నిరుపయోగంగా సెగ్రిగేషన్ షెడ్లు
ABN , Publish Date - Nov 22 , 2025 | 12:40 AM
జిల్లాలోని పలు గ్రామాల్లో పారిశుధ్యం పెంపునకు ప్రభుత్వం దృష్టి సారించింది. గ్రామాల్లో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోవడంతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారని గుర్తించింది.
- గ్రామాల్లో కొరవడిన పారిశుధ్యం
- జిల్లాలో 263 షెడ్ల నిర్మాణం
- లక్షలు వెచ్చించి లక్షణంగా వదిలేశారు
సుల్తానాబాద్, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు గ్రామాల్లో పారిశుధ్యం పెంపునకు ప్రభుత్వం దృష్టి సారించింది. గ్రామాల్లో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోవడంతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారని గుర్తించింది. అందుకు తడి, పొడి చెత్త వేరు చేసి గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా ఉపాధిహామీ తోపాటు పలు పథకాల నిధులతో సెగ్రిగేషన్ షెడ్లు నిర్మించింది. అయితే లక్ష్యం మేరకు వాటి పనితీరు లేకపోవడంతో ఎక్కడి చెత్త అక్కడే దర్శనమిస్తోంది. లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన షెడ్లు చాలా గ్రామాల్లో నిరుపయోగంగా మారాయి. చెత్త వేరు చేయడం, సేంద్రియ ఎరువుల తయారీ, గ్రామపంచా యతీలకు ఆదాయం సమకూర్చేందుకు ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు నిలిచిపోయింది. గ్రామాల్లో ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ పారిశుధ్యంపై దృష్టి సారించిన ప్రభుత్వాలు లక్షలాది రూపాయలు వెచ్చించి మౌలిక వసతులు కల్పించింది. పారిశుధ్య కార్మికుల నియా మకం, ట్రాక్టర్ల కొనుగోలు, షెడ్డుల నిర్మాణం తదితర పనులు చేపట్టి, తడిపొడి చెత్తలను వేరుచేసి సేంద్రియ ఎరువుల తయారీకి శ్రీకారం చుట్టింది. ప్రారంభించిన కొద్ది రోజులు సక్రమంగా నడిచిన తరువాత నిరుపయో గంగా మారాయి.
పంచాయతీల పాలకవర్గం గడువు ముగియడంతో గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయాయి. ఆయా గ్రామాలకు నియమితులైన మండల స్పెషల్ అధికా రులు పంచాయతీలను సక్రమంగా పర్యవేక్షణ చేయక పోవడం, వ్యవస్థ లోపాలతో పూర్తిగా పనికిరాని నిర్మా ణాలుగా మారాయి. ప్రజాధనం వృథా కాకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.
లక్ష్యం ఇలా...
గ్రామాల్లో ప్రతీ ఇంటి నుంచి తడిపొడి చెత్త వేరు చేసి సేకరించాలి. తడి చెత్తతో సేంద్రియ ఎరువులు తయారు చేసి రైతులకు విక్రయించి గ్రామపంచాయతీ లకు ఆదాయం సమకూర్చాలి. అయితే పలు గ్రామాల్లో పారిశుధ్య సిబ్బంది తక్కువ, చెత్త సేకరణకు వాహ నాలు లేకపోవడం, రోజువారి పర్యవేక్షణ లోపం వల్ల షెడ్లు మూలనపడ్డాయి. కొవిడ్ సమయంలో చెత్తను శుభ్రం చేసిన పంచాయతీలు, ఆ తర్వాత క్రమంగా వీటిని నిర్లక్ష్యం చేశాయి. అప్పటి నుంచి చాలా షెడ్లు మూతపడ్డాయి.
క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం
వీరబుచ్చయ్య, జిల్లా పంచాయతీ అధికారి
సెగ్రిగేషన్ షెడ్ల నిర్వహణ బాధ్యత గ్రామపంచాయతీలు నిర్వహించాల్సి ఉంటుంది. వీటిని ఆయా గ్రామపంచాయతీ కార్యదర్శులు తడి, పొడి చెత్త వేరు చేసిన కంపోస్టు ఎరువును తయారు చేసేలా పర్యవేక్షణ చేయాలి. ఇలా షెడ్లను నిరూపయోగంగా వదిలేయ వద్దు. ఆయా గ్రామపంచాయతీ కార్యదర్శులపై చర్యలు తీసుకొంటాం.
జిల్లాలోని 263 గ్రామ పంచాయతీల్లో నిర్మాణం చేసిన షెడ్లు మూతపడ్డాయి. ఒక్కొక్క షెడ్డుకు రూ.2నుంచి రూ.4 లక్షల నిధులు వెచ్చించారు. జిల్లాలోని మండలాల వారీగా పనులు, నిధుల వివరాలు ఇలా ఉన్నాయి.
మండలం షెడ్లు రూపాయలు
లక్షల్లో
అంతర్గాం 16 40.01
ధర్మారం 29 73.06
ఎలిగేడు 12 32.34
జూలపల్లి 13 33.11
కమాన్‌పూర్ 9 22.53
మంథని 32 82.69
మంథని ముత్తారం 14 35.18
ఓదెల 22 56.15
పాలకుర్తి 19 45.08
పెద్దపల్లి 30 75.12
రామగిరి 16 40.26
కాల్వశ్రీరాంపూర్ 24 60.01
సుల్తానాబాద్ 27 70.31
గ్రామాభివృద్ధి శాఖ ద్వారా షెడ్లను నిర్మించి గ్రామపంచాయతీలకు అప్పగించారు. కొన్నింటిలో గడ్డి పెరిగి పాడుపడ్డాయి. కొన్నింటిలో చెత్తను వేరు చేయకుండా అలాగే చెత్త కుప్పగా డంప్ యార్డులను తలపిస్తున్నాయి.