రైతు వేదికల్లో దృశ్య మాధ్యమాలు
ABN , Publish Date - Jun 23 , 2025 | 11:29 PM
సాగుల ఆధునిక పద్ధతులపై అన్నదాతలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికల్లో దృశ్య మాధ్యమాలను ఏర్పాటు చేసింది.
కరీంనగర్ రూరల్, జూన్ 23 (ఆంధ్రజ్యోతి) సాగుల ఆధునిక పద్ధతులపై అన్నదాతలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికల్లో దృశ్య మాధ్యమాలను ఏర్పాటు చేసింది. కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లి, దుర్శేడ్, మొగ్దుంపూర్ రైతు వేదికల్లో దృశ్య మాధ్యమాలను ఏర్పాటు చేశారు. ప్రతి మంగళవారం రైతు వేదికల్లో వ్యవసాయ, ఉద్యానవన, మత్స్య, పట్టు, పశు సంవర్దక, నీటి పారుదల శాఖలకు సంబందించిన విషయాలపై అధికారులు, శాస్త్రవేత్తలు రైతులకు సలహాలు అందిస్తారు. మండలంలో సాగు విస్తీర్ణం 15,294 ఎకరాలు ఉండగా రైతులు 12,908 మంది ఉన్నారు. ఈ వానకాలంలో వరి 12,672 ఎకరాల్లో, పత్తి 1,472 ఎకరాలో , మొక్కజొన్న 85 ఎకరాల్లో సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు.
ఫ విస్తరణ అధికారులకు బాధ్యతలు
మండలంలో రైతు వేదికలకు రక్షణ కరువైంది. ఇప్పటికి పలు రైతు వేదికల్లో కనీస సౌకర్యాలు లేవు. వీటిలో ఏర్పాటు చేసిన దృశ్య వ్రవణ మాధ్యమాల విలువ నాలుగు లక్షల వరకు ఉంటుంది. వీటి నిర్వహణ బాధ్యత ఏఈఓలకు అప్పపగించారు. ఇప్పటికే రైతు వేదికల నిర్వహణ బారంతో సతమతమవుతున్న ఏఈవోలకు వీటి భద్రతను చూసుకోవడం ఇబ్బందిగా మారింది.
ఫ రైతులు సద్వినియోగం చేసుకోవాలి
- బి సత్యం, మండల వ్యవసాయ శాఖ అధికారి
మండలంలో రైతులకు సూచనలు, సలహాలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రైతు వేదికల్లో దృశ్య శ్రవణ మాధ్యమాలను ఏర్పాటు చేస్తొంది. ప్రతి మంగళవారం నిర్వహించే ఈ కార్యక్రమాల్లో రైతులు పాల్గొని శాస్త్రవేత్తల సలహాలు, వ్యవసాయ శాఖ అధికారుల, ఉద్యానవ వన శాఖ అధికారుల సూచనలు పొందవచ్చు. రైతులు ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలి.