Share News

నిఘా నీడలో ‘పల్లె పోరు’

ABN , Publish Date - Dec 06 , 2025 | 01:19 AM

గ్రామ పంచాయతీ ఎన్నికల కోంం అధికారులు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. పోలీసు నిఘా నీడలో ఎన్నికలు నిర్వహించడానికి సర్వం సిద్ధం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 మండలాల్లో 260 గ్రామాల్లో ఇప్పటివరకు కొన్ని పంచాయతీలు ఏకగ్రీవం కాగా మిగతా పంచాయతీల్లో సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికల పోరును ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుంది.

నిఘా నీడలో ‘పల్లె పోరు’

- జిల్లా సరిహద్దులో ఆరు చెక్‌పోస్టులు

- ఆకస్మిక తనిఖీలు చేస్తున్న కలెక్టర్‌, ఎస్పీ

- ఈనెల 31 వరకు పోలీస్‌ యాక్ట్‌ అమలు

- జిల్లాలో 51 సమస్యాత్మక, 41 అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు

- ఇప్పటికే 657 మంది బైండోవర్‌

- పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రత

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

గ్రామ పంచాయతీ ఎన్నికల కోంం అధికారులు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. పోలీసు నిఘా నీడలో ఎన్నికలు నిర్వహించడానికి సర్వం సిద్ధం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 మండలాల్లో 260 గ్రామాల్లో ఇప్పటివరకు కొన్ని పంచాయతీలు ఏకగ్రీవం కాగా మిగతా పంచాయతీల్లో సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికల పోరును ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుంది. జిల్లాలో మూడు విడతల్లో జరిగే ఎన్నికల్లో తొలి విడతలో రుద్రంగి, చందుర్తి, వేములవాడ, వేములవాడ రూరల్‌, కోనరావుపేట, మండలాలు ఉండగా, రెండో విడత లో బోయిన్‌పల్లి, ఇల్లంతకుంట, తంగళ్ళపల్లి, మూడో విడతలో ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి ముస్తాబాద్‌, గంభీరావుపేట మండలాల్లోని గ్రామాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడత నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి కావడంతో అభ్యర్థులు ప్రచారంలో కుస్తీ పడుతున్నారు. రెండో విడత నామినేషన్‌లో ఉపసంహరణ శనివారం పూర్తికానుంది. మూడో విడత నామినేషన్ల ఉపసంహరణ 9వ తేదీ వరకు గడువు ఉంది. ఇప్పటికే గ్రామాల్లో ఎన్నికల వేడి మొదలు కాగా ఎన్నికల కోడ్‌ను పకడ్బందీగా అమలు చేయడానికి జిల్లా యంత్రాంగం, ఎన్నికల ప్రచారం నుంచి పోలింగ్‌ వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు ప్రక్రియ ముగిసే విధంగా పోలీస్‌ యంత్రాంగం నిరంతరంగా నిఘా పెట్టింది. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అక్రమాలకు చెక్‌ పెట్టే దిశగా చర్యలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలకు చెక్‌ పెట్టే విధంగా జిల్లా సరిహద్దుల్లో ప్రధానంగా ఆరు చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశారు. తంగళ్ళపల్లి మండలం జిల్లెళ్ల్ల, గంభీరావుపేట మండలం పెద్దమ్మ స్టేజి, వేములవాడ రూరల్‌ మండలం పాజిల్‌నగర్‌, బోయినపల్లి మండలం నర్సింగాపూర్‌, రుద్రంగి మండలం మానాల క్రాస్‌ రోడ్‌, ముస్తాబాద్‌ మండలం వెంకట్రావుపల్లి చెక్‌ పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. చెక్‌ పోస్టుల వద్ద జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌, ఎస్పీ మహేష్‌ బీ గితే ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. చెక్‌పోస్టుల వద్ద స్టాటిక్‌, సర్వైలెన్సు బృందాలు, వీడియోగ్రాఫర్‌ ద్వారా నిరంతరం తనిఖీలను రికార్డ్‌ చేస్తున్నారు. రెండు షిఫ్టుల్లో అధికారులు విధులు నిర్వహిస్తున్నారు.

సమస్యాత్మక గ్రామాలపై పటిష్ట నిఘా

సిరిసిల్ల జిల్లాలో 12 మండలాల్లో 51 సమస్యాత్మక ప్రాంతాలుగా 49 సున్నితమైన ప్రాంతాలుగా గుర్తించారు. సమస్యాత్మక గ్రామాల్లో గతంలో జరిగిన పార్లమెంట్‌, శాసనసభ, స్థానిక ఎన్నికల్లో జరిగిన ఘర్షణలు, సంఘటనలు రాజకీయ ఘర్షణలు అధ్యయనం చేసి ప్రస్తుతం తీసుకోవలసిన చర్యలపై దృష్టి పెట్టారు. సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక భద్రతా చర్యలను తీసుకుంటున్నారు అవసరాన్ని బట్టి అదనపు బలగాలను సైతం వినియోగించే విధంగా దృష్టి పెట్టారు. ఇప్పటికే జిల్లాలో డిసెంబరు 31 వరకు పోలీస్‌ యాక్ట్‌ అమల్లోకి తెచ్చారు. ఇప్పటివరకు 659 మందిని బైండోవర్‌ చేశారు. ముందస్తుగానే 18 లైసెన్స్‌ తుపాకులను ఎస్పీ కార్యాలయంలో అప్పగించారు. గ్రామాల్లో రాజకీయ పార్టీల నాయకులకు ఎన్నికలు సజావుగా సాగేలా సహకరించే విధంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.

