వేములవాడ పట్టణ బంద్ ప్రశాంతం..
ABN , Publish Date - May 15 , 2025 | 12:27 AM
వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని మూసివేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజ న్న ఆలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన పట్టణ బంద్ ప్రశాంతంగా జరిగింది.
వేములవాడ, మే 14 (ఆంధ్రజ్యోతి) : వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని మూసివేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజ న్న ఆలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన పట్టణ బంద్ ప్రశాంతంగా జరిగింది. వేములవాడ రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి రామతీర్థపు రాజు తదితరులు అంబేద్కర్ విగ్రహం నుంచి అమరవీ రుల స్తూపం వరకు పాదయాత్ర చేశారు. ఈసందర్భంగా ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేసే విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ఆలయ అభివృద్ధికి ఎన్ని కోట్లు మంజూరయ్యాయో, ఏ రకమైన డిజైన్లు ఖరారు చేశారో వెల్లడిం చకుండానే జూన్ 15 నుంచి ఆలయాన్ని మూసివేసి రాజన్న దర్శనా నికి బదులుగా భక్తులకు భీమేశ్వరాలయంలో దర్శనం కల్పించాలని నిర్ణయించడం సరైంది కాదన్నారు. డిజైన్ల ఖరారు, నిధుల విడుదల విషయంలో రహస్యం పాటించాల్సిన అవసరం ఏముందన్నారు. 1200 సంవత్సరాల చారిత్రాత్మక విశిష్టత కలిగిన ఆలయంలో వాస్తు పేరిట దేవతా విగ్రహాలను కదిలిస్తే సహించబోమని స్పష్టం చేశారు. ఆలయ అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, దర్శనాలు, ఆలయ విస్తరణకు సంబంధించి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని భక్తుల మనోభావాలకు భంగం కలిగించే విధంగా వ్యవహరించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నా మని తెలిపారు. జూన్ 15 నుంచి గుడి మూసివేస్తామని రాష్ట్ర ప్రిన్సిప ల్ సెక్రెటరీ, దేవాదాయ శాఖ కమిషనర్, ప్రభుత్వ విప్ స్వయంగా ప్రకటించారని, భక్తులు, స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండడం తో కిందిస్థాయి ఉద్యోగులతో తప్పుడు సమాచారం ఇప్పిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు నిమ్మ శెట్టి విజయ్, సిరిగిరి రామ చందర్, నరాల శేఖర్, జోగిని శంకర్, నాయకులు రేగుల మల్లికార్జున్, పిన్నింటి హనుమాన్లు, కృష్ణస్వామి, గోపు బాలరాజు, వెంగళ శ్రీకాంత్ గౌడ్, మంద రాజేందర్ తదితరులున్నారు. పట్టణ సీఐ వీరప్రసాద్ నేతృత్వంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
అభివృద్ధిని జీర్ణించుకోలేకనే బంద్‌కు పిలుపు
- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంతో పాటు పట్టణాన్ని అభివృద్ధి చేస్తుండడాన్ని జీర్ణించుకోలేకనే బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు వేములవాడ పట్టణ బందుకు పిలుపు ఇచ్చారని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. వేములవాడ బంద్ నేప థ్యంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వేములవాడ ను అభివృద్ధి చేస్తున్నందుకు స్వాగతించాల్సింది పోయి బంద్ పేరిట అడ్డంకులు సృష్టించడం సమంజసం కాదన్నారు. రాజన్న ఆలయ అభి వృద్ధిలో భాగంగా ఆలయంలో స్వామివారి నిత్య సేవలు యథావిధిగా కొనసాగుతాయని, పనులు జరిగే క్రమంలో భక్తులకు అసౌకర్యం కల గకుండా ప్రత్యామ్నాయంగా భీమేశ్వరాలయంలో దర్శనం కల్పిస్తామ న్నారు. ఆలయ అభివృద్ధి, విస్తరణ కార్యక్రమాలు శృంగేరి పీఠాధిపతి సూచనల మేరకు చేపడుతున్నామని స్పష్టం చేశారు. ఆలయ అభివృద్ధి కి సంబంధించి ఇప్పటికే రూ.76 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలుస్తున్నామని, బడ్జెట్లో ఆలయ అభివృద్ధికి 150 కోట్ల రూపాయలు కేటాయించామని, ఇందులో ఎలాంటి రహస్యం లేదని తెలిపారు. ఆల య మహా మండపాన్ని ముట్టుకునే ప్రసక్తే లేదని, అభివృద్ధి కార్యక్ర మాలు ఆగమ శాస్త్రం ప్రకారం, శృంగేరి పీఠాధిపతి సూచనల మేరకు జరుగుతాయన్నారు. రాజన్న ఆలయ అభివృద్ధిని రాజకీయం చేయకుం డా సహకరించాలని ఆది శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.