Share News

ఎల్‌ఎండీకి సందర్శకుల తాకిడి

ABN , Publish Date - Aug 11 , 2025 | 12:09 AM

సెలవు రోజు వచ్చిందంటే చాలు కరీంనగర్‌ సమీపంలోని దిగువ మానేరు జలాశయం సందర్శకులతో కళకళలాడుతోంది. ఎల్‌ఎండీలో ప్రస్తుతం నీళ్లు తక్కువగా ఉన్నాయి. డ్యాం పరిసరాలు పచ్చిక బయళ్లతో అందంగా కనిపిస్తున్నాయి.

 ఎల్‌ఎండీకి సందర్శకుల తాకిడి

తిమ్మాపూర్‌, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): సెలవు రోజు వచ్చిందంటే చాలు కరీంనగర్‌ సమీపంలోని దిగువ మానేరు జలాశయం సందర్శకులతో కళకళలాడుతోంది. ఎల్‌ఎండీలో ప్రస్తుతం నీళ్లు తక్కువగా ఉన్నాయి. డ్యాం పరిసరాలు పచ్చిక బయళ్లతో అందంగా కనిపిస్తున్నాయి. గాలికి వచ్చే అలలు బీచ్‌ను తలపిస్తున్నాయి. సోషల్‌ మీడియాలో ఈ ప్రాంతాన్ని కరీంనగర్‌ బీచ్‌ అంటూ వైరల్‌ చేయడంతో సందర్శకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ ప్రాంతం ఓ పిక్నిక్‌ స్పాట్‌గా మారింది. సెలవు రోజుల్లో పెద్ద ఎత్తున వాహనాల్లో తరలివస్తున్నారు. యువత వాహనాలను డ్యాం లోపలికి దింపి విన్యాసాలు చేస్తున్నారు. కొన్ని వాహనాలు ఇరుక్కుపోవడంతో ఎక్స్‌కావేటర్లతో తొలగించారు. కొన్నిసార్లు ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురవుతున్నాయి దీంతో పోలీసులు అప్రమత్తమై వాహనాలను అసలు కట్టపైకి రానివ్వకుండా కట్టడి చేశారు.

ఫ ప్రమాదం అని తెలిసినా..

డ్యాంలో నీటి లోతు ఎక్కడ ఎలా ఉందో తెలియని పరిస్థితి. డ్యాంలో ప్రమాదవశాత్తు పడి ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఇంత జరుగుతున్నా కొందరు సందర్శకులు అవేవీ పట్టనట్టు చిన్నపిల్లల్ని కూడా డ్యాం నీటిలోకి దించి ఆడుతున్నారు. తక్కువ నీరు ఉన్న చోట కాకుండా ఎక్కువ నీరు ఉన్న చోటకు దిగి ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు. ఇక్కడికి సందర్శకులు కొద్ది సేపు సరదాగా గడిపేందుకు వస్తే కొంత మంది మందుబాబులు మద్యం తాగుతూ ఇతరులను ఇబ్బంది పెడుతున్నారు. వారు మద్యం సేవించి బాటిళ్లను పగలగొట్టి ఎక్కడ పడితే అక్కడ పడేసి వెళుతున్నారు. మత్స్యకారుల తెడ్లు, వలలను ధ్వసం చేస్తున్నారు.

Updated Date - Aug 11 , 2025 | 12:09 AM