పట్టణ ప్రకృతి వనాన్ని అభివృద్ధి చేయాలి
ABN , Publish Date - Aug 09 , 2025 | 12:13 AM
నగరంలోని కరీంనగర్-సిరిసిల్ల బైపాస్ రోడ్‌లోని బృహత్ పట్టణ ప్రకృతి వనాన్ని అభివృద్ధి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి మున్సిపల్ అధికారులకు సూచించారు. ఈ వనాన్ని కలెక్టర్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు.
కరీంనగర్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నగరంలోని కరీంనగర్-సిరిసిల్ల బైపాస్ రోడ్‌లోని బృహత్ పట్టణ ప్రకృతి వనాన్ని అభివృద్ధి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి మున్సిపల్ అధికారులకు సూచించారు. ఈ వనాన్ని కలెక్టర్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ వనాన్ని మరింత అభివృద్ధి చేయాలని, ఇక్కడ ఉన్న నీటి కొలనులను అభివృద్ధి చేసి కలువ మొక్కలతోపాటు రకరకాల పూల మొక్కలు పెంచాలని సూచించారు. కొత్తగా నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని, ఖాళీ స్థలంలో మరిన్ని మొక్కలు నాటాలని అన్నారు. పట్టణ ప్రకృతి వనాన్ని సందర్శకులకు అనుకూలంగా తీర్చిదిద్దాలని అన్నారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ పాల్గొన్నారు.
ఫ అంగన్‌వాడీల్లో పౌష్టికాహారం
మానకొండూర్: అంగన్‌వాడీల్లో పిల్లలకు పౌష్టికాహారం అందుతుందని కలెక్టర్ పమేలా స్పత్పతి సూచించారు. మండలంలోని అన్నారంలో శుక్రవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం సభ జరిగింది. ఈ సభలో ఆమె పాల్గొని మాట్లాడుతూ గ్రామంలో 12 వందల కుటుంబాలుండగా నాలుగువేల జనాభా ఉందన్నారు. గర్భిణులు, బాలింతలు ఎక్కువగా అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదు చేసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో 80 మంది పిల్లలు నమోదు చేసుకున్నప్పటికి 39 మంది పిల్లలు ప్రైవేటు పాఠశాలలకు వెళుతున్నట్లు రికార్డులు చెప్పుతున్నాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం లభిస్తుందన్నారు. గర్భిణులు, మహిళలు, పిల్లలకు అంగన్‌వాడీల ద్వారా అన్ని రకాల పోషకాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో వెంకటరమణ, ఐసీడీఎస్ జిల్లా అధికారి సరస్వతి, ఎంపీడీవో వరలక్ష్మి, పీహెచ్‌సీ వైద్యులు సల్మాన్, రాజునాయక్ పాల్గొన్నారు.