‘రైతు బీమా’కు నేడే ఆఖరు
ABN , Publish Date - Aug 13 , 2025 | 01:08 AM
రైతు బీమా పథకానికి సంబంధించిన దరఖాస్తు గడువు బుధవారంతో ముగియనుంది. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని అమలు చేస్తోంది. బీమా పథకానికి సంబంధించిన ప్రీమియం డబ్బులను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోంది.
జగిత్యాల, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): రైతు బీమా పథకానికి సంబంధించిన దరఖాస్తు గడువు బుధవారంతో ముగియనుంది. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని అమలు చేస్తోంది. బీమా పథకానికి సంబంధించిన ప్రీమియం డబ్బులను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోంది. ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే అతడి కుటుంబ సభ్యులకు రూ.5లక్షల ఆర్థికసాయం అందజేస్తోంది. ఈ పథకానికి జిల్లాలో ఇప్పటి వరకు 1,48,005 మంది రైతులు నమోదు చేసుకున్నారు. జిల్లాలో సుమారు 12,344 మంది కొత్త పట్టాదారులున్నట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఏడేళ్ల వ్యవధిలో పలువురు రైతులు ప్రమాదవశాత్తు మరణించగా, ప్రభుత్వం వారి కుటుంబ సభ్యులకు బీమా డబ్బులు అందించింది. పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న ప్రతి రైతుకు బీమా వర్తించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఫమరో 5 వేల మందికి పైగా..
జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో గల 71 రైతు వేదికల్లో బుధవారం వరకు రైతు బీమా దరఖాస్తులు స్వీకరించనున్నారు. సోమవారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కాగా వ్యవసాయాధికారులు బీమా దరఖాస్తుల సేకరణలో బిజీబిజీగా ఉన్నారు. దరఖాస్తు చేసుకోవాలని ఇప్పటికే ఏఈవోలు వివిధ మాధ్యమాల ద్వారా గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నారు. కాగా ప్రభుత్వం ఈనెల 8వ తేదీన దరఖాస్తుల స్వీకరణకు సర్క్యులర్ జారీ చేసింది. శని, ఆదివారాలు రెండు రోజులు సెలవులు కావడంతో బీమాకు దరఖాస్తు చేసుకునేందుకు రైతులకు వీలు కలగలేదు. కాగా బుధవారం ఒక్క రోజు మాత్రమే గడువు మిగిలింది. ఈసారి 3వేల నుంచి 5 వేల మంది రైతుల కొత్తగా రైతు బీమాకు దరఖాస్తు చేసుకునే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. వీరితో పాటు ఇప్పటివరకు నమోదు చేసుకోని వారి నుంచి కూడా దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న రైతు నామిని పేరు మార్పు చేసుకునే అవకాశమూ కల్పించినట్లు అధికారులు చెబుతున్నారు.
ఫబీమా అర్హతలు
రైతు బీమా దరఖాస్తుకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే రైతులు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల్లోపు ఉండాలి. 1966 ఆగస్టు 13వ తేదీ నుంచి 2007 ఆగస్టు 14వ తేదీ మధ్య జన్మించి ఉండాలి. పుట్టిన తేదీ నిర్ధారణకు ఆధార్‌కార్డు మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటారు. పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు కొత్త పట్టాదారులకు ప్రాధాన్యం ఉంటుంది. రైతు బీమా పోర్టల్‌లో అర్హులైన రైతులను గుర్తించే ప్రక్రియను వ్యవసాయాధికారులు ఇప్పటికే ప్రారంభించారు. రైతు వేదికలో వ్యవసాయాధికారులను సంప్రదించి కొత్త రైతులు వివరాలు నమోదు చేసుకోవచ్చు. అధికారులు కూడా క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ఆన్‌లైన్ చేస్తున్నారు. దరఖాస్తు ఫారానికి పట్టాదారు పాస్ బుక్ లేదా తహసీల్దార్‌తో డిజిటల్ సంతకం కలిగిన డీఎస్ పేపర్, ఆధార్ కార్డు, నామినీ ఆధార్‌కార్డు జిరాక్స్ ప్రతులు జతపరచాల్చి ఉంటుంది.
రైతులు సద్వినియోగం చేసుకోవాలి
-భాస్కర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి
రైతు బీమా పథకాన్ని అర్హులైన ప్రతీ రైతు సద్వినియోగం చేసుకోవాలి. కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారు దరఖాస్తు చేసుకోవాలి. ప్రతీ రైతు నేరుగా ఏఈవోలను సంప్రదించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. కొత్త నమోదు గడువు బుధవారంతో ముగుస్తుంది. రైతులు గమనించి గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి.