Share News

రైతుభరోసా కోసం నిరీక్షణ..!

ABN , Publish Date - Dec 26 , 2025 | 12:53 AM

యాసంగి సీజన్‌ ఆరంభం కావడంతో రైతు భరోసా కింద ప్రభుత్వం అందజేసే పెట్టుబడి సాయం ఎప్పుడు వస్తుందా అని రైతులు ఎదురు చూస్తున్నారు.

రైతుభరోసా కోసం నిరీక్షణ..!

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

యాసంగి సీజన్‌ ఆరంభం కావడంతో రైతు భరోసా కింద ప్రభుత్వం అందజేసే పెట్టుబడి సాయం ఎప్పుడు వస్తుందా అని రైతులు ఎదురు చూస్తున్నారు. రైతు భరోసా కోసం రాష్ట్ర వ్యాప్తంగా యాసంగిలో పంట సాగు భూములను శాటిలైట్‌ మ్యాపింగ్‌ పూర్తి చేయాల్సి ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు ప్రకటించడంతో అసలు ఈ సీజన్‌కు రైతుభరోసా డబ్బులు ఇస్తారా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. యాసంగి సీజన్‌ ఆరంభమై నెల రోజులు కావస్తున్నది. ఇప్పటి వరకు ప్రభుత్వం రైతుభరోసా గురించి ప్రస్తావించక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

రాష్ట్రంలో పట్టా భూములు కలిగిన రైతులకు ప్రతీ సీజన్‌కు పెట్టుబడి సాయాన్ని అందించాలని గత ప్రభుత్వ హయాంలో 2018 యాసంగి సీజన్‌ నుంచి రైతుబంఽధు పథకాన్ని తీసుకవచ్చారు. మొదట ఈ పథకం ద్వారా ఎకరానికి 4 వేల రూపాయల చొప్పున అందజేయగా, ఆ తర్వాత సీజన్‌ నుంచి 5 వేల రూపా యలకు పెంచారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ తాము అధికారంలోకి వస్తే రైతుభరోసా పథకం కింద ఎకరానికి రెండు పంటలకు కలిపి 15 వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయా న్ని అందజేస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు అధికా రంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సందర్భంగా నిలిచిపోయిన రైతుబంధు పథకం డబ్బులను 2024 జనవరిలో రైతుల ఖాతాల్లో జమ చేసింది. అదే ఏడాది వానాకాలం సీజన్‌లో ప్రభుత్వం రైతుభరోసా కింద రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించ లేదు. 2 లక్షల రూపాయల వరకు పంట రుణాలను మాఫీ చేశారు. ఈ ఏడాది జనవరిలో రైతుభరోసా పథకాన్ని ఆరంభించి నప్పటికీ, 3 ఎకరాల భూములు కలిగిన వారికి మాత్ర మే రైతు భరోసా పథకం డబ్బులను రైతుల ఖాతాల్లో వేశారు. ఎన్నికల సందర్భంగా ప్రకటించిన విధంగా కాకుండా ఎకరానికి 6 వేల రూపాయల చొప్పున మాత్రమే ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా 1,14,313 రైతులకు 42 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశారు. 3 ఎకరాలకు పైగా భూములు ఉన్న వారికి పెట్టుబడి సాయాన్ని ఇవ్వలేదు. గడిచిన వానాకాలం సీజన్‌లో మాత్రం పూర్తిస్థాయిలో 1,21,698 మంది రైతుల ఖాతా ల్లో 88 లక్షల 86 లక్షల రూపాయలు వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. ఈ యాసంగి సీజన్‌కు సం బంధించి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. మొన్నటి వరకు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరి గాయి. ఈ సందర్భంగా ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండ డంతో రైతు భరోసా పథకం ద్వారా పెట్టుబడి సాయం డబ్బులను విడుదల చేయరని అంతా భావించారు. ఈ నెల 17వ తేదీన ఎన్నికలు పూర్తి కాగా, 22వ తేదీన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత నుంచి కూడా ప్రభుత్వం రైతుభరోసా పథకం గురించి ఏమి ప్రస్తా వించ లేదు. బుధవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు రైతు భరోసా పథకం అమలు కోసం సాగు భూములను శాటిలైట్‌ మ్యాపింగ్‌ ద్వారా గుర్తిస్తామని ప్రకటించడంతో పథకం ద్వారా డబ్బులు ఇస్తారా లేదా అనే అనుమానాలను రైతులు వ్యక్తం చేస్తున్నారు. యేటా యాసంగి సీజన్‌లో వరి నాట్లు జనవరి నెలాఖరు వరకు సాగుతాయి. అంటే రైతు భరోసా నిధులు ఫిబ్రవరి, మార్చిలో గానీ విడుదల చేసే అవకాశాలు లేకపోలేదని కొందరు అభిప్రాయ పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతు భరోసా నిధులను తమ ఖాతాల్లో జమ చేయాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Dec 26 , 2025 | 12:53 AM