Share News

నేడే తుది తీర్పు..

ABN , Publish Date - Dec 17 , 2025 | 12:53 AM

పంచాయతీ ఎన్నికల్లో ఆఖరి తీర్పునకు సర్వం సిద్ధమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంచాయతీ ఘట్టం బుధవారం పూర్తికానున్నది.

నేడే తుది తీర్పు..

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

పంచాయతీ ఎన్నికల్లో ఆఖరి తీర్పునకు సర్వం సిద్ధమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంచాయతీ ఘట్టం బుధవారం పూర్తికానున్నది. జిల్లాలో చివరి మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో గంభీరావుపేట, ముస్తాబాద్‌, వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయడానికి సిబ్బంది గ్రామాలకు వెళ్లారు. మంగళవారం మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాల నుంచి ఎన్నికల నిర్వహణకు కావాల్సిన సామగ్రితో సిబ్బంది వెళ్లగా, కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌, ఎస్పీ మహేష్‌ బీ గీతే, అదనపు కలెక్టర్‌ నగేష్‌లు పరిశీలించారు. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్‌, ఫలితాలు వెల్లడిస్తారు. అనంతరం ఉప సర్పంచ్‌ ఎన్నిక నిర్వహిస్తారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు అధికార యంత్రాంగం పూర్తి చేసింది.

ఫ ఏడు గ్రామాలు, 211 వార్డులు ఏకగ్రీవం

జిల్లాలో 260 సర్పంచ్‌, 2268 వార్డులు ఉండగా మొదటి, రెండో విడత ఎన్నికలను ప్రశాంతంగా ముగించిన అధికారులు చివరి విడతలో 87 సర్పంచ్‌, 762 వార్డులకు నోటిఫికేషన్‌ జారీ చేసి నామినేషన్‌ స్వీకరించారు. ఇందులో ఏడు సర్పంచ్‌, 211 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 80 సర్పంచ్‌, 551 వార్డులకు ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధం చేశారు. సర్పంచ్‌ స్థానాల్లో 379 మంది, వార్డు స్థానాల్లో 1526 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.

ఫ ఎన్నికలకు 2158 మంది సిబ్బంది

ఎన్నికలు నిర్వహించడానికి మంగళవారం 2158 మంది సిబ్బంది 80 గ్రామాలకు ఎన్నికల సామాగ్రితోపాటు చేరుకున్నారు. గంభీరావుపేట, ముస్తాబాద్‌, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లో ఎన్నికల నిర్వహణకు 914 మంది పీవోలు, 1244 మంది ఓపీవో, ఇతర సిబ్బంది ఎన్నికల నిర్వహణలో విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నికల కోసం 551 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా ఎల్లారెడ్డిపేటలో ఏడు జోన్లు, పది రూట్లు, గంభీరావుపేట మండలంలో ఐదు జోన్లు, పది రూట్లు, ముస్తాబాద్‌లో నాలుగు జోన్లు, ఎనిమిది రూట్లు, వీర్నపల్లి రెండు జోన్లు, ఐదు రూట్ల ద్వారా సిబ్బందిని, ఎన్నికల సామగ్రిని గ్రామాలకు తరలించారు. ఎన్నికల ఏర్పాట్లను కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.

ఫ 730 మంది పోలీసులతో భారీ బందోబస్తు

జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్‌, ఓట్ల లెక్కింపు సజావుగా జరిగేలా 730 మంది పోలీస్‌ సిబ్బందిని నియమించారు. మంగళవారం ఎస్పీ మహేష్‌ బిగితే ముస్తాబాద్‌, ఎల్లారెడ్డిపేట గంభీరావుపేట, వీర్నపల్లి మండలాల్లో విధులు నిర్వహించే పోలీసు అధికారులు, సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల జరిగే గ్రామాల్లో 33 రూట్లలో మొబైల్‌ బృందాలు ఏర్పాటు చేశారు. ఆరు జోనల్‌ బృందాలు, నాలుగు క్విక్‌ రియాక్షన్‌ బృందాలు, రెండు స్ట్రైకింగ్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేశారు. నాలుగు మండలాల్లో 17 సమస్యాత్మక గ్రామాలు, 20 సున్నితమైన గ్రామాలను గుర్తించారు. ముస్తాబాద్‌ మండలంలో 6 సున్నితమైన, 7 సమస్యాత్మకమైన గ్రామాలుగా గుర్తించారు. ఎల్లారెడ్డినేటలో 5 సున్నితమైన,5 సమస్యాత్మక గ్రామాలు, వీర్నపల్లిలో 2 సున్నితమైన, ఒకటి సమస్యాత్మక గ్రామాలు, గంబీరావుపేటలో 7 సున్నితమైన, 4 సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించి అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఫ తుది విడతలో 127920 మంది ఓటర్లు

జిల్లాలో 260 గ్రామపంచాయతీలో 3 లక్షల 53 వేల 351 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1701772 మంది, మహిళలు 182559 మంది ఉన్నారు. మూడో విడతలో127920 మంది ఓటర్లు ఉండగా పురుషులు 61928 మంది, మహిళలు 65992 మంది ఉన్నారు. వీరిలో మహిళా ఓట్లే 4064 మంది అధికంగా ఉన్నారు.

మండలం గ్రామపంచాయతీలు పురుషులు మహిళలు మొత్తం

గంబీరావుపేట 19 17811 18996 36807

ముస్తాబాద్‌ 21 18658 19842 38500

వీర్నపల్లి 16 5769 5958 11727

ఎల్లారెడ్డిపేట 24 19690 21196 40886

------------------------------------------------------------------------------------------------------------------------------------------------

మొత్తం 80 61928 65992 127920

------------------------------------------------------------------------------------------------------------------------------------------------

ఎన్నికలు జరిగే సర్పంచ్‌, వార్డులు

మండలం సర్పంచ్‌ స్థానాలు అభ్యర్థులు వార్డులు స్థానాలు అభ్యర్థులు

గంబీరావుపేట 19 92 165 477

ముస్తాబాద్‌ 21 95 152 446

వీర్నపల్లి 16 74 59 137

ఎల్లారెడ్డిపేట 24 118 175 466

------------------------------------------------------------------------------------------------------------------------------------------------

మొత్తం 80 379 551 1526

------------------------------------------------------------------------------------------------------------------------------------------------

Updated Date - Dec 17 , 2025 | 12:53 AM