అతివలూ ఆరోగ్యమస్తు..!
ABN , Publish Date - Sep 19 , 2025 | 12:42 AM
నిరంతరం ఇంటాబయట పని ఒత్తిడితో సతమతమవుతున్న మహిళలు పోషకాహార లోపం, రక్తహీనతతో పాటు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
నిరంతరం ఇంటాబయట పని ఒత్తిడితో సతమతమవుతున్న మహిళలు పోషకాహార లోపం, రక్తహీనతతో పాటు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. నిత్యం మహిళలు ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి మళ్లీ నిద్రకు ఉపక్రమించే వరకు కుటుంబం కోసం శ్రమిస్తూనే ఉంటారు. కుటుంబాన్ని చూసుకునే క్రమంలో తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపరు. తాత్కాలిక మందులతోనే సరిపెడతారు. మహిళ అనారోగ్యానికి గురైతే పిల్లల సంరక్షణే కాదు కుటుంబమంతా ఇబ్బందిపడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యకరమైన కుటుంబాన్ని నిర్మించే దిశగా కేంద్ర ప్రభుత్వం స్వస్థ్ నారి స్వశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝాలు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత ఆధ్వర్యంలో జిల్లా ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ఎంజీలా, డాక్టర్ నహీమా, డాక్టర్ అనిత డాక్టర్ సంపత్, డాక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో శిబిరాలు కొనసాగుతున్నాయి.
జిల్లాలో 125 శిబిరాలు
మహిళల ఆరోగ్యాన్ని పరిరక్షించాలని లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిన స్వస్థ్ నారీ.. స్వశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం అక్టోబరు 2 వరకు కొనసాగుతాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 మండలాలు, సిరిసిల్ల వేములవాడ మున్సిపాలిటీలో 15 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 89 సబ్‌సెంటర్ల పరిధిలో 125 శిబిరాల వరకు నిర్వహించనున్నారు. ఇందులో మెగా వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు. ప్రతిరోజు 10 శిబిరాలు చొప్పున నిర్వహిస్తూ ప్రత్యేక డాక్టర్లతో మహిళలకు స్ర్కీనింగ్, ట్రీట్మెంట్, ఫాలో అప్ పేరుతో పరీక్షలు నిర్వహించడం, వాటికి చికిత్సలు అందించడం, ఇప్పటికే చికిత్స పొందుతున్న వారికి ఎలాంటి చికిత్సలు తీసుకుంటున్నారని కూడా దృష్టి పెడతారు. జిల్లాలో శిబిరాల ద్వారా దాదాపు మూడు లక్షలకు పైగా మహిళకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు.
శిబిరాల్లో పరీక్షలు ఇలా..
ఆరోగ్య మహిళ లక్ష్యంగా మొదలైన వైద్య శిబిరాల్లో ఈఎన్‌టీ, కంటి, బీపీ, మధుమేహం, దంత పరీక్షలు, నోటి, రొమ్ము, ఇతర క్యాన్సర్లు, రక్తహీనత, టెలిమానస్ సేవలు, గర్భిణులకు ఆరోగ్య పరీక్షలు, సికిల్‌సెల్ ఎనీమియా, చర్మ, టీబీ సంబంధమైన వంటి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతోపాటు మహిళకు పోషకాహారంపై కల్పిస్తున్నారు. చక్కెర, వంట నూనెల తగ్గించడం ద్వారా తగ్గించుకునే ఆలోచనలు పెంపొందిస్తుందని జిల్లాలో ప్రతిరోజు మూడు వేల మంది మహిళలకు పరీక్షలు అందిస్తున్నారు.