Share News

జిల్లా సమస్యలపై నేడు తుమ్మల సమీక్ష

ABN , Publish Date - Jun 22 , 2025 | 01:17 AM

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఇంచార్జి మంత్రిగా ఇటీవలే నియమితులైన రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తొలిసారిగా ఆదివారం ఉదయం జిల్లాకు రానున్నారు.

జిల్లా సమస్యలపై నేడు తుమ్మల సమీక్ష

కరీంనగర్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఇంచార్జి మంత్రిగా ఇటీవలే నియమితులైన రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తొలిసారిగా ఆదివారం ఉదయం జిల్లాకు రానున్నారు. ఆయన కలెక్టరేట్‌లో ఉదయం 11 గంటలకు జరగనున్న సమావేశంలో పాల్గొని వ్యవసాయ, విద్యాశాఖల కార్యక్రమాలను సమీక్షిస్తారు. ఈ సమీక్షా సమావేశంలో ఉమ్మడి జిల్లా పరిధిలోని మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ కూడా పాల్గొంటారు. జిల్లాకు చెందిన శాసన సభ్యులు, విద్య, వ్యవసాయ శాఖల జిల్లా అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఇటీవలి వరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి జిల్లాకు ఇన్‌చార్జిగా మంత్రిగా ఉండేవారు. ఆయన మే 29న ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా సమీక్షా సమావేశాన్ని నిర్వహించి ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి, వ్యవసాయశాఖలపై మంత్రులతో కలిసి సమీక్షించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి జిల్లా ఇన్‌చార్జి మంత్రులను మార్చి వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావును ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా నియమించారు. ఇటీవలే ఆ బాధ్యతలు చేపట్టిన తుమ్మల నాగేశ్వర్‌రావు తొలిసారిగా ఆ హోదాలో జిల్లాకు వస్తున్నారు.

సమస్యలు, ప్రగతిపై చర్చ

రైతులు వానాకాలం సాగుకు సన్నద్ధం కావడం, పాఠశాలలు ప్రారంభం కావడంతో ఆ రెండు శాఖలకు చెందిన సమస్యలు, ప్రగతిని సమీక్షించాలని భావించి ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. ఆరు రోజుల క్రితం రైతు భరోసా సాయం రైతుల ఖాతాల్లో జమ చేయడం ప్రారంభమయింది. జిల్లాకు ఈ సీజన్‌లో 2,10,904 మంది రైతులకు 211.90 కోట్లు రైతు భరోసా సాయంగా ఇవ్వాల్సి ఉంటుందని గుర్తించారు. ఇప్పటికే 1,85,576 మంది రైతుల ఖాతాల్లో 193.18 కోట్లు జమయ్యాయి. మరో 25,328 మంది రైతుల ఖాతాల్లో 18.72 కోట్లు జమకావాల్సి ఉన్నది. వచ్చే సోమ, మంగళవారాల్లో ఈ నిధులు ఆయా రైతుల ఖాతాల్లోకి చేరతాయని భావిస్తున్నారు. ఈ సీజన్‌లో వరి ప్రధాన పంటగా ఉండగా పత్తి, మొక్కజొన్న సాగు కూడా చేస్తున్నారు. ఇప్పటికే ఎరువులు విత్తనాలు, అందుబాటులోకి వచ్చాయి. ప్రధానం గా పత్తి విత్తనాల్లో నకిలీలు, నిషేధించిన బీటీ విత్తనాలు వస్తున్నాయనే ఆరోపణలున్నాయి. పామాయిల్‌ సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించి ఈ జిల్లాలో కార్యక్రమాన్ని చేపట్టినా ఆశించినంతగా రైతులు ఆసక్తి చూపించడం లేదు. పామాయిల్‌ సాగు విషయంలో రైతులకు అవగాహన కల్పించి చైతన్యవంతులను చేయాల్సిన అవసరం ఉన్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. జిల్లాలో పచ్చిరొట్ట విత్తనాలకు డిమాండ్‌ ఉన్నా తక్కువ మొత్తంలో సబ్సిడీపై అందజేశారని, ఆ విత్తనాల కోటా పెంచాలని రైతులు అభిప్రాయపడుతున్నారు. అలా గే వ్యవసాయ యాంత్రీకరణ కోసం సబ్సిడీపై పనిముట్లు ఇవ్వడం లేదు. అన్నిరకాల పనిముట్లను సబ్సిడీపై అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతు న్నారు. స్పింక్లర్లు, బిందుసేద్యానికి కూడా మరింత ప్రాధాన్యం ఇచ్చి నిధులు విడుదల పెంచాలని రైతులు కోరుతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని పలు ప్రాథమిక పాఠశాలల్లో ఇప్పటికీ కనీస వసతులు లేకుండా పోయాయి. మూత్రశాలలు కూడా లేని ప్రాథమిక పాఠశా లలు, ఉన్నత పాఠశాలలు ఎన్నో ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో ఇద్దరే ఉపాధ్యాయులు ఉంటున్న కారణంగా ఒకటి నుంచి 5వ తరగతి వరకు వారే అన్ని సబ్జెక్టులు బోధించడానికి 18 తరగతులు తీసుకోవాల్సి ఉంటుంది. నిత్యం జిల్లా కేంద్రానికి ఏదో ఒక సమాచారం పంపించ డానికే ఒక ఉపాధ్యాయుడు ఎక్కువ సమయం వెచ్చించాల్సి రావడంతో విద్యాబోధన కుంటు పడుతున్నదని, దీంతో విద్యార్థులు ప్రైవేట్‌ పాఠశాలలవైపు వెళ్తున్నారని అంటున్నారు. విద్యా ర్థులు ప్రైవేట్‌ పాఠశాలలకు వెళ్లినచోట రేషనలైజేషన్‌ పేరిట పాఠశాలలను కుదించేస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్యను పెంచి మెరుగైన విద్యాభోధన చేయాల్సిన అవసరం ఉందని, అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీరు లాంటి కనీస వసతులు సమకూర్చాలని కోరుతున్నారు.

Updated Date - Jun 22 , 2025 | 01:17 AM