్‌ డ్రామాలు ఆడుతున్నదని బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. బీసీలకు రిజర్వేషన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయాలనే డిమాండ్‌తో ప్రజల్లోకి వెళ్లి వారి మద్దతు కూడగట్టాలని నిర్ణయించింది. అందుకు ఉమ్మడి జిల్లాల స్థాయిలో బీసీ రిజర్వేషన్లపై భారీ సభలు నిర్వహించాలని తలపెట్టింది. కరీంనగర్‌ నుంచి ఈ సభలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించి ఆగస్టు 8న ముహూర్తంగా ప్రకటించింది. ఈ సభ నిర్వహణ కోసం చింతకుంటలోని తెలంగాణ భవన్‌లో సమావేశం నిర్వహించి నేతలను, క్రియాశీల కార్యకర్తలను సమాయత్తం చేశారు. మాజీ మంత్రులు, బీసీ వర్గానికి చెందిన ముఖ్య నేతలు మధుసూదనాచారి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, గంగుల కమలాకర్‌, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జిల్లాకు వచ్చి సభ నిర్వహించాల్సిన స్థలాలను పరిశీలించి వెళ్లారు. ఇది జరిగి రెండు రోజులు గడవక ముందే వారం రోజులపాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని సదస్సును వాయిదా వేసినట్లు ప్రకటించారు. ఈ ప్రకటన బీఆర్‌ఎస్‌ నాయకులకు, శ్రేణులను కంగుతినిపించింది.

జన సమీకరణ బాధ్యత ఎవరిది?

ఐదు వేల మందికి మాత్రమే సరిపోయే గ్రౌండ్‌ను ఎంపిక చేయడం ఏమిటి, దీని ద్వారా అనుకున్న ప్రయోజనాలకు భిన్నమైన పరిస్థితి ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని పార్టీలోని కొందరు అభిప్రాయపడ్డారు. పెద్ద గ్రౌండ్‌లో సమావేశం నిర్వహిస్తే జన సమీకరణ చేయడం ఎలా, వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతుండడంతో ప్రజలు పెద్దగా హాజరుకాకపోవచ్చని, జనాన్ని సమీకరించడానికి బాధ్యత ఎవరు తీసుకోవాలి, అందుకు డబ్బులు ఎవరు పెట్టాలి అనే ప్రశ్నలు తలెత్తాయని తెలిసింది. ఈ అంశంమీద చర్చ జరిగి ఎటూ తేలకుండా పోయిందని, అందుకే బీసీ సభను వాయిదా వేశారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం జరుగుతుండడం పార్టీపై తప్పుడు సంకేతం ఇస్తుందని, వెంటనే సభ నిర్వహించాలని 14వ తేదీని మళ్లీ ముహూర్తంగా నిర్ణయించారు. వాతావరణశాఖ 14 నుంచి ఐదు రోజులపాటు భారీ, అతిభారీ వర్షాలు ఉన్నాయని హెచ్చరించరించడంతో బీఆర్‌ఎస్‌ బీసీ సభను మళ్లీ వాయిదా వేశారు.

kcr-farm-house.jpg

రకరకాల ఊహాగానాలు..

బీసీ సభ రెండుసార్లు వాయిదా పడడంతో రాజకీయ పక్షాలు, బీఆర్‌ఎస్‌ శ్రేణులు రకరకాల ఊహాగానాలు చేస్తూ చర్చించుకుంటున్నారు. బీసీ రిజర్వేన్లు అమలు చేయాలని కవిత డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో బీసీ గర్జనలు నిర్వహిస్తే ఆమెను అనుసరించినట్లు అవుతుందా అనే కోణంలో అధిష్ఠానం ఆలోచిస్తున్నదని ప్రచారం జరుగుతున్నది. ఈ సదస్సుల నిర్వహణసన్నాహాక సమావేశాల్లో బీసీ నేతలే పాల్గొనడం చర్చకు దారితీస్తున్నది. మొదట ఈ సభకు పార్టీ అధినేత కేసీఆర్‌, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ హాజరవుతారని ప్రచారం జరిగింది. బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం కరీంనగర్‌ సభ నిర్వహణ బాధ్యతను మొత్తం మాజీ మంత్రి గంగుల కమలాకర్‌పై పెట్టింది. జన సమీకరణ, సభ ఏర్పాట్లకు అయ్యే ఖర్చులు మొత్తం ఆయనే భరించాలా లేక పార్టీ అధిష్టానవర్గం బాధ్యత తీసుకుంటుందా అనే విషయంలో స్పష్టత లేకపోవడం కూడా సమావేశం వాయిదాకు కారణమని జిల్లాలో చర్చించుకుంటున్నారు.

Updated Date - Aug 14 , 2025 | 07:16 AM