యూరియా బేఫికర్..
ABN , Publish Date - Dec 25 , 2025 | 12:57 AM
యాసంగిలో రైతులకు యూరియా తిప్పలు తప్పించే దిశగా ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు చేపట్టింది. వానాకాలం సీజన్లో ఎరువుల కోసం రైతులు గంటలు, రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడి ఇబ్బందులు పడ్డారు. చెప్పులు, పాసుబుక్కులు క్యూలైన్లలో పెట్టారు.
- పకడ్బందీగా సరఫరాకు చర్యలు
- యాప్ ద్వారా బుకింగ్
- రైతులను వెంటాడుతున్న సాంకేతిక సమస్యలు
- మిగతా ఎరువులు ఈ-పాస్ ద్వారా విక్రయాలు
- జిల్లాలో యాసంగి సాగు 1.98 లక్షల ఎకరాల లక్ష్యం
- వరి సాగు 1.83లక్షల ఎకరాలు
- 45312 మెట్రిక్ టన్నులు ఎరువులు
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
యాసంగిలో రైతులకు యూరియా తిప్పలు తప్పించే దిశగా ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు చేపట్టింది. వానాకాలం సీజన్లో ఎరువుల కోసం రైతులు గంటలు, రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడి ఇబ్బందులు పడ్డారు. చెప్పులు, పాసుబుక్కులు క్యూలైన్లలో పెట్టారు. పోలీస్ బందోబస్తుతో ఎరువులు సరఫరా చేసిన పరిస్థితులు ఎదుర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తాజాగా ఈనెల 20వ తేదీ నుంచి స్లాట్ బుకింగ్‌తో యూరియా కొనుగోలుకు శ్రీకారం చుట్టింది. యూరియా సరఫరా చేసే అంశంలో ప్రభుత్వ నిర్ణయంపై మొదట్లో స్పందన కనిపించకపోయినా తర్వాత యాప్ వల్ల ప్రయోజనం కలుగుతుందని ఆలోచనల్లోకి రైతులు వచ్చారు. రైతులు తమ అవసరాలకు అనుగుణంగా యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకుంటే మూడు విడతలుగా సమీప డీలర్ నుంచి యూరియా పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన యాప్‌ను ప్లేస్టోర్ ద్వారా మొబైల్‌లో డౌన్లోడ్ చేసుకుని యూరియాను బుక్ చేసుకోవచ్చు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూరియా వాడకం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో యాప్ ద్వారా యూరియా బుకింగ్‌తో సరఫరా చేయడం అవసరం మేరకే యూరియా వినియోగం కూడా అవుతుందని ఆలోచనలో ఉన్నారు. మొబైల్ యాప్ ద్వారా రైతులు యూరియా బుక్ చేసిన వెంటనే మొబైల్‌కు ఐడీ వస్తుంది. దాని ఆధారంగా రైతులు తాము ఎంచుకున్న డీలర్ నుంచి యూరియా కొనుగోలు చేసుకోవచ్చు. అంతేకాకుండా యాప్‌ను ఓపెన్ చేయగానే ఏ డీలర్ల వద్ద యూరియా నిల్వలు ఉన్నాయో కూడా తెలుస్తుంది. దానికి అనుగుణంగా యూరియా బుక్ చేసుకోవచ్చు. స్లాట్ బుక్ చేసుకున్న 48 గంటల్లోనే యూరియా తీసుకోవాల్సి ఉంటుంది.
ఎకరానికి మూడు బస్తాలు..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రస్తుత యాసంగి సాగు 1,93,837 ఎకరాల్లో ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో వరి 1,83,850 ఎకరాల్లో, మొక్కజొన్న 2,,135 ఎకరాలు, నువ్వులు 490 ఎకరాలు, పొద్దుతిరుగుడు 1,107 ఎకరాలు, కందులు 375 ఎకరాలు, వేరుశనగ 35 ఎకరాలు, పెసర 81ఎకరాలు, చెరుకు 20ఎకరాలు, జొన్న నాలుగు ఎకరాలు, ఇతర పంటలు 6,745 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనాలు వేశారు. ఇందుకోసం ఎరువులు 45,312 మెట్రిక్ టన్నులు అవసరం అవుతాయని అంచనాలు వేశారు. ఇందులో యూరియా 23,128 మెట్రిక్ టన్నులు, డీఏపీ 3,562 మెట్రిక్ టన్నులు, ఎన్‌పీకేఎస్ 12,211 మెట్రిక్ టన్నులు, ఎంవోపీ 4,885 మెట్రిక్ టన్నులు, ఎస్‌ఎస్‌పీ 1,526 మెట్రిక్ టన్నులు అవసరం అవుతాయని అంచనాలు వేశారు. ఇందులో యూరియాను యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకొని తీసుకోవలసి ఉంటుంది. మిగతా ఎరువులు ఈ-పాస్ ద్వారా నేరుగా డీలర్లు విక్రయిస్తారు. యూరియా సరఫరాను పారదర్శకంగా చేపట్టే దిశగా యూరియా బుకింగ్ 15 రోజులకు ఒకసారి చేసుకునే వీలు కల్పించారు. రైతుకు ఎకరానికి మూడు బస్తాల చొప్పున ఇస్తారు. రైతుకు పది ఎకరాల సాగు ఉంటే యూరియా బస్తాలు మూడు చొప్పున 30 బస్తాలు సరఫరా చేస్తారు. ప్రస్తుతం కేటాయింపుల్లో అడిగినంత సరఫరా చేసే విధంగా నిర్ణయించారు. ఐదు నుంచి 20 ఎకరాల వరకు ఉన్న వారికి మూడు విడతల్లో, 20ఎకరాల పైన ఉన్నవారికి నాలుగు విడతల్లో యూరియా బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. యాప్‌లో వివరాల ఆధారంగా యూరియా సరఫరా పంపిణీ పారదర్శకత ఉంటుందని అధికారులు చెబుతున్నారు. డిజిటల్ వ్యవస్థ ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం కోసం యాప్ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. సరికొత్త విధానం ద్వారా ఎరువుల సరఫరా సాఫీగా జరుగుతుందని రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.
సాంకేతిక సమస్యలకు చెక్
రైతులకు యూరియాను పారదర్శకంగా ఇబ్బందులు లేకుండా సరఫరా చేసే దిశగా తీసుకువచ్చిన యాప్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యలను వెంటవెంటనే పరిష్కరిస్తున్నారు. ఫోన్ నంబర్ సమస్యతోపాటు యాప్ హ్యాంగ్ కావడం వాటి సమస్యలు వస్తున్నాయి. దీంతో వ్యవసాయ శాఖ అధికారులు సమస్యలు అన్నిటిని తొలగించి యాప్ సవ్యంగా ఉపయోగపడే విధంగా మార్పులు చేశారు. యూరియా బుకింగ్‌లో రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. జిల్లాలో ఎక్కడైనా చిన్నచిన్న లోపాలు కనిపిస్తే వ్యవసాయ అధికారులు యాప్ తయారుచేసిన నిపుణులకు సమాచారం ఇవ్వడంతో వాటిని తొలగిస్తున్నారు. మూడు రోజులుగా సాంకేతిక సమస్యలు దాదాపుగా తొలగించి రైతుల ఇబ్బందులు తొలగించినట్లుగా తెలుస్తోంది.