Share News

పారదర్శకంగా డీసీసీ అధ్యక్షుడి నియామకం

ABN , Publish Date - Oct 18 , 2025 | 12:10 AM

కాంగ్రెస్‌ పార్టీ జిల్లా రథసారథుల నియామకం పారదర్శకంగా చేపట్టామని, కార్యకర్తల అభీష్టం మేరకే నిర్ణయం ఉంటుందని ఏఐసీసీ పరిశీలకుడు, మాజీ ఎంపీ డాక్టర్‌ జయకుమార్‌ అన్నారు.

పారదర్శకంగా డీసీసీ అధ్యక్షుడి నియామకం
మాట్లాడుతున్న ఏఐసీసీ పరిశీలకులు, మాజీ ఎంపీ జయకుమార్‌

- ఏఐసీసీ పరిశీలకుడు, మాజీ ఎంపీ డాక్టర్‌ జయ కుమార్‌

- జగిత్యాలలో అభిప్రాయ సేకరణ

జగిత్యాల, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీ జిల్లా రథసారథుల నియామకం పారదర్శకంగా చేపట్టామని, కార్యకర్తల అభీష్టం మేరకే నిర్ణయం ఉంటుందని ఏఐసీసీ పరిశీలకుడు, మాజీ ఎంపీ డాక్టర్‌ జయకుమార్‌ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం సమీపంలోని ఓ పంక్షన్‌ హాలులో డీసీసీ అధ్యక్షుడి ఎన్నికకు సంఘటన్‌ శ్రీజన్‌ అనే పేరుతో జగిత్యాల జిల్లా కాంగ్రెస్‌ ముఖ్య కార్యకర్తలు, నేతల సమావేశం నిర్వహించారు. జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు వేములవాడ నియోజకవర్గం పరిధిలోని మేడిపల్లి, కథలాపూర్‌, బీమారం మండలాలు, చొప్పదండి నియోజకవర్గం పరిధిలోని కొడిమ్యాల, మల్యాల మండలాలకు చెందిన కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు. పలువురు ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. కార్యకర్తలు, నేతల అభిప్రాయాలను సేకరించారు. పలువురు కార్యకర్తలు లిఖిత పూర్వకంగా తమ అభిప్రాయాలను ఏఐసీసీ, పీసీసీ పరిశీలకులకు అందించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఏఐసీసీ పరిశీలకుడు, మాజీ ఎంపీ డాక్టర్‌ జయ కుమార్‌ మాట్లాడారు. దేశంలో కాంగ్రెస్‌ పార్టీ పటిష్టంగా ఉందని, బీజేపీ ప్రభుత్వంలో భద్రత కొరవడిందన్నారు. రాహుల్‌ గాంధీ జోడో యాత్రకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభించిందన్నారు.

అనంతరం మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు ప్రతీఒక్కరు కృషి చేయాలన్నారు. తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా తెలుపవచ్చన్నారు. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తల మనోభావాలను సేకరించి నిర్ణయం తీసుకుంటామన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాలకు పాల్పడుతున్న వ్యక్తులను గుర్తించాలన్నారు. ఆది నుంచి కాంగ్రెస్‌లో పనిచేస్తూ, పార్టీ బలోపేతానికి పనిచేసిన కార్యకర్తలు, నేతలకు సరియైున ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగ్‌ రావు, సీనియర్‌ నాయకులు కల్వకుంట్ల సుజిత్‌రావు, వాకిడి సత్యంరెడ్డి, టీపీసీసీ పరిశీలకులు మహ్మద్‌ ఖాజా ఫకీరోద్దిన్‌, కేతూరి వెంకటేశ్‌, గిరిజ శెట్కార్‌, జనగామ జిల్లా పీసీసీ పరిశీలకులు ఎండీ అవేజ్‌, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కొత్త మోహన్‌, ఆయా మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Oct 18 , 2025 | 12:10 AM