మద్యం టెండర్లకు వేళాయె..
ABN , Publish Date - Sep 26 , 2025 | 12:53 AM
మద్యం వ్యాపారులు నోటిఫికేషన్‌తో పాటే సిండికేట్ మంతనాలు మొదలుపెట్టారు.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
మద్యం వ్యాపారులు నోటిఫికేషన్‌తో పాటే సిండికేట్ మంతనాలు మొదలుపెట్టారు. గ్రూపులుగా ఏర్పడి మద్యం దుకాణాలను దక్కించుకోవడానికి చర్చలు మొదలుపెట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 48 మద్యం దుకాణాల రిజర్వేషన్ల ఖరారు గురువారం కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆధ్వర్యంలో పూర్తిచేశారు. గౌడ్, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల జనాభా ప్రాతిపదికన మద్యం దుకాణాల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిచేశారు. శుక్రవారం 2025-27 సంవత్సరానికి సంబంధించిన మద్యం టెండర్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేయనుంది. అక్టోబరు 18న తేదీ వరకు టెండర్ల దరఖాస్తులను స్వీకరిస్తారు. అక్టోబరు 23న డ్రా పద్ధతిలో మద్యం దుకాణాలను కేటాయిస్తారు. డిసెంబరు 1వ తేదీ నుంచి కొత్త లైసెన్సులతో దుకాణాలు ఏర్పాటు చేస్తారు. దరఖాస్తుదారులకు ఈసారి అదనంగా రూ లక్ష వడ్డన పెరిగింది. దరఖాస్తు ఫీజు రూ 2 లక్షలు ఉండగా ఈసారి రూ 3 లక్షలకు పెరిగింది. లైసెన్స్ కాలం డిసెంబరు 1, 2025 నుంచి 30 నవంబరు 2027 వరకు నిర్ణయించారు. ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేయడంతోనే జిల్లాలో మద్యం వ్యాపారులు కలిసికట్టుగా టెండర్లను దక్కించుకునే విధంగా మంతనాలు ప్రారంభించారు. జిల్లాలో కొత్త మద్యం కిక్కు కోసం సిండికేట్‌గా మారడానికి సిద్ధమవుతున్నారు. టెండర్లు దక్కించుకోవడానికి గౌడ, ఎస్సీ సామాజిక వర్గాలను కూడా సిండికేట్‌లో భాగస్వామ్యం చేయడానికి సిద్ధమవుతున్నారు. మద్యం టెండర్ వస్తే భారీగా ఆదాయం సమకూరుతుందనే భ్రమలో లక్షలు పోగొట్టుకున్నవారు ఉన్నారు.
గతంలో దరఖాస్తుల రుసుంతో 40.72 కోట్ల ఆదాయం
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత లైసెన్స్ పీరియడ్‌లో 48 దుకాణాలకు డ్రా పద్ధతిలో మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. 2023-25 కాలానికి సంబంధించి మద్యం వ్యాపారులు భారీగా దరఖాస్తులు చేసుకున్నారు. 2023 ఆగస్టులో జరిగిన టెండర్లలో 2036 మంది దరఖాస్తులు చేసుకోగా, 150 మంది మహిళలు ఉన్నారు. దరఖాస్తు రుసుము రూ. 2లక్షలు ఉండడంతో ఎక్సైజ్ ఖజానాకు జిల్లా నుంచి 40.72 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి దరఖాస్తు ఫీజు పెరిగింది. గతంలో రూ రెండు లక్షలు ఉండగా, ఈసారి మూడు లక్షలకు పెంచారు.
ఆరు స్లాబ్‌ల్లో లైసెన్స్ ట్యాక్స్
మద్యం దుకాణాలను 2011 జనాభా లెక్కల ప్రకారం ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం జనాభా లెక్కలు జరగలేదు కాబట్టి మద్యం దుకాణాలు పెరిగే అవకాశం లేదు. 5 వేల జనాభా ఉన్న ప్రాంతాలకు లైసెన్స్ టాక్స్ రూ 50 లక్షలు, 5 నుంచి 50 వేల వరకు జనాభా ఉంటే రూ 55 లక్షలు, 50 వేల నుంచి లక్ష జనాభా వరకు రూ 60 లక్షలు, లక్ష నుంచి 5 లక్షల వరకు జనాభా ఉంటే రూ 65లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల వరకు రూ 85 లక్షల ట్యాక్స్ వసూలు చేస్తారు. 20 లక్షల పైన జనాభా ఉంటే రూ 1.10 కోట్లు ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. డ్రా పద్ధతి ద్వారా దుకాణాలు కేటాయిస్తారు. డిసెంబరు 1,2025 నుంచి కొత్త దుకాణాలు ప్రారంభమవుతాయి.
ఇప్పటివరకు రూ 951కోట్ల మద్యం విక్రయాలు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మద్యం అమ్మకాల ద్వారా ఎక్సైజ్ శాఖకు భారీ రాబడి ఉంది. 1డిసెంబరు 2023 నుంచి25 సెపెంబరు 20225 వరకు జిల్లాలో వచ్చిన ఆదాయం రూ 951 కోట్లు ఉంది, 1 డిసెంబరు 2021 నుంచి 30 నవంబరు 2023 వరకు రూ 996 కోట్ల ఆదాయం సమకూరింది.