అంగన్‌వాడీల్లో కూరగాయల సాగు
ABN , Publish Date - Sep 10 , 2025 | 01:07 AM
చిన్నారులు, గర్భిణులకు పోషకాహారం అందించడంలో అంగన్‌వాడీ కేంద్రాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఈ కేంద్రాల్లో అందించే ఆహారంలో వినియోగించే ఆకుకూరలు, కూరగాయలు అక్కడే పండించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
జగిత్యాల, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): చిన్నారులు, గర్భిణులకు పోషకాహారం అందించడంలో అంగన్‌వాడీ కేంద్రాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఈ కేంద్రాల్లో అందించే ఆహారంలో వినియోగించే ఆకుకూరలు, కూరగాయలు అక్కడే పండించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు కిచెన్ గార్డెన్ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేసింది. తద్వారా అంగన్‌వాడీలకు వచ్చే చిన్నారులు బాలింతలకు నాణ్యమైన పోషకాహారం అందనుంది. జిల్లాలో ఎంపిక చేసిన 107 అంగన్‌వాడీ కేంద్రాల్లో కిచెన్ గార్డెన్ల ఏర్పాటుకు రూ.10 వేల చొప్పున నిధులు కేటాయించగా ఆవరణల్లో తోటలు, కుండీల్లో కూరగాయలు, ఆకుకూరలు పెంచనున్నారు. బయట మార్కెట్లపై ఆధారపడకుండా రసాయన ఎరువులు లేకుండా సేంద్రియ కూరగాయలు పండించడం ద్వారా ఆహార నాణ్యత పెరుగుతుందని అధికారులు అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు పౌష్టికాహార లోపం తీవ్ర సమస్యగా మారింది. ఆయా సెంటర్ల ఆవరణల్లో వంకాయ, బెండ, టమాట, గోంగూర, తోటకూర, పాలకూర వంటివి పెంచుతుండగా పిల్లలకు అవసరమైన విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లు అందించి శారీరక, మానసిక ఎదుగుదలకు తోడ్పడనున్నాయి.
ఫపిల్లలకు తోటలపై అవగాహన..
కూరగాయలు, ఆకుకూరల తోటల పెంపకంలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలది కీలక పాత్ర ఉంటుంది. తోటల నిర్వహణలో పిల్లలను కూడా భాగస్వామ్యం చేయడం ద్వారా వారికి వ్యవసాయం, పర్యావరణంపై అవగాహన కల్పించవచ్చు. కూరగాయలు ఎలా పండుతాయి, వాటిని ఎలా సంరక్షించాలి అనే విషయాలు పిల్లలకు నేరుగా అనుభవం ద్వారా తెలుస్తాయి. ఇది ఒక రకంగా ప్రయోగాత్మక విద్యగా కూడా ఉపయోగపడుతుందని అధికారులు అంటున్నారు.
ఫనిధుల వినియోగంపై శిక్షణ..
ఒక్కో అంగన్‌వాడీ సెంటర్‌కు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.10 వేలు నిధులు ఎలా వినియోగించాలి, ఏ మొక్కలు నాటాలి, తోటను ఎలా నిర్వహించాలి అనే విషయాలపై టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ నిధులతో విత్తనాలు, కుండీలు, మట్టి ఇతర పనిముట్లు కొనుగోలుకు వినియోగించాల్సి ఉంటుంది. ఐదేళ్ల పాటు కిచెన్ గార్డెన్లను నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే పటిష్ట పర్యవేక్షణ అవసరమని తల్లిదండ్రులు అభిప్రాయ పడుతున్నారు.
ఫవిత్తనాల సరఫరా..
కూరగాయలు, ఆకుకూరల పెంపకానికి పక్కా అంగన్‌వాడీ భవనాలు, సొంత స్థలాలు, నీటి సరఫరా, ప్రహరీ ఉన్న కేంద్రాలను ఎంపిక చేశారు. ప్రతి కేంద్రానికి టమాట, బెండకాయ, వంకాయతో పాటు ఆకుకూరల సాగుకు అవసరమైన విత్తన పాకెట్లను కూడా ప్రభుత్వం సరఫరా చేసింది. దీనికి సంబంధించిన డబ్బులు సంవత్సరానికి రూ. 500 చొప్పున చెల్లిస్తారు. సంవత్సరానికి రూ. వెయ్యి నిర్వహణకు అందజేస్తారు.
పౌష్టికాహారం అందించేందుకే..
-బోనగిరి నరేశ్, జిల్లా సంక్షేమశాఖ అధికారి
అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించేందుకే సొంతంగా కూరగాయల సాగు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం జిల్లాలో అన్ని సౌకర్యాలు గల 107 అంగన్‌వాడీ కేంద్రాలను ప్రస్తుతానికి ఎంపిక చేశాం. ఆయా సెంటర్లకు విత్తనాలు ఇప్పటికే పంపిణీ చేయగా నిర్వహణ ఖర్చులు కూడా అందిస్తాం.