నగదు, మద్యం నిలువలపై నజర్‌

పంచాయతీ ఎన్నికల్లో నిబంధనలు ఖచ్చితంగా అమలు చేసే విధంగా అధికారులు దృష్టి సారించారు. సర్పంచ్‌, వార్డు సభ్యులు తమ గెలుపు కోసం ప్రధానంగా డబ్బులు, మద్యం వినియోగించడం సర్వసాధారణం. పోలీస్‌ యంత్రాంగం నగదు తరలింపు, మద్యం నిలవాలపై దృష్టి పెట్టారు జిల్లాలో ఇప్పటికే 209 లీటర్ల స్వాధీనం చేసుకున్నారు. అభ్యర్థుల ఎన్నికల ఖర్చులపె అధికారులు నిరంతురం పర్యవేక్షిస్తున్నారు. అభ్యర్థుల ఖర్చుకు పరిమితిని ఎన్నికల కమిషన్‌ విధించింది. ఐదు వేల జనాభాలోపు గ్రామాల్లో పోటీ చేసే సర్పంచ్‌ అభ్యర్థి రూ1.50 లక్షలు, వార్డు సభ్యుడు రూ 30వేలు, 5 లక్షలపైగా ఉన్న గ్రామాల్లో సర్పంచ్‌ అభ్యర్థి రూ 2.50 లక్షలు, వార్డు సభ్యుడు రూ 50 వేలు ఖర్చు పరిమితి ఉంది. ఎన్నికల సామగ్రికి లెక్క ఉంది. ఎన్నికల బరిలో ప్రచారానికి ఉపయోగించే సామగ్రికి లెక్క ఉంది. 76 రకాల సామగ్రికి రేట్లు ఎన్నికల సంఘం నిర్ణయించింది. రోజుకు లౌడ్‌ స్పీకర్‌ అద్దె 100 వాట్స్‌ రూ 500, వాట్స్‌ 200కు రూ 1300, డీజేకు రూ 2 వేలు, ఎల్‌ఈడీ స్ర్కీన్‌కు సైజ్‌ని బట్టి ఒకరోజు కిరాయి రూ 5 వేలు నుంచి 12 వేలు, వాహనంపై ఎల్‌ఈడీ అమర్చితే రూ 8 వేలు నుంచి 20 వేల వరకు చార్జిలు నిర్లయించారు. వీడియోగ్రాఫర్‌ కెమెరాతో కలిపి నెలకు రూ 22050, డ్రోన్‌ కెమెరాకు ఒక రోజు రూ3500, అడియో క్యాసెట్‌ రికార్డు రూ 2500,ఆటోతో రూ 3 వేలు నలుగురైదుగురు కూర్చునే వేదిక రోజుకు రూ 150 నుంచి రూ 2800 వరకు ఉంది. క్లాత్‌ బ్యానర్లు ఫీట్లలో సైజ్‌ను బట్టి రూ 9 నుంచి రూ 13 వరకు, ఫ్లెక్సీ బ్యానర్లు స్వైర్‌ఫీట్‌ రూ 7, హోర్డింగ్‌ ఫ్లెక్సీ రూ5 వేల నుంచి రూ 6వేల వరకు ధర నిర్ణయించారు. ఒక బ్యాడ్జీ రేటు రూ 10, పోస్టర్లలో మల్టీకలర్‌ సంఖ్యను బట్టి రూ 8500 నుంచి 75 వేలు, పూల దండ చిన్నది రూ 50, కలర్‌ పేపర్లతో రూ 150, పూలతో రూ 400, కరపత్రాలు ఒకటి రూపాయి, శాలువ రూ 50, ప్లకార్డులు రూ 25, జెండాలు రూ 5 నుంచి రూ 18 వరకు, డ్రైవర్‌తో కలిపి కారు, జీపు, టెంపో, ట్రక్‌, వాహనాల అద్దె రూ 2500, ఇన్నోవా, సూమో రూ 3500, కారు రూ 2 వేలు, మూడు చక్రాల వాహనం రూ850, డీసీఎం వ్యాన్‌ రూ 3వేలు, మినీ బస్‌ 25సీట్ల పరిమితి రూ4500, టాటాఏస్‌ వాహనం రోజుకు రూ 1600, బోలెరో రూ 3000, డీలక్స్‌ రూ 2200, సాధారణ గది రూ 1200, ఏసీ ఫంక్షన్‌ హాల్‌ కుర్చీలతో అర్బన్‌లో రూ 15 వేలు, రూరల్‌లో ఏసీ ఫంక్షన్‌ హాల్‌ రూ 10 వేలు, అర్బన్‌లో ఏసీ లేని ఫంక్షన్‌ హాల్‌ రూ 8 వేలు, రూరల్‌లో ఏసీ లేని ఫంక్షన్‌ హాల్‌ రూ 10 వేలు, టెంట్‌ బట్టిరూ800, సైడ్‌వాల్స్‌ రూ 30, కార్పెట్లు రెడ్‌ రూ 350,పెద్ద సైజ్‌ గ్రీన్‌ రూ 600 నిర్ణయించారు. లస్సీ, సాఫ్ట్‌ డ్రింక్‌ ఒకటి రూ 10, వాటర్‌ ప్యాకెట్‌ ఒక రూపాయి, వాటర్‌ బాటిల్‌ రూ 20, వాటర్‌ క్యాన్‌ 20లీటర్లు రూ10, టీ రూ 5, కాఫీ రూ 10, బ్రేక్‌ఫాస్ట్‌ రూ 35, వెజిటేబుల్‌ ప్లేట్‌ భోజనం రూ 50, నాన్‌వెజిటేబుల్‌ ప్లేట్‌ రూ 100, చికెన్‌ బిర్యానీ రూ 100, మటన్‌ బిర్యానీ రూ 120, పెద్ద సమోసా ఒకటి రూ 6, చిన్న సమోసా రూ 2, ప్లేట్‌ మిర్చి, బజ్జీ, పకోడి రూ 20, లెమన్‌ బియ్యం ప్లేట్‌ రూ 40 ధరలను నిర్ణయించారు.

Updated Date - Dec 06 , 2025 | 01:19 AM