Share News

కాంగ్రెస్‌లో మాటల యుద్ధం

ABN , Publish Date - Oct 08 , 2025 | 01:17 AM

కాంగ్రెస్‌లో మాటల యుద్ధం ప్రారంభమైంది. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌పై మరో మంత్రి పొన్నం ప్రభాకర్‌ చేసిన అనుచిత వాఖ్యలు జిల్లాలో రాజకీయవేడిని రాజేస్తున్నాయి. మంత్రి పొన్నం చేసిన వాఖ్యలు ఆయన మెడకే కాకుండా మరో మంత్రి వివేక్‌ వెంకట్‌స్వామికి కూడా చుట్టుకుంటున్నాయి.

కాంగ్రెస్‌లో మాటల యుద్ధం

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

కాంగ్రెస్‌లో మాటల యుద్ధం ప్రారంభమైంది. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌పై మరో మంత్రి పొన్నం ప్రభాకర్‌ చేసిన అనుచిత వాఖ్యలు జిల్లాలో రాజకీయవేడిని రాజేస్తున్నాయి. మంత్రి పొన్నం చేసిన వాఖ్యలు ఆయన మెడకే కాకుండా మరో మంత్రి వివేక్‌ వెంకట్‌స్వామికి కూడా చుట్టుకుంటున్నాయి. ఒక సమావేశానికి ఆలస్యమయ్యాడన్న కారణంతో మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‘మనకు టైమంటే తెలుసు...జీవితమంటే తెలుసు...దున్నపోతు వానికేమి తెలుసు’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

దీనిపై లక్ష్మణ్‌కుమార్‌ తీవ్రంగా స్పందించారు. ‘పొన్నం ప్రభాకర్‌ లాగా అహంకారంగా మాట్లాడడం నాకు రాదు...దళితుల కుటుంబంలో పుట్టడం నా తప్పా...ఆయన నన్నే కాదు మా జాతినందరిని అవమానించారు. 24 గంటల్లోగా జరిగిన దానికి ఆయన క్షమాపణ చెప్పక పోతే జరుగబోయే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలి’... అంటూ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ హెచ్చరించారు. తనను అవమానపరిచే విధంగా మాట్లాడిన సమయంలో అక్కడే ఉన్న దళిత మంత్రి వివేక్‌ వెంకటస్వామి దానిని ఏ మాత్రం ఖండించక పోవడాన్ని ఆయన తప్పుబట్టారు. మొదటి నుంచి మాదిగ సామాజిక వర్గాన్ని వివేక్‌ వ్యతిరేకిస్తూ వస్తున్నారని, తాను మంత్రి కావడం ఆయనకు ఇష్టం లేదు.. నేను వస్తానంటే ఆయన వెళ్లిపోతానంటున్నారు.. అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. మంత్రుల తీరును తాను సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ఖర్గే, మీనాక్షి నటరాజన్‌ దృష్టికి తీసుకు వెళ్తానని ఆయన అన్నారు.

ఫ తీవ్రంగా పరిగణించిన సామాజికవర్గం

మంత్రి అడ్లూరికి జరిగిన అవమానాన్ని మాదిగ సామాజిక వర్గం తీవ్రంగా పరిగణిస్తోంది. మంత్రికి మద్దతుగా పలు చోట్ల మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వివేక్‌ వెంకటస్వామి వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కరీంనగర్‌ తెలంగాణ చౌక్‌, చిగురుమామిడి మండల కేంద్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. కరీంనగర్‌లోని జగ్జీవన్‌రామ్‌ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ క్షమాపణ చెప్పకపోతే తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.

ఫ మంత్రుల మధ్య సమన్వయ లోపం

జిల్లాలో ఇప్పటికే మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ మధ్య సఖ్యత కొరవడింది. అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ శ్రీధర్‌బాబుకు సన్నిహితుడు కావడంతోనే శ్రీధర్‌బాబుకు వ్యతిరేకవర్గమైన మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వివేక్‌ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం జీర్ణించుకోలేక పోతున్నారని మాదిగ సామాజికవర్గ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే అసహనంతో ఇలా ప్రవర్తిస్తున్నారని వారంటున్నారు.

ఫ ఆందోళనలో స్థానిక నాయకులు

స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ వివాదం తలెత్తడం పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తుందని కాంగ్రెస్‌ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సెప్టెంబరు 17న ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ కరీంనగదర్‌ జిల్లాలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్‌ జీర్ణించుకోలేక పోతున్నాడని, ఆయన ఈ విషయాన్ని బాహటంగానే వ్యక్తం చేసిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ముగ్గురు మంత్రుల మధ్య వివాదంతో జిల్లాలో పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఫ పీసీసీ సర్దుబాటు చర్యలు

మొదట ఈ వ్యవహారాన్ని చిన్న విషయంగానే భావించిన టీపీసీసీ జరుగుతున్న నష్టాన్ని గమనించిన తర్వాత సర్దుబాటు చర్యలు ప్రారంభించినట్లు సమాచారం. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఈ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ ఇది ఇంటి సమస్య అని, త్వరలోనే పరిష్కరించుకుంటామని వ్యాఖ్యానించారు. శ్రీధర్‌బాబుతోనూ ఈ విషయం మాట్లాడినట్లు సమాచారం. మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వివేక్‌ వెంకట్‌స్వామి క్షమాపణలు చెప్పాల్సిందేనని మాదిగ సామాజికవర్గ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. 24 గంటలు వేచి చూసిన తర్వాత తమ ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Updated Date - Oct 08 , 2025 | 01:17 AM