Share News

20 నెలలుగా నిరీక్షణ

ABN , Publish Date - Nov 15 , 2025 | 11:55 PM

రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ను మంజూరు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తుండడంతో ఉద్యోగ విరమణ పొందిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బెనిఫిట్స్‌ను వినియోగించుకొని శేష జీవితాన్ని గడుతామనుకుంటున్న వారి కల కలగానే మిగులుతోంది.

20 నెలలుగా నిరీక్షణ

కరీంనగర్‌ టౌన్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ను మంజూరు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తుండడంతో ఉద్యోగ విరమణ పొందిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బెనిఫిట్స్‌ను వినియోగించుకొని శేష జీవితాన్ని గడుతామనుకుంటున్న వారి కల కలగానే మిగులుతోంది. 2024 మార్చి నుంచి ఇప్పటి వరకు రిటైర్‌ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు జమచేసుకున్న డబ్బులతోపాటు వారికి రావలసిన బెనిఫిట్స్‌ ఇవ్వలేదు.. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 2024 నుంచి ఇప్పటి వరకు రిటైర్‌ అయిన ఉద్యోగుల్లో 26 మంది పెన్షనర్లు ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక అనారోగ్యాలకు గురై మృతిచెందినట్లు రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ (రేవా) ప్రకటించింది. ఎన్నాళళ్ల ఈ ఆర్థికభారాన్ని మోయాలని వారు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు 30 నుంచి 40 సంవత్సరాలు పని చేసి తమ సర్వీసులో పొదుపు చేసిన డబ్బులతోపాటు, పదవీ విరమణ పొందిన వెంటనే రావలసిన టీజీపీఎఫ్‌, టీజీఎల్‌ఐ, జీఐఎస్‌ ఏ ఒక్కటి మంజూరు చేయలేదు. లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌, ఉద్యోగుల హక్కు అయిన కమ్యూటేషన్‌, గ్రాట్యుటీ డబ్బు అందకపోవడంతో పెన్షనర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఒక్కో ఉద్యోగికి జీపీఎఫ్‌ డబ్బులు 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు స్తాయి. ఈఎస్‌జీఎల్‌ఐ కింద మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. ఇలా 30 ఏళ్లపైన సర్వీసు పూర్తి చేసి పదవీ విరమణ చేసిన ఒక్కో ఉద్యోగికి 50 లక్షల నుంచి 75 లక్షల వరకు బెనిఫిట్స్‌ రావాల్సి ఉంది.

ఫ ఆందోళనకు సిద్ధమవుతున్న సంఘాలు

ఉమ్మడి జిల్లాలో వెయ్యి మంది వరకు ఉద్యోగ, ఉపాధ్యాయులు పదవీ విరమణ చేశారు. రిటైర్‌ అయిన ఉద్యోగులు వారు జమ చేసుకున్న డబ్బులతోపాటు పెన్షన్‌ బెనిఫిట్స్‌ బకాయిలను విడుదల చేయక పోవడంతో రిటైర్డు ఉద్యోగ సంఘాలన్నీ ఏకమయ్యాయి. మరోవైపు 2024 మార్చి తర్వాత రిటైర్డు అయిన ఉద్యోగ, ఉపాధ్యాయులు కొత్తగా ఏర్పాటు చేసిన రిటైర్డు ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ (రేవా) ఇప్పటికే జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆందోళనలు, ధర్నాలు చేపట్టింది. తాజాగా రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈనెల 17న హైదరాబాద్‌లో మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది.

ఫ రాష్ట్రంలో 26 మంది పెన్షనర్లు మరణించారు

- కోహెడ చంద్రమౌళి, రేవా రాష్ట్ర కన్వీనర్‌

మార్చి 2024 నుంచి ఇప్పటి వరకు పదవీ విరమణ చేసిన ఉద్యోగుల్లో ఆర్థిక ఇబ్బందులు, వైద్య ఖర్చులు, ఇతరత్రా అవసరాలను తీర్చుకోలేక రాష్ట్రంలో 26 మంది రిటైర్డ్‌ ఉద్యోగులు మృతి చెందారు. అనేక మంది పదవీ విరమణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులు రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ కోసం కళ్లలో వత్తులు వేసుకొని చూస్తున్నారు. రేవా ఆధ్వర్యంలో ప్రభుత్వానికి చాలా సార్లు వినతిపత్రాలను సమర్పించాము. అయినా ప్రభుత్వం కనీస స్పందన లేకుండా ఉసురు తీస్తోంది. పెన్షన్‌ బెనిఫిట్స్‌ను వెంటనే ప్రభుత్వం మంజూరు చేయాలని ఈనెల 17న తలపెట్టిన మహాధర్నాతో ప్రభుత్వంపై ఒత్తిడి తేవడమే కాకుండా తమకు న్యాయం చేసే వరకు పోరాటం చేస్తాము.

Updated Date - Nov 15 , 2025 | 11:55 PM